
గూడు కుదిరేనా?
దరఖాస్తులు 1,09,525 లక్షలు
అర్హులు 64,789
కేటాయింపు 15,500 ఇళ్లు
ఒక్కో నియోజకవర్గానికి 1250 గృహాలు
ఎమ్మెల్యేల నుంచి ఇంకా అందని {పతిపాదనలు
బడ్జెట్ కేటాయింపులను బట్టే నిర్మాణం అంటున్న అధికారులు
పేదోడి సొంతింటి కల ఓ ప్రహసనంగా మారిపోయింది. తిన్నా తినకపోయినా ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ జీవనాన్ని సాగిస్తున్న నిత్య శ్రామికుడు సేదతీరేందుకు కనీసం ఓ గూడు లేక అల్లాడిపోతున్నాడు. పేదల సంక్షేమం కోసం నిరంతరం శ్రమిస్తున్నామని ఆర్భాటంగా ప్రకటించుకుంటున్న పాలకులు పట్టించుకున్న పాపాన పోలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎన్టీఆర్ గ్రామీణ గృహనిర్మాణ పథకం కింద జిల్లాకు కేటాయించిన గృహాల సంఖ్యే పేదోడి సంక్షేమంపై ప్రభుత్వానికున్న చిత్తశుద్ధిని తెలియజేస్తోంది.
మచిలీపట్నం : జిల్లాలోని పేదలకు పక్కా గృహాల నిర్మాణం అంశం మూడడుగులు ముందుకు, ఆరడుగులు వెనక్కి అన్న చందంగా మారింది. ఎన్టీఆర్ గ్రామీణ గృహ నిర్మాణ పథకం కింద జిల్లాకు 2015-16 ఆర్థిక సంవత్సరంలో 15,500 గృహాలను మాత్రమే కేటాయించారు. ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేల నుంచి లబ్ధిదారుల జాబితాలు గృహనిర్మాణ శాఖకు పంపితే ఇళ్లు నిర్మించుకునేందుకు అనుమతులు మంజూరవుతాయి. ప్రభుత్వం అరకొర కేటాయించినా... లబ్ధిదారుల జాబితాలను ఎమ్మెల్యేలు, జన్మభూమి కమిటీ సభ్యులు ఇంకా ఖరారు చేయని పరిస్థితి నెలకొంది. ఎమ్మెల్యేల నుంచి జాబితాలు వస్తే వాటిని కలెక్టర్ అనుమతి కోసం పంపుతామని గృహనిర్మాణ శాఖాధికారులు చెబుతున్నారు. పక్కా గృహాల నిర్మాణంలో లబ్ధిదారుల ఎంపిక విషయంలో జన్మభూమి కమిటీ సభ్యుల ప్రమేయం అధికం కావడం చర్చనీయాంశంగా మారింది.
64,789 మంది అర్హులుగా గుర్తింపు...
జిల్లాలో జన్మభూమి - మా ఊరు, మీకోసం కార్యక్రమాల్లో 1,09,525 దరఖాస్తులు గృహనిర్మాణం నిమిత్తం వచ్చాయి. వీటిని తనిఖీ చేసిన అధికారులు 64,789 మందిని అర్హులుగా, మిగిలిన 44,736 మందిని అనర్హులుగా గుర్తించారు. మచిలీపట్నం మండలానికి 500 గృహాలను కేటాయించి మిగిలిన 12 నియోజకవర్గాలకు ఒక్కొక్క నియోజకవర్గానికి 1250 చొప్పున కేటాయించారు. వాటిలో 845 ఎన్టీఆర్ గృహనిర్మాణ పథకం ద్వారా, 405 గృహాలు ఇందిరా ఆవాస యోజన పథకం ద్వారా నిర్మించాలని నిర్ణయించారు. 1.09 లక్షల దరఖాస్తులు రాగా దాదాపు 65 వేల మందిని అర్హులుగా గుర్తించి 15,500 గృహాలే కేటాయించడం గమనార్హం. ఆయా నియోజకవర్గాల్లో ఎవరికి గృహాలు కేటాయిస్తారు. ఈ కేటాయింపులో అధికార పార్టీ నాయకుల ప్రమేయం తదితర అంశాలపై లబ్దిదారుల్లో చర్చ జరుగుతోంది. 15,500 గృహాల్లో ఎస్సీలకు 3,590, ఎస్టీలకు 1406 ఇతరులకు 10,504 చొప్పున కేటాయించారు. ఒక్కొక్క గృహాన్ని రూ.2.75 లక్షలతో నిర్మించాల్సి ఉంది. ఎస్సీ, ఎస్టీలకు రాష్ట్ర ప్రభుత్వ సబ్సిడీగా రూ.1.75 లక్షలు, రుణంగా లక్ష రూపాయలు, ఇతరులకు ప్రభుత్వ సబ్సిడీ రూ. 1.25, రుణంగా రూ. 1.50 లక్షలు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. జిల్లాకు కేటాయించిన 15,500 గృహాల్లో ప్రభుత్వం నుంచి ఇప్పటికే ఇళ్లస్థలాలు పొందిన వారికి 50 శాతం గృహాలు ఇవ్వాలని నిర్ణయించినట్లు ఆ శాఖ అధికారులు చెబుతున్నారు.
రెండేళ్లుగా మంజూరే లేదు
టీడీపీ ప్రభుత్వం అధికారం చేపట్టి 22 నెలలు గడిచినా ఇంతవరకు ఒక్క నూతన గృహ నిర్మాణానికీ అనుమతులు మంజూరు చేయలేదు. 2015-16 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి గృహాలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. మరో 21 రోజుల్లో మార్చి నెల ముగియనుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్‌లో గృహనిర్మాణ శాఖకు కేటాయించే నిధులను బట్టే గృహాల నిర్మాణం జరుగుతుందని ఆ శాఖ అధికారులు అంటున్నారు. ఈ నేపథ్యంలో పక్కా గృహాల నిర్మాణం కోసం ఎదురుచూస్తున్న పేదలకు ప్రభుత్వం ఎంతమేర న్యాయం చేస్తుందనే అంశం చర్చనీయాంశంగా మారింది. మరోపక్క గతంలో నిర్మించిన గృహాలకు సంబంధించి రూ.12 కోట్లకు పైగా బిల్లులను లబ్ధిదారులకు ఇవ్వాల్సి ఉంది. ఇటీవల రూ.8 కోట్లను విడుదల చేశారు. మిగిలిన రూ.4 కోట్ల బకాయి ఎప్పటికి విడుదల చేస్తారో వేచిచూడాలి.