మనోహర్ ఇంటి ముందు వేసిన రోడ్డు
చిత్తూరు, కుప్పం: సీఎం పీఏ మెప్పుకోసం కుప్పం అధికార పార్టీ నాయకులు, కాంట్రాక్టర్లు అత్యుత్సాహం చూపిస్తున్నారు. బాగున్న రోడ్డుకు మళ్లీ మరమ్మతులు చేపట్టి ప్రజా ధనాన్ని సైతం వృథా చేస్తున్నారు. ఐదేళ్ల క్రితం అప్పటి జిల్లా పరిషత్ చైర్మన్ సుబ్రమణ్యంరెడ్డి హయాంలో రూ.5 లక్షల వ్యయంతో సీఎం పీఏ మనోహర్ ఇంటి ముందు, ఓ విద్యా సంస్థకు అనుకూలంగా సిమెంటు రోడ్డును ప్రత్యేకంగా వేశారు. అప్పట్లో జెడ్పీ చైర్మన్ అనుచరుడిగా ఉన్న దళవాయికొత్తపల్లెలోని ఓ నాయకుడు కాంట్రాక్టు పనులు తీసుకుని ఈ రోడ్డు పనులను పూర్తి చేశాడు. ప్రస్తుతం ఇదే కాంట్రాక్టరు అధికారం మారడంతో పార్టీలు మారాడు. ఆ కాంట్రాక్టరే మళ్లీ నాయకుడిగా అవతారమెత్తాడు. పాత రోడ్డును పూర్తిగా తవ్వి రూ.20లక్షలతో మరమ్మతులతో రోడ్డు పూర్తి చేశాడు. అప్పట్లో సిమెంటు రోడ్డుకు ఓ వైపు నిర్మించిన కాలువ సైతం ఇప్పటికీ దర్శనమిస్తోంది.
అధికార దుర్వినియోగం...
సీఎం పీఏ మనోహర్ మెప్పు పొందేందుకు స్థానిక నేతలు ఇలా ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారు. పట్టణంలో గుంతలమయమై నడవలేని స్థితిలో చాలా రహదారులు ఉన్నాయి. ప్యాలెస్ ఎక్స్‌టెన్షన్‌లో ఇప్పటికీ మురుగునీరు రోడ్లపై ప్రవహిస్తున్నా పట్టించుకునేవారే లేరు. అధికార పార్టీ నేతలకు మాత్రం వేసిన రోడ్లనే మళ్లీ వేస్తూ ప్రజాధనాన్ని స్వప్రయోజనం కోసం వినియోగిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment