ఆటోలో వేస్తున్న నూనె డబ్బాలు
బ్రహ్మంగారిమఠం: ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్రస్వామి సన్నిధిలో అక్రమాల పర్వం కొనసాగుతోంది. దేవస్థానంలో దీపారాధన కోసం భక్తులు కానుకగా ఇచ్చిన నూనె డబ్బాలను సైతం పక్కదారి పట్టిస్తూ స్థానికులకు దొరికిపోయారు. వివరాలు ఇలా ఉన్నాయి. పోతులూరు వీరబ్రహ్మేంద్రస్వామికి తెలుగు రాష్ట్రాలతోపాటు తమిళనాడు, కర్నాటక ,మహారాష్ట్రలలో కూడా అధిక సంఖ్యలో భక్తులు ఉన్నారు. ఇక్కడికి ప్రతిరోజు అధిక సంఖ్యలో భక్తులు వచ్చి వారికి తోచిన విధంగా విరాళాలు ఇచ్చి వెళుతుంటారు. బి.మఠంలో ప్రతి ఏడాది మూడు ఉత్సవాలు జరుగుతాయి. అందులో ప్రధానమైనది బ్రహ్మంగారి ఆరాధన ఉత్సవాలు. ఈ ఉత్సవాలకు వచ్చే భక్తులు అధిక సంఖ్యలో స్వామికి వివిధ రకాల నూనె డబ్బాలు సమర్పించుకుంటారు. స్వామికి దీపారాధనలకే కాకుండా ఇతర అవసరాలకు వంట నూనెలు కూడా ఇస్తారు. వీటిని అధికంగా సమీపంలో ఉన్న మఠాధిపతి ఇంటిలో ఉంచుతారు. వీటితోపాటు మామూలు రోజులలో కూడా నూనె డబ్బాలతో పాటు బియ్యం, కందిపప్పు, దుస్తులు, బెల్లం, ఇతర వంటసరుకులు కూడా భక్తులు ఇస్తుంటారు.
ప్రతి ఏడాది దేవస్థానం నిర్వాహకులు బియ్యం, కందిపప్పు, ఇతర వస్తువులను బహిరంగ వేలం వేస్తారు. ఈ నేపథ్యంలో వారం రోజుల క్రితం బియ్యం, మరికొన్ని వస్తువులు బహిరంగ వేలం వేసినట్లు తెలిసింది. ఇందులో నూనె డబ్బాలు లేవు. శనివారం సాయంత్రం మఠాధిపతి ఇంట్లోనుంచి పోరుమామిళ్లకు చెందిన నూనెల వ్యాపారి ఆముదము, వంట నూనెల 25 కేజీల 50 డబ్బాలు తరలిస్తుండగా స్థానికులు గమనించారు. భక్తులు బ్రహ్మంగారి దీపారాధనకు, వంటకు ఇచ్చిన నూనె డబ్బాలు ఎక్కడికి తీసుకెళ్తున్నారని నిలదీశారు. బహిరంగ వేలం వేయకుండా మీకు ఎలా విక్రయించారని ప్రశ్నించారు. నూనె వ్యాపారి మాత్రం 50 డబ్బాల నూనెను రూ.50వేలకు కొనుగోలు చేసినట్లు స్థానికులకు తెలిపి వాటిని తరలించుకు పోయాడు. బహిరంగ మార్కెట్లో వీటి విలువ రూ. లక్ష చేస్తుందని తెలుస్తోంది. కాగా వాటిని రూ.50 వేలకు కొనుగోలు చేసినట్లు వ్యాపారి పేర్కొంటున్నా అతనికి రూ.25వేల రూపాయల రసీదు మాత్రమే ఇచ్చినట్లు సమాచారం. దీన్నిబట్టి దేవస్థానంలో భక్తులు సమర్పించిన కానుకల విషయంలో గోల్‌మాల్ జరుగుతోందనే ఆరోపణలకు బలం చేకూరుతోంది.
నూనె డబ్బాల అమ్మకంపై స్థానిక మఠం మేనేజర్ ఏమంటున్నారంటే..
‘భక్తులు ఇచ్చిన బియ్యం, ఇతర వస్తువులు బహిరంగ వేలం వేశాం. ఆ ఆదాయాన్ని మఠం నిధులకు జమ చేశాము. నూనె డబ్బాలు మాత్రం బహిరంగ వేలం వేయకుండా విక్రయించాము. 50 డబ్బాలను రూ.25వేలకు విక్రయించాము’ అని మ ఠం మేనేజర్ ఈశ్వరాచారి తెలిపారు. కాగా,నూనె కొనుగోలు చేసిన వ్యాపారిని స్థానికులు విచారిస్తే 50 డబ్బాల నూనెను రూ.50వేలకు కొన్నట్లు చెప్పాడు. మరి మిగిలిన సొమ్ము ఎవరి ఖాతాలోకి వెళ్లింది అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment