
పాలకొల్లులో మొక్కజొన్న పొత్తుల వ్యాపారం చేసుకుంటున్న ఆదినారాయణ, సీత దంపతులు
ఆడుతూపాడుతూ పనిచేస్తుంటే అలుపు సొలుపేమున్నది.. ఇద్దరమొకటై చేయి కలిపితే ఎదురేమున్నది.. అంటూ పాత సినిమా పాటలా వారి జీవితం హాయిగా సాగిపోతోంది.. ఎనిమిది పదుల వయసులోనూ వారి దాంపత్యంలో కాసింత కూడా ఆప్యాయత, అనురాగాలు తగ్గలేదు.. అంతేకాదు ఇప్పటికీ తమ రెక్కల కష్టంపైనే జీవిస్తున్నారు. మొక్కజొన్న పొత్తులు అమ్ముతూ ఉపాధి పొందుతున్నారు.. మొదట్లో సీజనల్ పండ్ల వ్యాపారం చేసి కుటుంబాన్ని పోషించారు. ముగ్గురు కుమార్తెలు, కుమారుడికి వివాహం చేశారు. వారిపై ఆధారపడకూడదని సొంతంగా వ్యాపారం చేసుకుంటూ ఆదర్శంగా నిలుస్తున్నారు.
సాక్షి, పశ్చిమగోదావరి : పాలకొల్లు వీవర్స్ కాలనీకి చెందిన బైరి ఆదినారాయణ అతని భార్య సీత మొదట్లో పట్టణంలో పలు కూడళ్లలో సీజనల్ పండ్ల వ్యాపారం చేసేవారు. వీరికి ముగ్గురు కుమార్తెలు. ఒక కుమారుడు. వీరిని పెద్ద చేసి వివాహాలు చేశారు. అంతేకాదు వీవర్స్‌కాలనీలో 50 గజాల స్థలం కొనుగోలు చేసి సొంతంగా ఇల్లు నిర్మించుకున్నారు. ఆ తర్వాత మొక్క జొన్నపొత్తులు కాల్చి అమ్మడం వృత్తిగా చేసుకున్నారు. సీజనల్‌గా బత్తాకాయలు, సపోటా, రేగిపండ్లు, చిలగడదుంపడలను ఉడకపెట్టి విక్రయించడం, తేగలు అమ్మకాలు చేస్తూ జీవనం సాగించారు.
ప్రస్తుతం వయోభారం మీదపడటంతో పొత్తులకే పరిమితం అయ్యారు. తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం నుంచి మొక్కజొన్న పొత్తులను తీసుకువచ్చి బొగ్గులపై కాల్చి అమ్మకాలు చేస్తూ రోజుకు రూ.400 వరకు సంపాదిస్తున్నారు. వృద్ధాప్యంలోనూ కుమార్తెలు, కుమారుడిపై ఆధారపడకుండా కాలు చేయి పనిచేసినంత వరకు కష్ట పడుతూ జీవనం సాగించాలని అనుకుంటున్నామని ఆ వృద్ధ దంపతులు చెప్పిన మాటలు పలువురికి ఆదర్శం.
ఏ వృత్తిలోనైనా కష్టపడితే ఫలితం
నాకు 20వ ఏటలో సీతతో వివాహమయ్యింది. అప్పట్నుంచీ సీజనల్ పండ్ల వ్యాపారం చేసుకుని కుటుంబాన్ని పోషించేవాడిని. సీత ప్రతి విషయంలోనూ చేదోడువాదోడుగా ఉంది. ఎవరిపైనా ఆధారపడకుండా కాళ్లు చేతులు పనిచేసేంతవరకు కష్టపడి జీవించాలనేది మా ఇద్దరి ఆలోచన.
– బైరి ఆదినారాయణ, మొక్కజొన్నపొత్తుల వ్యాపారి, పాలకొల్లు
రెక్కాడితే కాని డొక్కాడదు
నాకు ఆదినారాయణతో వివాహమైన తర్వాత మా ఇద్దరి మాట ఒకటే అనుకుని ఆయన పండ్ల వ్యాపారం చేస్తే నేను కూడా చేదోడువాదోడుగా ఉండేదాన్ని. పిల్లలకు వివాహాలు చేశాం. సొంతిల్లు కట్టుకున్నాం. ఇదంతా రెక్కల కష్టమే. నాకు 65 ఏళ్ల వయసు వచ్చింది. ప్రస్తుతం మొక్క జొన్నపొత్తులను అమ్ముకుంటూ ఎవరిపైనా ఆధారపడకుండా జీవనం సాగిస్తున్నాం.
–బర్రె సీత, పాలకొల్లు ఆదినారాయణ, సీత దంపతులు
Comments
Please login to add a commentAdd a comment