అనారోగ్యంతో బాధపడుతున్న ఓ వృద్ధుని గోడు
కడుపులో కణితితో నరకయాతన
పలమనేరు: ‘‘అయ్యా గత కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నా.. వైద్యులేమో ఎన్నో టెస్టులు చేసి తర్వాత చూస్తాంలే అని పంపేశారు. ఈ బాధ భరించలేను. కడుపులో భారీ కణితి కారణంగా ఊపిరితీసుకోలేకపోతున్నా. ఎక్కడికన్నా వెళ్లి చనిపోదామనుకుంటే మనువళ్లు వదలడం లేదు’’ అంటూ ఓ వృద్ధుడు బుధవారం మీడియాను ఆశ్రయించాడు. వివరాల్లోకెళితే.. పలమనేరు పట్టణంలోని గాంధీనగర్‌కు చెందిన సయ్యద్‌బాషా(69)కు ఇద్దరు ఆడపిల్లలు. వారిని పెంచి పెద్దచేసి పెళ్లిచేశాడు. మూడు నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. పదిరోజుల క్రితం స్థానిక ఆస్పత్రికి వెళితే ఇక్కడి డాక్టర్లు తమవల్ల కాదంటూ తిరుపతి స్విమ్స్‌కు రెఫర్ చేశారు. అక్కడి ఇతన్ని పరీక్షించిన డాక్టర్లు కడుపులో పెద్ద కణితి ఉందని గుర్తించారు.
త్వరలో ఆపరేషన్ చేయాల్సింటుందని చెప్పి పంపారు. దీంతో ఆ వృద్ధుడు ఇంటికి తిరిగొచ్చాడు. అయితే గత నాలుగు రోజులుగా కడుపునొప్పి ఎక్కువై ఊపిరితీసుకోవడానికి కూడా వీలు లేకుండా పోయింది. దీంతో జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించగా మనువళ్లు అడ్డుకున్నారు. దీంతో బుధవారం ఇంట్లో వాళ్లకు తెలియకుండా స్థానిక మున్సిపల్ కార్యాలయ ఆవరణలోని బాపూజీ పార్కు వద్ద కొంత సేపు ఒంటరిగా గడిపిన ఆయన నేరుగా మీడియా వారివద్దకొచ్చి తన గోడు వినిపించాడు. తాను నొప్పిని భరించలేకపోతున్నానని చనిపోయే మార్గం చెప్పాలంటూ రోదించాడు. ఇంతలో ఇంట్లో తాత కనిపించకపోయేసరికి మనువళ్లు అతన్ని వెతుక్కుంటూ వచ్చారు. మీడియా ముందు మాట్లాడుతూ ఉండగానే స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లారు. స్విమ్స్ వైద్యులు స్పందించి ఆ వృద్ధునికి ఆపరేషన్ నిర్వహించాలని స్థానికులు కోరుతున్నారు.
అయ్యా నాకు చనిపోవాలని ఉంది!
Published Thu, Apr 2 2015 1:59 AM | Last Updated on Sat, Sep 2 2017 11:42 PM
Advertisement
Advertisement