syed basha
-
అయ్యా నాకు చనిపోవాలని ఉంది!
అనారోగ్యంతో బాధపడుతున్న ఓ వృద్ధుని గోడు కడుపులో కణితితో నరకయాతన పలమనేరు: ‘‘అయ్యా గత కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నా.. వైద్యులేమో ఎన్నో టెస్టులు చేసి తర్వాత చూస్తాంలే అని పంపేశారు. ఈ బాధ భరించలేను. కడుపులో భారీ కణితి కారణంగా ఊపిరితీసుకోలేకపోతున్నా. ఎక్కడికన్నా వెళ్లి చనిపోదామనుకుంటే మనువళ్లు వదలడం లేదు’’ అంటూ ఓ వృద్ధుడు బుధవారం మీడియాను ఆశ్రయించాడు. వివరాల్లోకెళితే.. పలమనేరు పట్టణంలోని గాంధీనగర్‌కు చెందిన సయ్యద్‌బాషా(69)కు ఇద్దరు ఆడపిల్లలు. వారిని పెంచి పెద్దచేసి పెళ్లిచేశాడు. మూడు నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. పదిరోజుల క్రితం స్థానిక ఆస్పత్రికి వెళితే ఇక్కడి డాక్టర్లు తమవల్ల కాదంటూ తిరుపతి స్విమ్స్‌కు రెఫర్ చేశారు. అక్కడి ఇతన్ని పరీక్షించిన డాక్టర్లు కడుపులో పెద్ద కణితి ఉందని గుర్తించారు. త్వరలో ఆపరేషన్ చేయాల్సింటుందని చెప్పి పంపారు. దీంతో ఆ వృద్ధుడు ఇంటికి తిరిగొచ్చాడు. అయితే గత నాలుగు రోజులుగా కడుపునొప్పి ఎక్కువై ఊపిరితీసుకోవడానికి కూడా వీలు లేకుండా పోయింది. దీంతో జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించగా మనువళ్లు అడ్డుకున్నారు. దీంతో బుధవారం ఇంట్లో వాళ్లకు తెలియకుండా స్థానిక మున్సిపల్ కార్యాలయ ఆవరణలోని బాపూజీ పార్కు వద్ద కొంత సేపు ఒంటరిగా గడిపిన ఆయన నేరుగా మీడియా వారివద్దకొచ్చి తన గోడు వినిపించాడు. తాను నొప్పిని భరించలేకపోతున్నానని చనిపోయే మార్గం చెప్పాలంటూ రోదించాడు. ఇంతలో ఇంట్లో తాత కనిపించకపోయేసరికి మనువళ్లు అతన్ని వెతుక్కుంటూ వచ్చారు. మీడియా ముందు మాట్లాడుతూ ఉండగానే స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లారు. స్విమ్స్ వైద్యులు స్పందించి ఆ వృద్ధునికి ఆపరేషన్ నిర్వహించాలని స్థానికులు కోరుతున్నారు. -
మధ్యాహ్న భోజనంలో బల్లి
పీలేరు, న్యూస్‌లైన్: కేవీపల్లె మండలం రాగులవారిపల్లె పాఠశాలలో బుధవారం మధ్యా హ్న భోజనంలో బల్లిపడింది. ఇది తిన్న 9 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యూరు. రాగులవారిపల్లె యూపీ స్కూల్లో 84 మంది విద్యార్థులు చదువుతున్నారు. బుధవారం 62 మంది విద్యార్థులు హాజరయ్యారు. మధ్యాహ్న భోజనం చేసిన అనంతరం రసం అడుగున బల్లి పడి ఉండడాన్ని గమనించారు. కొద్దిసేపటికే మూడో తరగతి చదువుతున్న జీ.నందినికి వాంతులు మొదలయ్యాయి. ఈ విషయూన్ని ఇన్చార్జి హెచ్ఎం సయ్యద్‌బాషా ఎంఈవో శ్రీనివాసులకు తెలియజేశారు. ఆయన ఎర్రావారిపాళెం మండలం యల్లమంద ప్రాథమిక ఆరోగ్య వైద్యాధికారి డాక్టర్ రాజేష్‌కు సమాచారం ఇచ్చి పాఠశాల వద్దకు చేరుకున్నారు. యల్లమంద నుంచి డాక్టర్లు, సిబ్బంది హుటాహుటిన పాఠశాల వద్దకు చేరుకున్నారు. అస్వస్థతకు గురైన విద్యార్థినికి పాఠశాల ఆవరణలోనే ప్రథమ చికిత్స నిర్వహించారు. ఇంతలో మరికొంత మంది విద్యార్థులకు వాంతులు మొదలయ్యూయి. వెంటనే 108 వాహనంలో నందినితో పాటు పి.గీత, టీ.రేణుక, నాలుగో తరగతి చదువుతున్న జి.అంజి, ఐదో తరగతి చదువుతున్న ఎం.శివకుమారి, ఎం.శ్రీమణి, ఎల్.గణేష్, ఆరో తరగతి చదువుతున్న జీ.రాజేశ్వరి, ఏడో తరగతి చదువుతున్న ఎం.లావణ్యను పీలేరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. నందిని తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో ప్రత్యేక వైద్యం అందిస్తున్నారు. మిగిలిన ఎనిమిది మంది విద్యార్థులు ప్రథమ చికిత్స అనంతరం కోలుకున్నారు. -
అతడు.. బా(ద్)షా!
కడప: మాసిన దుస్తులు, అరిగిన చెప్పులు.. తలపై టోపీ, వెంటొక స్కూటీ.. చుట్టూ సమోసా బ్యాగులు. అతడు.. సగటు మనిషి, సమోసా వ్యాపారి. వడలిన దేహం, వదలని దరిద్రం.. ఆకలి పేగులు, చాచిన చేతులు.. చుట్టూ జాలి లేని సమాజం. వారు.. అయినవారు లేని అనాథలు, దిక్కులేని పక్షులు. అతడు.. వారి కోసం రోజూ వస్తాడు. సమోసాలతో పాటు వారి ఆశలను మోసుకొస్తాడు. అతడు.. సయ్యద్‌బాషా. కడప నగరంలోని రవీంద్రనగర్‌కు చెందిన చిరువ్యాపారి. మూడేళ్లుగా సమోసాలు తయారు చేసి పలు షాపులకు అమ్ముకుంటాడు. ఉదయం నుంచి సాయంత్రం వరకు వివిధ ప్రాంతాలు తిరిగి సరుకు ఇస్తుంటాడు. తద్వారా వచ్చే అరకొర ఆదాయంతోనే ఆనందంగా బతుకుతున్నాడు. రెండేళ్ల క్రితం.. ఓసారి పూర్తిస్థాయిలో సమోసాలు అయిపోలేదు. మరుసటి రోజుకు అవి చెడిపోతాయి. ఆకలి విలువ తెలిసినవాడు కనుక వాటిని వృధా చేయలేదు. అన్నార్తులకు ఇచ్చాడు. ఆబగా అందుకుని తిన్న వారి కళ్లలో కొత్త వెలుగు కన్పించింది. ఆ వెలుగులో బాషా ఆత్మసంతృప్తి వెతుక్కున్నాడు. వ్యాపారంలో వచ్చే లాభం కంటే.. తోటి మనుషులకు చేసే సాయమే ఎక్కువ సంతోషాన్నిస్తుందని తెలుసుకున్నాడు. అప్పటి నుంచి కడపలోని వివిధ ప్రాంతాల్లో తలదాచుకునే వృద్ధులకు ప్రతిరోజు రాత్రి 200 సమోసాలను ఇస్తూ వస్తున్నాడు. పేదవారికి సాయం చేయడానికి పెద్దమనుషులే కానక్కర్లేదని నిరూపిస్తున్నాడు. మానవత్వముంటే చాలునని చాటుతున్నాడు. పిడికెడు మెతుకులకు తపస్సు చేసే వారి కోసం తమస్సులో సైతం తపిస్తున్నాడు. అందుకే అతడు.. మనసున్న బాద్షా!