సాక్షి, రాజమండ్రి : పింఛన్ కావాలంటే ఆధార్ కావాలి.. రేషన్ కార్డు ఉండాలంటే ఆధార్ ఉండి తీరాలి..ఇలా అన్నింటికీ ఆధార్ లంకె పెడుతున్న ప్రభుత్వం ఇపుడు జన్మభూమి గ్రామసభలో ఇచ్చే దరఖాస్తులకు కూడా ఫొటో ఐడెంటిటీ (గుర్తింపు) కార్డు ఉండాలన్న నిబంధన విధించింది. జన్మభూమి సభల్లో నేతల ప్రసంగాలు విని, గంటల తరబడి క్యూల్లో నిలబడి ఎట్టకేలకు అధికారులకు తాము ఆశించే ప్రయోజనానికి అవసరమైన అర్జీ ఇచ్చాం కదా అని నిశ్చింతగా ఉండడం ఇప్పుడు కుదరదు. వాటికిక ఏదైనా గుర్తింపు కార్డు జత చేస్తేనే అవి ఆన్‌లైన్‌లో చేరి, అధికారుల పరిశీలనకు నోచుకుంటాయి. లేదం టే చెత్తబుట్ట పాలు కావడం ఖాయం.
వీటి జిరాక్సు కాపీలను జోడించాలి..
ఇల్లు, పింఛను, రేషన్ కార్డు వంటివి మంజూరు చేయాలని కోరే అర్జీలకు తప్పనిసరిగా ఆధార్ కార్డు నకలు జోడించి తీరాలి. ఇతర వ్యక్తిగత అవసరాలకు సంబంధించి ఎటువంటి దరఖాస్తు అయినా అధికారులకు ఇచ్చే సమయంలో తాము ఇచ్చే అర్జీతో ఆధార్ కార్డు, ఓటరు కార్డు లేదంటే రేషను కార్డు జిరాక్సు కాపీ విధిగా జత చేయాలి. అంతే కాకుండా అందుబాటులో ఉండే మొబైల్ ఫోన్ లేదా ల్యాండ్ లైన్ నెంబరు దరఖాస్తుపై తప్పనిసరిగా ఉండాలి. అధికారులకు ఇచ్చే అర్జీ తర్వాత కంప్యూటర్ విభాగానికి వెళుతుంది. అక్కడ అర్జీదారుని గుర్తింపు కార్డు, ఫోన్ నంబరు ప్రధానంగా తీసుకుని ఇతర వివరాలను కంప్యూటర్‌లో పొందు పరుస్తారు. అవి లేకపోతే ఇచ్చిన దరఖాస్తును చిత్తు కాగితంతో సమానంగా పరిగణిస్తారు.
అన్నీ దాటి, ఆశ నెరవేరేదెన్నడో?
ప్రభుత్వం జన్మభూమిలో అందిన దరఖాస్తులను ముందుగా కంప్యూటరీకరిస్తోంది. అనంతరం మొబైల్ ద్వారా వాటి సమాచారం తెలుసుకునేందుకు ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టం (ఐవీఆర్‌ఎస్)ను ఏర్పాటు చేయనుంది. జన్మభూమి కార్యక్రమం అనంతరం ఐవీఆర్‌ఎస్ ద్వారా ప్రభుత్వం నుంచి దరఖాస్తుదారునికి ఒక ఫోన్ వస్తుంది. ‘మీరు జన్మ భూమిలో దరఖాస్తు చేసుకున్నారు.. మీ చిరునామా ఇదేనా? దరఖాస్తుదారు నిజంగా మీరేనా?’ వాకబు చేస్తారు. ఈ విధంగా జన్మభూమిలో అందిన దరఖాస్తుల్లో అసలు, నకిలీల నిర్ధారణకు సర్కారు పరీక్షలు పెట్టేందుకు సిద్ధమవుతోంది. దీనిని బట్టి చేసుకున్న దరఖాస్తు అధికారులు తీసుకోవాలి, వాటిని కంప్యూటరీకరించాలి, అనంతరం ఐవీఆర్‌ఎస్ ద్వారా ఫోన్ రావాలి. ఆ తర్వాతే అర్హమైన వాటి జాబితాలో చేరతాయి. అవి పరిష్కారమై దరఖాస్తుదారుకు ప్రయోజనం దక్కేది ఎప్పుడో సర్కారే చెప్పాలి.
అధికారులకూ చిక్కుసమస్యే..
దరఖాస్తు తీసుకునే సమయంలో కూడా అధికారులు ఫొటో గుర్తింపు పత్రాల నకళ్లు తీసుకోవాలని సూచించింది. కానీ చాలా వరకూ కార్యక్రమాల్లో గుర్తింపు కార్డు జిరాక్సులు లేకపోవడంతో గతంలో ఇచ్చిన దరఖాస్తుల్లో కొన్ని వేల దరఖాస్తులను కంప్యూటరీకరించలేదని తెలుస్తోంది. వీటికి సంబంధించిన గుర్తింపు కార్డులు, ఫోన్ నంబర్లు సేకరించి శుక్రవారం సాయంత్రంలోగా కంప్యూటరీకరించాలని అన్ని మండలాల అధికారులకూ ప్రభుత్వం ఆదేశించింది. దీంతో గతంలోని దరఖాస్తులకు సంబంధించి ఇప్పటికిప్పుడు ఆధారాలు, వివరాలు ఎలా సేకరించాలా అని అధికారులు తలలు పట్టుకుంటున్నారు.
‘గుర్తింపు’ లేకుంటే బుట్టదాఖలే
Published Sat, Nov 8 2014 3:01 AM | Last Updated on Wed, Apr 3 2019 9:21 PM
Advertisement
Advertisement