పెంచుతారా?ముంచుతారా? | old peoples concern on pension | Sakshi
Sakshi News home page

పెంచుతారా?ముంచుతారా?

Published Mon, Sep 29 2014 11:46 PM | Last Updated on Fri, Aug 10 2018 8:08 PM

పెంచుతారా?ముంచుతారా? - Sakshi

పెంచుతారా?ముంచుతారా?

పండుటాకుల వంటి వృద్ధులు, విధి వంచితులైన వితంతువులు, వికలాంగులు- పిల్లలు దీపావళి కోసం ఎదురు చూసినట్టు.. ఈసారి మహాత్ముని జయంతి కోసం ఆత్రుతగా నిరీక్షించారు. కారణం.. తమ జీవితాలకు చిరు ఆశాకిరణంగా ఉన్న పింఛన్ మొత్తం..ఇతోధికమై మరింత వెలుగు నింపుతుందన్న ఆశే. అయితే పింఛన్ లబ్ధిదారుల అర్హత, అనర్హతలపై సర్కారు ఇటీవల క్షేత్రస్థాయిలో చేపట్టిన పరిశీలన, అనంతరం జాబితాల రూపకల్పన జాప్యం కావడంతో ఈనెల పెంచిన పింఛన్లను అందుకోవడం అటుంచి.. అసలు లబ్ధిదారులుగా మిగులుతామా లేక ఉన్న కొద్దిపాటి ఆసరాను కోల్పోతామా అన్న గుబులు లబ్ధిదారుల్లో రేగింది.
 
సాక్షి, కాకినాడ : తాము అధికారంలోకి వస్తే వృద్ధాప్య, వితంతు పింఛన్‌ను రూ.200 నుంచి రూ.వెయ్యికి, వికలాంగ పింఛన్‌ను రూ.500 నుంచి రూ.1500కు పెంచుతామని టీడీపీ వాగ్దానం చేసింది. ఎన్నికల్లో ఆ పార్టీ గెలవడంతో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా చందబాబు నాయుడు గాంధీజీ జయంతి అయిన అక్టోబర్ రెండు నుంచి పింఛన్ల మొత్తాన్ని పెంచనున్నట్టు ప్రకటించారు. కాగా ఈనెల 19, 20, 21 తేదీల్లో పింఛన్లకు సంబంధించి  క్షేత్రస్థాయిలో చేపట్టిన పరిశీలన వివాదాస్పదమైంది. ఇందుకోసం ఏర్పాటు చేసిన కమిటీల్లో టీడీపీ కార్యకర్తలకు పెద్దపీట వేయడంతో లబ్ధిదారుల్లో కొందరిని అనర్హులుగా జాబితాల నుంచి తొలగించడం, అధికార పార్టీకి చెందిన వారిని లబ్ధిదారులుగా చేర్చడానికే ఈ తంతు అన్న అనుమానం తలెత్తింది. మరోవైపు గడువు పెంచిన పింఛన్ల పరిశీలన తుది దశకు చేరుకున్నా జాబితాలు మాత్రం ఇంకా కొలిక్కి రాలేదు. ఈ నేపథ్యంలో పింఛన్ల పెంపు తమకు వర్తిస్తుందో, లేదో; అనర్హత వేటు పడుతుందోనన్న దిగులు లబ్ధిదారులను కమ్ముకుంది.  
 
అనుచరుల లబ్ధికి టీడీపీ నేతల యత్నం
జిల్లాలో 4,77,499 మంది పింఛన్‌దారులుండగా వీరిలో 2,16,679 మంది వృద్ధులు, 1,50,028 మంది వితంతువులు, 64,776 మంది వికలాంగులు ఉన్నారు. ఇంకా 34,891 మంది అభయహస్తం పింఛన్‌దారులతో పాటు 2,434 కల్లుగీత, 8,691 చేనేత కార్మికులున్నారు. వీరికి ప్రతి నెలా రూ.16.30 కోట్లు పింఛన్‌గా అందుతోంది. గతంలో ప్రతి నెలా ఠంచన్‌గా ఒకటో తేదీన అందిన పింఛన్ నాలుగేళ్లుగా నెలలో ఎప్పుడు అందుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. జిల్లాలోని 4.77 లక్షలకు పైబడ్డ పింఛన్లలో ఇప్పటివరకు పరిశీలన జరిపినవి 4.58 లక్షలు. వీటిలో 3.75 లక్షల పింఛన్ల వివరాల్ని ఆన్‌లైన్లో నమోదు చేయగలిగారు. మిగతా వాటి నమోదుకు మరో వారం పడుతుందని అధికారులు అంటున్నారు. పరిశీలన జరిపిన పింఛన్లలో 32,500 మందిని అనర్హులుగా గుర్తించారు. మొత్తం పింఛన్ల పరిశీలన, ఆన్‌లైన్ నమోదు పూర్తయ్యే సరికి అనర్హుల సంఖ్య మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. కనీసం లక్ష మందిని అనర్హుల జాబితాలో చేర్చి, ఆ మేరకు తమ అనుచరులకు పింఛన్లు కట్టబెట్టే ఆలోచనలో టీడీపీ నేతలు ఉన్నారని,   ఆ దిశగా పింఛన్లను మరింత వడపోయాలని ఇప్పటికే అధికారులకు మౌఖిక ఆదేశాలు జారీ అయ్యాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
 
కొత్త పింఛన్లకు వేలల్లో దరఖాస్తులు
మరో పక్క కొత్త పింఛన్ల కోసం దరఖాస్తులు గణనీయంగా పెరుగుతున్నాయి. గతేడాది నిర్వహించిన రచ్చబండ-2లో వచ్చిన దరఖాస్తుల్లో వృద్ధాప్య, వితంతు పింఛన్లకు సంబంధించి 27,257 మందిని అర్హులుగా గుర్తించారు. ఆ సమయంలోనే వికలాంగ పింఛన్ కోసం మరో 13,900 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరందరిలో ఏ ఒక్కరికీ ఇప్పటి వరకు పింఛన్లు అందలేదు. ఇక ప్రతి వారం మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు నిర్వహించే గ్రీవెన్స్‌సెల్‌లలో కొత్తగా వేలాది మంది పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకుంటూనే ఉన్నారు. వికలాంగ పింఛన్‌కు అర్హులను గుర్తించేందుకు ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా సదరమ్ క్యాంపులు నిర్విహ ంచి గతంలో దరఖాస్తు చేసుకున్న 13,900 మందికి పరీక్షలు చేస్తున్నారు.
 
వైకల్యం 80 శాతం పైబడి ఉన్న వారికి మాత్రమే రూ.1500 పింఛన్ పెంపు వర్తిస్తుందని ఇప్పటికే ప్రభుత్వం తేల్చిచెప్పింది. వైకల్యం 40 నుంచి 80 శాతం మధ్య  ఉంటే ఇతర పింఛన్ల పెంపునే వర్తింప చేయనున్నారు. ప్రస్తుతం ఉన్న పింఛన్ల సంఖ్యను బట్టి పెంపు అమలు చేస్తే జిల్లాకు రూ.45 కోట్లు విడుదల చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు నిధులు ప్రభుత్వం విడుదల చేస్తుందో లేక మళ్లీ వాయిదా మంత్రం జపిస్తుందోనన్న ఆందోళన లబ్ధిదారుల్లో నెలకొంది.  పింఛన్ల పరిశీలన, నమోదు పూర్తి కాలేదన్న సాకుతో అక్టోబర్ 2న మొక్కుబడిగా కొందరికే పంపిణీ చేస్తారన్న అనుమానమూ వ్యక్తమవుతోంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement