
పాత విధానంలోనే పరీక్ష
విజయనగరం అర్బన్: పదో తరగతి ఫైనల్ పరీక్షలు సమీపిస్తున్నాయి. నవంబర్ నెలాఖరు వరకు పరీక్ష విధానంపై స్పష్టత రాకపోవడంతో కొత్త సిలబస్‌ను యథావిధిగా బోధించారు. అయితే చివరకు పాత విధానంలోనే పరీక్షలు నిర్వహిస్తామని ప్రకటించడంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. పరీక్షలు ముంచుకొస్తున్న తరుణంలో తాత్కాలిక పద్ధతులతో విద్యార్థులను పరీక్షలకు సిద్ధం చేసేందుకు ఉపాధ్యాయులు మార్గాలు అన్వేషిస్తున్నారు. పదోతరగతి ఉత్తీర్ణత లక్ష్యాల సాధనకు జిల్లాలో ప్రణాళికలు కొరవడ్డాయి. మెరుగైన ఫలితాల కోసం గ్రేడింగ్ (ప్రగతి పత్రాలు) ఆధారంగా వెనుకబడిన విద్యార్థులను గుర్తించి, బోధన, శిక్షణపై ప్రణాళికలు రూపొందించాలి. బాగా వెనుకబడిన సి, డి గ్రేడ్ విద్యార్థులకు ప్రత్యేక మెటీరియల్‌తో శిక్షణ ఇవ్వాలి. ఆ మేరకు ప్రణాళికలు రూపొందించాలి. అయితే ఆ దిశగా జిల్లాలోని పదోతరగతి విద్యార్థుల సమ్మేటివ్-2 (అర్ధసంవత్సర పరీక్షల) గ్రేడింగ్‌ను తీసుకోవడంపై ఇప్పటికీ విద్యాశాఖ శ్రద్ధచూపలేదు. పదోతరగతి ఫలితాల కోసం కేవలం అదనపు తరగతుల నిర్వహణపై మాత్రమే విద్యాశాఖ పర్యవేక్షిస్తూ చేతులు దులుపుకొంటోంది. దీంతో ఈ ఏడాది పదోతరగతి పరీక్షలు రాయనున్న విద్యార్థులు, తల్లిదండ్రుల్లో అయోమయ పరిస్థితి నెలకొంది.
ఉపాధ్యాయుల కొరత
విద్యార్థుల నిష్పత్తిని అనుసరించి జిల్లాలోని ఏ ఒక్కపాఠశాలలోనూ ఉపాధ్యాయులు లేరని విద్యాశాఖ అధికారులే చెబుతుండడం గమనార్హం. ఈ క్రమంలో డిసెంబర్ నెలలో సమ్మేటివ్-2 (అర్ధసంవత్సర పరీక్షలు) నిర్వహించారు. సంక్రాంతి సెలవుల అనంతరం పాఠశాలలు ప్రారంభమైన తర్వాత మూల్యాంకన వివరాలను తెలియజేయాల్సి ఉంది. అయితే ఆ సమాధాన పత్రాలను దుమ్ముదులిపిన ఛాయలు చాలా చోట్ల ఇంతవరకు కనిపించలేదు. సమ్మెటివ్-1లో విద్యార్థులు వెనుకబడి ఉంటారని.. సమ్మెటివ్-2లో కొం చెం మెరుగవుతారని.. ప్రీ పబ్లిక్ నుంచి విద్యార్థులు పూర్తిస్థాయిలో పరీక్షల మూడ్‌లోకి వస్తారని.. ఈ ప్రక్రియ ఆటోమేటిక్‌గా జరిగిపోతుందని ఉపాధ్యాయులు డొంకతిరుగుడు సమాధానాలు చెబుతున్నారు. విజయనగరం, బొబ్బి లి డివిజన్ పరిధిలలోని కొన్ని పాఠశాలల్లో ఆరునెలల పరీక్షల పత్రాల మూల్యాంకన ప్రక్రియ ఇప్పటికీ జరగలేదనే ఆరోపణలు ఉన్నాయి. జిల్లాలో 360 ప్రభుత్వ ఉన్నత పాఠశాలల నుంచి 30,780 మంది విద్యార్థులు మార్చిలో జరిగే పదో తరగతి ఫైనల్ పరీక్షలకు హాజరుకానున్నారు.
పూర్తికాని సిలబస్
సిలబస్‌ను డిసెంబర్ నెలాఖరుకు పూర్తిచేయాలని విద్యాశాఖ అధికారులు ఆదేశాలిచ్చారు. అయితే పాఠ్యపుస్తకాల్లో ఫిబ్రవరి వరకు సిలబస్‌ను పూర్తి చేయొచ్చని ఉండడంతో కొత్త సిలబస్‌కు పాతపరీక్ష విధానానికి పొంతన కుదరలేదని ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సిలబస్ మారినప్పుడు టీచర్లకు పునశ్ఛరణ తరగతులను నిర్వహించాల్సి ఉంది. విద్యాసంవత్సరంలో 8 నెలలు గడిచినా కొన్ని మండలాల్లో తూతూ మంత్రంగా ఈ తరగతులు నిర్వహించారనే ఆరోపణలున్నాయి. హైస్కూల్‌లో 50 శాతం లోపు ప్రగతిపత్రాల (ప్రోగ్రెస్‌కార్డుల)ను ఇచ్చి ఉంటారని అధికారులు కాకిలెక్కలు చెబుతున్నాయి. మూడేళ్ల క్రితం వరకు ఆర్‌వీఎం ఆధ్వర్యంలో ప్రోగ్రెస్ కార్డులు పాఠశాలలకు అందజేసేవారు. ప్రస్తుతం స్కూల్ గ్రాంట్‌లోనే ప్రగతిపత్రాలు అందజేయాల్సి ఉండడంతో నిధులులేని పరిస్థితుల్లో కార్డులు కనుమరుగవుతున్నాయనేది ఉపాధ్యాయ వర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉంటే ప్రాథమిక పాఠశాలలో అసలు ఈ ప్రోగ్రెస్ కార్డుల ఊసేలేదనే వాదన వినిపిస్తోంది.