సాక్షి, కర్నూలు(హాస్పిటల్): ఓ 65 ఏళ్ల వృద్ధురాలికి 40 ఏళ్లుగా జననేంద్రియంలో రబ్బర్ రింగ్ అలాగే ఉండి పోయింది. ఇప్పుడు గర్భాశయ సమస్యలు రావడంతో ఆమె ఆసుపత్రికి రాగా వైద్యులు చికిత్స ద్వారా దానిని తొలగించారు. వివరాలను శనివారం కర్నూలు ప్రభుత్వసర్వజన వైద్యశాలలోని గైనిక్ విభాగంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హెచ్‌వోడి డాక్టర్ బి. ఇందిర తెలిపారు. తెలంగాణా రాష్ట్రం గద్వాల నియోజకవర్గం కశ్యాపురం గ్రామానికి చెందిన 65 ఏళ్ల మహిళ మూడు రోజుల క్రితం గైనిక్ విభాగం ఏడవ యూనిట్‌కు వచ్చింది. ఆమె తెల్లమైల, ఎర్రమైల, కడుపునొప్పి సమస్యలు వివరించింది. ఆమెను పరీక్షించిన వైద్యులు జననేంద్రియంలో రబ్బరుతో చేసిన రింగు ఉన్నట్లు గుర్తించారు.
ఈ విషయమై ఆమెను అడగగా 40 ఏళ్ల క్రితం చివరి ప్రసవ సమయంలో గర్భాశయం జారిందని, ప్రసవం చేసిన మంత్రసాని రబ్బర్ రింగ్‌ను జననేంద్రియంలో అమర్చిందని వైద్యులకు తెలిపింది. దీంతో గైనకాలజిస్టు డాక్టర్ సి.మల్లికార్జున్ ఆమెను ఆసుపత్రిలో చేర్చుకుని శనివారం రబ్బరు రింగును తొలగించారు. డాక్టర్ బి. ఇందిర మాట్లాడుతూ గర్భసంచి జారిన వారిలో ఆపరేషన్‌కు ముందు తాత్కాలిక చికిత్సగా రింగ్ పిస్సరిని వాడతారని, కొద్దిమంది సిగ్గుతో ఎవరికీ చెప్పుకోలేక డాక్టర్‌లకు చూపించుకోరన్నారు. అది యోని మార్గంలో ఎక్కువ సంవత్సరాలు ఉండటం వల్ల అనేక సమస్యలు వస్తాయని, కొన్నిసార్లు క్యాన్సర్ సమస్యలు కూడా వస్తాయని తెలిపారు. సమావేశంలో డాక్టర్ శ్రీలత, డాక్టర్ మల్లికార్జున్, డాక్టర్ మమత, డాక్టర్ వీణ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment