కొంప కొలాప్స్
ఇళ్లు.. లాడ్జీలు.. పొలాలు.. ఖాళీ స్థలాలు.. కావేవీ పేకాటకనర్హం అన్నట్లుంది. ఒకప్పుడు ఎక్కడో మారుమూల గుట్టుచప్పుడు కాకుండా నిర్వహించే పేకాట కేంద్రాలు ఇప్పుడు ఎక్కడపడితే అక్కడ విచ్చలవిడిగా నడుస్తున్నాయి. వీటికి రాజకీయ నేతల అండదండలు మెండుగా ఉండడం విశేషం. నగరంలో జోరుగా పేకాట
- నిర్వాహకులకు రాజకీయ అండ
- మిన్నకుండిపోతున్న పోలీసులు
- ఇల్లు గుల్ల చేసుకుంటున్న జూదరులు
- గగ్గోలు పెడుతున్న గృహిణులు
విజయవాడ సిటీ : గతంలో పేకాట కోసం పొరుగు జిల్లాలు, చెన్నై వంటి నగరాలకు జూదరులు వెళ్లేవారు. ఇప్పుడు అందుబాటులోనే ‘కోత ముక్క’లాట నడుస్తుండటంతో లక్షలు పట్టుకుని ఇక్కడికి చేరుకుంటున్నారు. పేకాట వ్యసనంతో అనేక కుటుంబాలు ఛిన్నాభిన్నం అవుతుంటే.. ఆర్గనైజర్లు మాత్రం ‘బంకినీ’ (నిర్వాహకుల కమీషన్) రూపంలో లక్షలు ఆర్జిస్తున్నారు. కొందరు పెద్దల కోరిక మేరకు దాడులు వద్దంటూ పోలీసు బాస్‌లు మౌఖికంగా ఆదేశించడంతో కిందిస్థాయి అధికారులు మిన్నకుండిపోతున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాలను అడ్డుపెట్టుకొని కొందరు అధికారులు లక్షలాది రూపాయలను నెలవారీ మామూళ్ల రూపంలో గుంజుతున్నారని సమాచారం. నగరంలో నిర్వహిస్తున్న పేకాటపై గృహిణులు మండిపడుతున్నా పోలీసుల్లో మాత్రం చలనం లేదు.
చేతులు మారుతున్న కోట్లాది రూపాయలు
నగరంలోని పలు ప్రాంతాల్లో నిర్వహిస్తున్న అనధికారిక పేకాట క్లబ్‌లలో కోట్లాది రూపాయలు చేతులు మారుతున్నాయి. ఊరికి సమీపంలోని పొలాల్లో షామియానాలు, పాకలు వేసి పేకాటలు నిర్వహిస్తున్నారు. ఏలూరు, గుంటూరు నగరాల నుంచి ఖరీదైన కార్లలో పేకాటరాయుళ్లు వచ్చి జూదంలో బలవుతున్నారు. రామవరప్పాడు వంతెన సమీపంలో ఓ మాజీ ప్రజాప్రతినిధి డ్రైవర్ ఏర్పాటు చేసిన పేకాట శిబిరానికి రోజూ 100 నుంచి 150 మంది జూదరులు వస్తుంటారు. ఒక్కొక్కరు లక్ష రూపాయలకు తక్కువ తీసుకురారంటే అక్కడ జరిగే పేకాట ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. పటమట, పెనమలూరు, పోరంకి, తాడిగడప వంటి ప్రాంతాల్లో రోజువారీ పద్ధతిలో అతిథి గృహాలను అద్దెకు తీసుకుని మరీ పేకాట క్లబ్‌లను నిర్వహిస్తున్నారు. ఇక హోటల్స్, లాడ్జీల్లో పేకాట సర్వసాధారణంగా మారింది.
సకల సౌకర్యాలు
పేకాటరాయుళ్లకు నిర్వాహకులు అన్ని వసతులు సమకూరుస్తున్నారు. మద్యం, ఖరీదైన భోజనంతోపాటు విశ్రాంతి తీసుకునేందుకు ప్రత్యేక ఏసీ గదులు కూడా ఏర్పాటుచేస్తారు. ఆడేవారితో పాటు చూసేందుకు వచ్చే వారికి కూడా సకల సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఆటలో తెచ్చిన నగదు పోగొట్టుకుంటే ఫైనాన్స్ సౌకర్యం కూడా ఏర్పాటుచేస్తారు. ఉదయం రూ.10 వేలు తీసుకుంటే సాయంత్రానికి రూ.12 వేలు జమచేయాలి. లేదంటే ఇంటి కాగితాలు, విలువైన భూములు తనఖా పెట్టాల్సి ఉంటుంది.
పోలీసులకు తెలిసే..
నగరంలో విస్తరించిన పేకాట మాఫియా పోలీసులకు తెలియనిదేమీ కాదు. పై అధికారులు ఆదేశాలున్నాయంటూ దాడులకు దూరంగా ఉంటున్నారు. కొందరు పోలీసులు మాత్రం నిర్వాహకులను బెదిరించి డబ్బులు గుంజుతున్నట్లు తెలుస్తోంది. టాస్క్‌ఫోర్స్ సిబ్బందితో పాటు స్థానిక పోలీసులకు కూడా భారీగానే మామూళ్లు ముడుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇటీవల రామవరప్పాడు సమీపంలో పోలీసులు దాడి చేసి పేకాటరాయుళ్ల వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. వీరి రాక ముందే తెలియడంతో నిర్వాహకుల సూచన మేరకు పేకాటరాయుళ్లు పరారయ్యారు. ఈ దాడికి పోలీసుల్లో నెలకొన్న అభిప్రాయభేదాలే కారణమని కమిషనరేట్ వర్గాల సమాచారం.