డిసెంబర్ 6న మెగా లోక్ అదాలత్ | On December 6 Mega Lok Adalat | Sakshi
Sakshi News home page

డిసెంబర్ 6న మెగా లోక్ అదాలత్

Published Sat, Oct 18 2014 12:16 AM | Last Updated on Sun, Sep 2 2018 5:20 PM

డిసెంబర్ 6న మెగా లోక్ అదాలత్ - Sakshi

డిసెంబర్ 6న మెగా లోక్ అదాలత్

  • జిల్లా కోర్టు పరిధిలో 71వేల కేసులపెండింగ్
  •  ఎక్కువ కేసులు పరిష్కరించేందుకే లోక్ అదాలత్
  •  రాజీపడదగిన కేసుల గుర్తింపు
  •  ఇరువర్గాలకు న్యాయం చేసేందుకు కృషి
  •  జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఆర్.మురళి వెల్లడి
  • మచిలీపట్నం : సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు డిసెంబరు 6వ తేదీన జాతీయ స్థాయిలో రెండో మెగా లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఆర్.మురళి తెలిపారు. జిల్లా కోర్టులోని ప్రధాన న్యాయమూర్తి చాంబరులో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. డిసెంబరు 6వ తేదీన తాలుకా కోర్టు నుంచి సుప్రింకోర్టు వరకు అన్ని స్థాయిల్లో లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు.

    వివిధ కేసుల విచారణలో రాజీపడదగిన వాటిని గుర్తించామని, ఆయా కేసుల్లో ఇరువర్గాల వారికి నోటీసులు పంపి లోక్ అదాలత్‌లో పరిష్కరించుకోవాలని సూచిస్తున్నట్లు తెలిపారు. లోక్ అదాలత్‌లో కేసులు పరిష్కారమైతే పై కోర్టుకు కూడా వెళ్లే అవకాశం ఉండదని చెప్పారు. దేశవ్యాప్తంగా రెండు కోట్లకు పైగా కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, వీటి సంఖ్యను గణనీయంగా తగ్గించేందుకు లోక్ అదాలత్‌ను నిర్వహిస్తున్నట్లు వివరించారు.

    ప్రస్తుతం ఉన్న న్యాయస్థానాలు, న్యాయమూర్తులు అన్ని కేసులను పరిష్కరించేందుకు సమయం సరిపోవడం లేదని, అందువల్లే లోక్ అదాలత్‌ను యజ్ఞంలా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. గత ఏడాది నిర్వహించిన లోక్ అదాలత్‌కు మంచి స్పందన లభించిందని ఆయన చెప్పారు. జిల్లా కోర్టు పరిధిలో 71 వేల కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, వీటిలో 40వేలకు పైగా క్రిమినల్ కేసులేనని వివరించారు.

    రెండో విడత లోక్ అదాలత్‌లో చిన్నచిన్న తగాదాలు, చెక్ బౌన్స్ కేసులు, కుటుంబ తగాదాలు, మోటారు క్లెయిమ్‌లు, బ్యాంకు లావాదేవీలు, విడాకులు, వేధింపుల కేసులు, పిల్లల కస్టడీ, మనోవర్తి తదితర కేసులను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. బ్యాంకు లావాదేవీలకు సంబంధించి రుణాలు తీసుకున్న వారు తమకు సంబంధించిన వివరాలను బ్యాంకు నుంచి తీసుకుని క్లెయిమ్ దాఖలు చేసుకోవాలని సూచించారు.

    బ్యాంకు అధికారులు, కక్షిదారులతోనూ మాట్లాడి ఇరువర్గాలకు న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. లోక్ అదాలత్‌లో త్వరగా కేసులను పరిష్కరించుకునేందుకు అవకాశం ఉన్న నేపధ్యంలో కక్షిదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో జిల్లా న్యాయమూర్తులు ఎంఆర్ శేషగిరిరావు, స్వర్ణలత, రాంగోపాల్, శాస్త్రి, చిన్నంశెట్టి రాజు తదితరులు పాల్గొన్నారు.
     

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement