సాక్షి, నల్లగొండ: సార్వత్రిక ఎన్నికల హడావిడి మొదలైంది. ఏ ఇద్దరు వ్యక్తులు కలిసినా ఎన్నికల నోటిఫికేషన్ గురించే చర్చ. ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం అన్ని విధాలా సన్నద్ధమవుతోంది. పకడ్బందీ ఏర్పాట్లు చేయడానికి ప్రణాళిక రూపొందిస్తోంది. స్వేచ్ఛాయుతంగా, పారదర్శకంగా ఎన్నికలు జరిగేలా, పౌరులు తమ ఓటుహక్కును వినియోగించుకునేందుకు వీలుగా ప్రశాంత వాతావరణం కల్పించడానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు.
ఈ నెల 25,26 తేదీల్లో లేదా వచ్చేనెల మొదటి వారంలో ఎన్నికల నగారా మోగనున్నట్లు సమాచారం. నోటిఫికేషన్ వెలువడేలోగా ఎన్నికల నిర్వహ ణకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని యంత్రాంగం భావించింది. ఆ దిశగా కార్యరంగంలోకి దిగింది.
బదిలీలు కొలిక్కి....
ఇప్పటికే ఎన్నికల నేపథ్యంలో బదిలీలు దాదాపు పూర్తయ్యాయి. మూడేళ్లుగా ఒకే స్టేషన్‌ను అంటిపెట్టుకున్న వారికే కాకుండా దాదాపు ఎస్‌ఐలందరికీ స్థాన చలనం కలిగింది. అలాగే తహసీల్దార్లు, డిప్యూటీ కలెక్టర్లు ఇతర జిల్లాలకు బదిలీపై వెళ్లారు. వీరి స్థానాల్లో ఇతర జిల్లాల నుంచి వచ్చి బాధ్యతలు స్వీకరిస్తున్నారు. ఇటీవలే 48మంది తహసీల్దార్లకు పోస్టింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. నేడో రేపో సీఐల బదిలీలూ జరగనున్నాయని వినికిడి. వీరి తుది జాబితా రూపకల్పనలో పోలీసు యంత్రాంగం నిమగ్నమైంది. జిల్లాలోని 12 నియోజకవర్గాలకు రిటర్నింగ్ అధికారులుగా ఆయా పోస్టులు నోటిఫై అయ్యాయి.
ఈ పోస్టుల్లో చేరిన నూతన అధికారులు ఆయా నియోజకవర్గాలకు బాధ్యులుగా వ్యవహరించాల్సి ఉంది. ఎన్నికల అబ్జర్వర్లుగా 60 నుంచి 70 మంది అధికారులను గుర్తించినట్లు సమచారం. వీరి జాబితా సోమవారం ప్రకటించే అవకాశం ఉంది. ఎంపీడీఓలను కూడా ఈ సారి బదిలీ చేయాలన్న యోచనలో ప్రభుత్వం ఉంది. అయితే, దీన్ని ఎంపీడీఓలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తమకు ఎన్నికల విధులకు ఎటువంటి సంబంధం లేదని, ఇటువంటి తమను ఎలా బదిలీ చేస్తారని ప్రశ్నిస్తున్నారు. ఇదే విషయమై వారు కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో కోర్టు తీర్పు తర్వాత వీరి బదిలీలు ఉన్నాయా? లేవా? అన్నది తేలనుంది.
పోలీసుల ఆరా....
నేరచరితులు, వివాదాస్పద వ్యక్తుల వివరాలన్నింటినీ సేకరించాలని, వీరి కదలికలపై నిఘా ఉంచాలని పోలీస్ ఉన్నతాధికారులకు ఎన్నికల కమిషన్ నుంచి ఆదేశాలు అందాయి. వీరిని బైండోవర్ చేసేందుకు కిందిస్థాయిలో ఆదేశాలివ్వాలని సూచనలు అందాయి. సహజంగా ఇదంతా జరగాల్సింది ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తరువాతే.
అయితే జిల్లాలో ఉన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా ఇప్పటికే గ్రామాల్లో బైండోవర్లు మొదలయ్యాయి. మునగాల మండలంలోని పలు గ్రామాల్లో బైండోవర్లు కొనసాగుతున్నాయి. గ్రామ పోలీస్ ద్వారా ఎప్పటికప్పుడు పరిస్థితిని పోలీసు ఉన్నతాధికారులు సమీక్షిస్తున్నారు. ఘర్షణ వాతావరణం ఉందని గుర్తించిన గ్రామాల్లో నిఘా మరింత పటిష్టం చేస్తున్నారు.
వారంలో ప్రీ పోలింగ్....
ఓటింగ్‌కు వినియోగించాల్సిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు (ఈవీఎం)లో క లెక్టరేట్‌లో కొన్నే ఉన్నాయి. జిల్లాలో ఉన్న ఈవీఎంలను అక్కడి ఎన్నికల సమయంలో పశ్చిమబెంగాల్, ఒరిస్సాలకు పంపారు. ఎన్నికల సంఘం జిల్లాకు 8వేల ఈవీఎంలను కేటాయించిందని సమాచారం. ఇవన్నీ జిల్లా కేంద్రానికి త్వరలో చేరుకోనున్నాయి. ఈ ప్రక్రియ పూర్తికాగానే ఈవీఎంల పనితీరు అధికారులు తెలుసుకుంటారు. ఆ తర్వాత అన్ని రాజకీయ పార్టీల నాయకులను సమావేశ పరిచి ఈవీఎంలపై అవగాహన కల్పిస్తారు. ఓటింగ్ విధానాన్ని చూపిస్తారు. దీనికోసం అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
ఎన్నికల దిశగా అడుగులు
Published Mon, Feb 17 2014 4:08 AM | Last Updated on Wed, Aug 29 2018 4:16 PM
Advertisement
Advertisement