
తీరంపై డేగ నిఘా
స్వాతంత్య్ర దిన వేడుకలకు భారీ భద్రత
నేవీ, ఆర్మీ, ప్రత్యేక పోలీస్ దళాలు సిద్ధం
ఉగ్రవాద హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తం
స్వయంగా పర్యవేక్షిస్తున్న డీజీపీ రాముడు
విశాఖపట్నం : తొలిసారి నగరంలో జరగనున్న ప్రభుత్వ అధికారిక స్వాతంత్య్ర వేడుకలపై పోలీసు శాఖ డేగ కళ్లతో నిఘా పెట్టింది. కేంద్ర హోం శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఉగ్రవాదులు, మావోయిస్టులు, ఇతర అసాంఘిక శక్తుల నుంచి అవాంతరాలు కలగకుండా భద్రతా ఏర్పాట్లు చేసింది. వివిధ దళాలకు చెందిన 2500పైగా పోలీసులను వినియోగించనుంది. వీరు కాకుండా నేవీ, ఆర్మీ, ప్రతేక పోలీసు దళాలను మోహరిస్తోంది. వేడుకలను వీక్షించేందుకు 2,515 మంది ప్రముఖులు రానున్నారు. వీరి భద్రతకు పోలీస్ యంత్రాంగం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఇతర జిల్లాల నుంచి 1800 పోలీసులను ప్రత్యేకంగా తెప్పించారు. వీరితో పాటు 10 ప్లటూన్ల ఏపీఎస్‌పీ, 640 మంది ఆర్మ్‌డ్ పోలీసులను వినియోగిస్తున్నారు. ఎస్సై, హెడ్ కానిస్టేబుల్, ఇద్దరు కానిస్టేబుళ్లు ఆధ్వర్యంలో ఒక ఆర్మ్‌డ్ రిజర్వ్ సెక్షన్‌ను నాలుగు ప్రాంతాల్లో సిద్ధంగా ఉంచుతున్నారు. సిరిపురం, కలెక్టరేట్, చినవాల్తేరు, పందిమెట్ట ప్రాంతాల్లో ఉండే ఈ బృందాలు అత్యవసర పరిస్థితుల్లో రంగంలోకి దిగుతాయి.
50 వేల మంది హాజరవుతారని అంచనా నేపథ్యంలో ట్రాఫిక్ నియంత్రణ కత్తిమీద సాములా ఉంటుంది. దీని కోసం ఒక ఏడీసీపీ, 4 ఏసీపీలు, 23 ఇన్‌స్పెక్టర్లు, 63మంది ఎస్సైలు, 88 మంది హెచ్‌సీలు, 335 మంది కానిస్టేబుల్స్, 172 మంది హోంగార్డ్స్‌తో కలిపి మొత్తం 700 మంది సిబ్బంది ట్రాఫిక్ విధులు నిర్వర్తించనున్నారు. 15 సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రతి వాహనాన్ని పోలీస్ సిబ్బంది తనిఖీ చేస్తారు.
ఉగ్రవాద హెచ్చరికల నేపథ్యంలో హార్బర్ నుంచి భీమిలి వరకు ఉన్న మత్స్యకార గ్రామాలలో 16 స్పెషల్ టీమ్స్‌ను ఉంచారు. సముద్రం, భూ ఉపరితలం, ఆకాశంలో ఇండియన్ నావీ, కోస్ట్‌గార్డ్, సీఐఎస్‌ఎఫ్, ఒక ఆక్టోపస్, ఒక గ్రేహాండ్స్ కమాండో టీమ్, రెండు స్పెషల్ పార్టీలు నిరంతర పెట్రోలింగ్ నిర్వహించనున్నాయి.భద్రతా ఏర్పాట్లను డీజీపీ జాస్తి రాముడు స్వయంగా చూసుకుంటున్నారు. కోస్టల్ బాటరీ, జోడుగుళ్లపాలెం వద్ద 24 గంటలూ పనిచేసేలా స్ట్రాటజిక్ ఆర్మ్‌డ్ చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు.
‘కోటి’కష్టాలు
వేడుకలకు వేలాది మంది పోలీసు, ఇతర విభాగాలకు చెందిన అధికారులు, సి బ్బందిని ఇతర జిల్లాల నుంచి వారం రోజులు ముందుగానే రప్పించారు. వారందరికీ వసతి కల్పించారు. భారీ స్కీన్లు, విద్యుత్ దీపాలు, వీధి దీపాలు, వేదికలు, శకటాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. జిల్లా కలెక్టరేట్, పోర్టు, ఇతర ప్రభుత్వ కార్యాలయాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు. ఈ మొత్తం ఏర్పాట్లకు దాదాపు రూ.2 కోట్ల పైగానే ఖర్చువుతుందని అంచనా. ఇదంతా జిల్లా ఖజానా నుంచే తీసి ఖర్చు చేస్తున్నారు. ఏర్పాట్లు అదిరిపోవాలని చెప్పిన ప్రభుత్వం ఇంతవరకూ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. కనీసం నెలకు రెండుసార్లు సీఎం చంద్రబాబు నగరానికి వస్తున్నారు. సగటున రూ.30 లక్షలు ఖర్చవుతోంది. ప్రభుత్వం ఇటీవల ప్రొటోకాల్ ఖర్చులకు కొంత విడుదల చేసినా ఇంకా బకాయిరూ.2కోట్లు ఉంది. ఈనేపధ్యంలో స్వాతంత్య్ర వేడుకల ఆర్ధిక భారంపై అధికారులు మల్లగులాల్ల పడుతున్నారు. బందోబస్తుకు మాత్రం డీజీపీ చొరవతో రూ.75లక్షలు గురువారం విడుదలవడంతో పోలీసులు కొంత ఊపిరి పీల్చుకున్నారు.