ఏపీలో మళ్లీ భూప్రకంపనలు..
వివిధ జిల్లాల్లో స్వల్పంగా కంపించిన భూమి
ఇళ్ల నుంచి జనం పరుగులు
విజయవాడ బ్యూరో: రాష్ట్రంలో మరోసారి భూప్రకంపనలు కలవరపెట్టాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళవారం భూమి స్వల్పంగా కంపించింది. 20 రోజుల వ్యవధిలోనే రెండు పర్యాయాలు భూప్రకంపనలు రావడంతో ప్రజలు హడలిపోతున్నారు. గత నెల 25న నేపాల్ సమీపంలోని భూకంప కేంద్రం నుంచి వచ్చిన భూప్రకంపనలు ఏపీలోని పలుప్రాంతాలను తాకిన విషయం తెలిసిందే. మంగళవారం మరోసారి నేపాల్‌లో వచ్చిన భూకంపం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లోనూ ప్రభావం చూపింది. రాజధాని ప్రాంతమైన విజయవాడలో మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో పది సెకన్లపాటు భూమి కంపించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 5 నుంచి 6 మధ్య ఉంటుందని అర్బన్ తహసీల్దార్ ఆర్.శివరావు ‘సాక్షి’కి చెప్పారు. విజయవాడ గుణదల సిస్మోలాజికల్ ల్యాబ్‌లో భూకంప లేఖిని నమోదు చేసిన వివరాలను బుధవారం అధికారికంగా వెల్లడిస్తారన్నారు.
విజయవాడలో గవర్నర్‌పేట, బెంజిసర్కిల్, కృష్ణలంక, భవానీపురం ప్రాంతాల్లో భూప్రకంపనలకు ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. కృష్ణా జిల్లాల్లోని కంచికచర్ల, నందిగామ, జగ్గయ్యపేట ప్రాంతాల్లోను భూప్రకంపనలు వచ్చాయి. గుంటూరు, విశాఖ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లోనూ భూప్రకంపనలు సంభవించినట్టు చెబుతున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడ, రాజమండ్రి, అమలాపురం ప్రాంతాల్లో భూప్రకంపనలకు ప్రజలు కంగారుపడ్డారు. పశ్చిమగోదావరి జిల్లాలో ఆకివీడు, భీమవరం, పాలకొల్లు, నర్సాపురం ప్రాంతాల్లో భూప్రకంపనలు సంభవించాయి.