పీవీ టీడీపీ ప్రధాని
► మరోసారి లోకేష్ తడబాటు
న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి తనయుడు, రాష్ట్ర ఐటీ మంత్రి లోకేశ్ మరోసారి తడబడ్డారు. తడబాటును అలవాటుగా మార్చు కున్న లోకేష్ బుధవారం మాజీ ప్రధాని పీవీ నర సింహారావును తెలుగుదేశం ప్రధాన మంత్రిగా మార్చేశారు. మాజీ ప్రధాని పీవీ జయంతిని పురస్కరించుకుని ఏపీ భవన్‌లో ఆయన చిత్రపటానికి లోకేశ్ నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ... పీవీ నరసింహారావు మన తెలుగుదేశం నుంచి ప్రధానమంత్రి అవటం అదృష్టంగా భావించాం అని అనబోతూ వెంటనే సవరించుకుని.. పీవీ నరసింహారావు మన తెలుగు ప్రజల నుంచి ప్రధాన మంత్రి అవడం అదృష్టంగా భావించామని చెప్పారు.
కాగా, ఇండియన్ బీపీవో పథకంలో రాష్ట్రానికి ఇప్పటికే కేటాయించిన 4,500 సీట్లకు అదనంగా మరో 2,700 సీట్లు పెంచాలని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి లోకేశ్ కేంద్రాన్ని కోరారు. ఇక్కడి ఎలక్ట్రానిక్ నికేతన్ భవన్‌లో కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్, కార్యదర్శి అజయ్ సహానీలతో ఆయన భేటీ అయ్యారు. ఏపీ ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేయబోతున్న ఐదు ఎలక్ట్రానిక్ తయారీ క్లస్టర్లకు ఆమోదం ఇవ్వాలని కోరారు. విశాఖలో సీ–డ్యాక్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.