మళ్లీ నిప్పులా?
విశాఖపట్నం : జులై నెల వచ్చిందంటే ఆకాశంలో మబ్బులు.. అప్పుడప్పుడు చిరుజల్లులు.. వానలు.. సాదాసీదా ఉష్ణోగ్రతలు.. ఎప్పుడైనా కాస్త ఎండలు.. వెరసి మంచి వాతావరణాన్ని అందిస్తుంది. మరి ఇప్పుడు? జులై ఆరంభం నుంచి వానలకు బదులు నిప్పులు కురుస్తున్నాయి. మలమల మాడ్చే ఎండలు కాస్తున్నాయి. మునుపెన్నడూ లేనంతగా రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతూ వడగాడ్పులు కూడా వీస్తున్నాయి. దీంతో జనం బెంబేలెత్తిపోతున్నారు. గత మే నెలలో తీవ్ర వడగాడ్పులను చవిచూశారు. ఇటు నగరంలోనూ, అటు జిల్లాలోనూ దాదాపు 200 మంది వరకూ వడదెబ్బకు బలయ్యారు. రుతుపవనాలొచ్చి వేడిపై నీళ్లు చల్లడంతో వాతావరణం చల్లబడిందని జనం సంతోషించారు. మరోవైపు పంటలకు వానలు మేలు చేశాయని సంబరపడ్డారు. ఈ తరుణంలో ఎండలు విజృంభిస్తుండడంతో అంతా ఆందోళన చెందుతున్నారు.
ఆదివారం నగరంలో 39 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదయింది.18 ఏళ్ల తర్వాత జులైలో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత ఇదే కావడం విశేషం. 1997 జులై 16న నగరంలో 39.9 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయింది. అదే జులైలో ఇప్పటిదాకా ఉన్న రికార్డు. ఆ తర్వాత మళ్లీ ఆదివారం నాటి ఉష్ణోగ్రతే అత్యధికం. వాస్తవానికి నాలుగై రోజుల నుంచి భానుడు ప్రతాపం చూపుతూనే ఉన్నాడు. ఆదివారం నాటికి మరింత ఉగ్రరూపం దాల్చాడు. వేడితోపాటు వడగాడ్పులనూ వెదజల్లాడు. కాలం గాని కాలంలో వడగాడ్పులకు జనం అల్లాడిపోయారు. మళ్లీ మే నెలను గుర్తుకు తెచ్చుకున్నారు. నిప్పులు కురిసే ఎండలోకి వెళ్లే సాహసం చేయలేకపోయారు. తప్పనిసరి పరిస్థితుల్లో వచ్చిన వారు తట్టుకోలేకపోయారు. ప్రస్తుతం సముద్రం పైనుంచి గాలులు వీయకపోవడం, పశ్చిమ, వాయవ్య దిశగా గాలులు వీస్తుండడం, ఆకాశంలో మేఘాల్లేకపోవడం వంటివి ఉష్ణోగ్రతలు పెరిగి ఎండల తీవ్రతకు కారణమని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. మరికొద్ది రోజులు సెగలు తప్పవని వీరు హెచ్చరిస్తున్నారు. అందువల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఎండలోకి తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్లాల్సి వ చ్చిన వారు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సలహా ఇస్తున్నారు.