రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఉత్తమరాజు నిఖిల్ కుమార్, చికిత్స పొందుతున్న నివేదిత
రాజమహేంద్రవరం క్రైం: లారీ ఢీ కొనడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. నల్గొండ జిల్లా శ్రీనివాసనగర్, రామగిరి ప్రాంతానికి చెందిన ఉత్తమ రాజు నిఖిల్ కుమార్(35) హైదరాబాద్‌లో ఓ స్కూల్లో టీచర్‌గా పనిచేస్తుంటాడు. అతడి స్నేహితురాలు హైదరాబాద్, శారదా నగర్ రోడ్డు, సరూర్ నగర్‌కు చెందిన నివేదితతో కలసి హైదరాబాద్ నుంచి పల్సర్ బైక్‌పై విశాఖపట్నం వెళుతుండగా దివాన్ చెరువు జీరో పాయింట్ వద్ద రోడ్డుపై గుంత ఉండడంతో సడన్ బ్రేక్ వేశాడు.
దీంతో వెనుక నుంచి వస్తున్న లారీ వేగంగా వచ్చి బైక్‌ను ఢీ కొట్టి, నిఖిల్‌కుమార్‌పై నుంచి వెళ్లిపోయింది. ఈ సంఘటనలో నిఖిల్ కుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు. బైక్ వెనుక కూర్చున్న నివేదితకు కుడి కాలు, కుడి చేయి విరిగాయి. గాయాలు పాలైన ఇద్దరినీ రోడ్డు సేఫ్టీ కానిస్టేబుళ్లు ఎన్. లక్ష్మణరావు, నర్సయ్యలు హుటాహుటిన చికిత్స నిమిత్తం రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నివేదిత ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. మృతుడు నిఖిల్ కుమార్, నివేదితకు వేరు వేరుగా వివాహాలైనట్టు పోలీసులు తెలిపారు. కొంత కాలంగా వారు స్నేహంగా ఉంటున్నారన్నారు.
సోమవారం హైదరాబాద్‌లో బయల్దేరి ఉంటారని, మార్గం మధ్యలో పశ్చిమ గోదావరి జిల్లా గౌరీపట్నంలో చర్చిని సందర్శించుకొని రోడ్డు మార్గంలో గామన్ ఇండియా బ్రిడ్జి మీదుగా వైజాగ్ వెళుతుండగా వారు రోడ్డు ప్రమాదానికి గురయ్యారన్నారు. నిఖిల్ కుమార్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రిలోని మార్చరీకి తరలించారు. బొమ్మూరు సీఐ నాగమోహన్ రెడ్డి, ఎస్సైలు సంఘటన స్థలాన్ని సందర్శించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment