వేగంగా వెళ్తున్న టాటా సుమో వాహనం కూలీలతో వెళ్తున్న ఆటోను ఢీ కొట్టింది.
వేముల (వైఎస్సార్ జిల్లా) : వేగంగా వెళ్తున్న టాటా సుమో వాహనం కూలీలతో వెళ్తున్న ఆటోను ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఒక మహిళ అక్కడికక్కడే మృతి చెందగా పది మంది గాయపడ్డారు. ఈ సంఘటన శనివారం వైఎస్సార్ జిల్లా వేముల మండలంలో జరిగింది. వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన కొంత మంది మహిళలు కూలి పనుల కోసం ఆటోలో వెళ్తుండగా వీరు ప్రయాణిస్తున్న ఆటోను సుమో ఢీ కొట్టింది. ఈ ఘటనలో మండల కేంద్రానికి చెందిన గంగాదేవి(50) అక్కడికక్కడే మృతి చెందింది.
ఆటోలో ఉన్న మరో 10 మంది గాయపడ్డారు. వారిలో రంగమ్మ, పుల్లమ్మ, తులసమ్మలు తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతానికి వీరి ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కాగా గాయపడిన వారు ప్రస్తుతం పులివెందుల ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.