ఎన్నికల హామీని తుంగలో తొక్కిన బాబు
గతంలో నిర్మించిన గృహాలకూ బిల్లుల నిలిపివేత
ప్రారంభం కాని ఇళ్ల రద్దు ఆందోళనలో లబ్ధిదారులు
చిత్తూరు: అర్హులైన పేదలందరికీ ప్రభుత్వమే పక్కాగృహాలు నిర్మించి ఇస్తుందని ఎన్నికల ప్రచారంలో ఊదరగొట్టిన చంద్రబాబు ఆ హామీని తుంగలో తొక్కారు. ఏడాది పాలన ముగిసినా ఒక్క పక్కాగృహం కూడా మంజూరు చేయలేదు. పక్కా గృహాలు వస్తాయని ప్రజలు వాటికోసం ఎదురు చూసినా ఫలితం లేదు. ఎన్నికల ప్రచారంలో అడిగిన వారికల్లా పక్కాగృహం ఇస్తామని చంద్రబాబు నమ్మబలికారు. అంతేకాదు గృహ నిర్మాణ వ్యయం రూ.70 వేల నుంచి రూ లక్షకు పెంచుతున్నట్లు ప్రకటించారు.
ఇల్లు కట్టుకోలేని నిరుపేదలకు ప్రభుత్వమే ఇళ్లు నిర్మిస్తుందని కూడా హామీ ఇచ్చారు. తీరా ఓట్లేయించుకుని గద్దెనెక్కి ఏడాది ముగిసినా ఒక్క పక్కాగృహం కూడా మంజూరు చేసిన పాపాన పోలేదు. ఇక కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఇందిరా ఆవాస్ యోజన పక్కాగృహాలదీ అదే పరిస్థితి. 2014-15 ఏడాదికి గాను 7112గృహాలు వచ్చాయన్నారు. ఆ తరువాత 2015-16కు గాను 5036 గృహాలు మంజూరయ్యాయని అధికారులు చెబుతున్నా ఒక్కటీ నిర్మాణానికి నోచుకోలేదు. గ్రామసభలు నిర్వహించి లబ్ధిదారులను ఎంపిక చేయాల్సి ఉందని, ఇంతలో ఎన్నికల కోడ్ వచ్చిందని సంబంధిత గృహనిర్మాణ శాఖ అధికారులు చెబుతున్నారు. మరోవైపు పక్కా గృహాల కోసం జిల్లా వ్యాప్తంగా దాదాపు 40వేల మంది పేదలు జన్మభూమి-మావూరు, గ్రీవెన్స్ డేల్లో వినతి పత్రాలు సమర్పించారు.
రూ .15 కోట్ల పాత బకాయిలు పెండింగ్
కొత్త ఇళ్ల సంగతి దేవుడెరుగు గత ప్రభుత్వ హయాంలో ఇందిరమ్మ పథ కం కింద మూడు విడతలకు సంబంధించిన పలుగృహాలను లబ్ధిదారులు ఆలస్యంగా పూర్తి చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన రూ 15 కోట్ల రూపాయల బిల్లులను కూడా ప్రభుత్వం ఇవ్వలేదు. దీంతో లబ్ధిదారులు లబోదిబో మంటున్నారు.
వైఎస్ హయాంలో అడిగినన్ని గృహాలు
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ హయంలో పేదలకు అడినన్ని గృహాలు ఇచ్చారు. ఇంటి నిర్మాణం పూర్తయ్యేందుకు పేదలకు పూర్తి సహకారం అందించారు. 2006 నుంచి 2009 వరకు ఇందిరమ్మ గృహాల పేరుతో జిల్లాలోని 3,57,370 మందికి పక్కా గృహాలు మంజూరు చేసిన ఘనత వైఎస్‌దే. ఏడాదికి లక్ష గృహాలకు పైగా మూడు సంవత్సరాల్లో 3,57,370 గృహాలను వైఎస్ మంజూరు చేశారు. వైఎస్ మూడు విడతల్లో కేటాయించిన మొత్తం గృహాల్లో 2,62,222 గృహాలు పూర్తి కాగా, మరో 41 వేల గృహాలు వివిధ దశల్లో నిలిచి పోయాయి. ఆర్థిక కారణాలతో ఇంతవరకు పలుగృహాలు ప్రారంభానికి నోచుకోలేదు.
వైఎస్ మరణానంతరం అధికారం చేపట్టిన రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి ఐదేళ్ల కాలంలో రచ్చబండ మూడు విడతల్లో 66,817 గృహాలను మాత్రమే మంజూరు చేశారు. అయితే ఇందులో 32,716 గృహాలు పూర్తి కాగా, 12వేలకు పైగా గృహాలు వివిధ దశల్లో నిలిచిపోయాయి. 21,868 గృహాల నిర్మాణం ప్రారంభంకాలేదు. వాటిని కూడా ప్రభుత్వం రద్దు చేసింది.
ఒక్క ఇల్లిస్తే ఒట్టు!
Published Wed, Jun 17 2015 9:35 AM | Last Updated on Mon, Aug 13 2018 3:11 PM
Advertisement
Advertisement