
రవాణాశాఖ దూకుడు
అరసవల్లి: రాష్ట్ర రవాణాశాఖ వంద రోజుల ప్రణాళికతో ఓ కొత్త కార్యాచరణ సిద్ధం చేసింది. ప్రమాదాలు, మరణాల సంఖ్యను గణనీయంగా తగ్గించడం, వాహన వేగాన్ని నియంత్రించడం, వన్‌టైం సెటిల్‌మెంట్‌తో పన్నుల చెల్లింపు తదితర అంశాలతో ఇది రూపొందింది. వాహన జరిమానా మాఫీ, స్పీడ్ లేజర్ గన్లు, బ్రీత్ ఎనలైజర్లు, అవగాహన కార్యక్రమాలు, జిల్లాల్లో శిక్షణ కేంద్రాలు ఏర్పాటు, వాహన యోగ్యత కేంద్రాలను అన్నిజిల్లాల్లో ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు ఉన్నతాధికారులు చేస్తున్నారు. వందరోజుల పణాళిక వివరాలు ఇలా...
వన్‌టైం సెటిల్‌మెంట్..
రాష్ట్ర విభజనకు ముందు జరిగిన సమైకాంధ్ర ఉద్యమం రవాణాశాఖ ఆదాయంపై తీవ్ర ప్రభావం చూపించింది. ఆ నష్టాన్ని కొంత మేర పూడ్చుకునేందుకు వందరోజుల ప్రణాళిక ద్వారా వన్‌టైం సెటిల్‌మెంట్‌ను ప్రవేశపెడుతోంది. వాహనాలకు గడువులోపు పన్ను చెల్లించకపోతే పన్నుతో పాటు అపరాధ రుసుం కట్లాల్సి ఉంటుంది. యజమానులు ఒక్కసారి పెండింగ్ ఉన్న పన్నును చెల్లిస్తే అపరాధ రుసుం కట్టాల్సిన అవసరం లేకుండా చర్యలు చేపట్టింది. దీని ద్వారా బకాయిలు వసూలవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు.
ప్రమాదాల నివారణకు చర్యలు..
ప్రమాదాలను నివారించేందుకు రవాణాశాఖ కొత్త ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అతి వేగం, మద్యం సేవించి వాహనం నడపడం వలన ఎక్కువ ప్రమాదాలు జరుగుతుండడంతో.. ఇటువంటి వారిని కనిపెట్టేందుకు నూతనంగా బ్రీత్ ఎనలైజర్లు, స్పీడ్ లేజర్‌గన్‌లు ఎంవీఐ, ఏఎంవీఐలకు త్వరలో అందించనుంది. రాష్ట్రంలోని 4.92 లక్షల మంది రవాణా డ్రైవర్లు ఉన్నారు. ప్రస్తుతం వాణిజ్య వాహనాల డ్రైవర్లకున్న వ్యక్తిగత ప్రమాద బీమా పథకాన్ని వీరందరికి వర్తింప చేయాలని ఆలోచిస్తున్నారు.
కంప్యూటరైజ్డ్ పరీక్ష కేంద్రాల ఏర్పాటు...
కేంద్ర ప్రభుత్వ సహాకారంతో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కంప్యూటరైజ్డ్ పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ విధానం ద్వారా వాహనాల ఫినెట్‌నెస్ పరీక్షలు సులభతరం, వేగవంతం అవ్వాలన్న ఆలోచనలో అధికారులు ఉన్నారు. అలాగే రాష్ట్ర స్థాయిలో కంప్యూటరైజ్డ్ పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసి పీపీపీ విధానంను అన్ని జిల్లాల్లో విస్తరణ చేయాలన్న ఆలోచనలో ఉన్నారు. ప్రస్తుతం కాల పరిమితి ముగిసిన రోడ్డు భద్రత మండలిని పునరుద్ధరించాలని అధికారులు నిర్ణయించారు. కలెక్టర్ చెర్మైన్‌గా జిల్లా స్థాయిలో భద్రత మండళ్లు త్వరలో ఏర్పాటు కాబోతున్నాయి. ప్రతి నెలా జిల్లాల్లోని ఓ పాఠశాల లేదా కళాశాలలో రహదారి ప్రమాదాలపై అవగాహన కార్యక్రమాలను నిర్విహిస్తారు. అధికలోడు వాహనాల ప్రయాణాన్ని నియంత్రించడం, సీటు బెల్టు పెట్టుకోకపోవడం, మద్యంతాగి, సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ, వ్యతిరేక మార్గంలో వాహనాలు నడిపేవారిపై ప్రత్యేక దాడులు నిర్వహిస్తారు.