బెల్లంపల్లి, న్యూస్‌లైన్ : తెలంగాణ బిల్లు వెనక్కి పంపిస్తామని సీఎం కిరణ్ శాసనసభలో చేసిన వ్యాఖ్యలకు మనస్తాపం చెంది బెల్లంపల్లిలోని బాబుక్యాంప్ బస్తీకి చెందిన రాజ్‌కుమార్(30) కూరగాయల మార్కెట్ ముళ్లపొదల్లో ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. ‘జై తెలంగాణ’ నినాదాలు చేస్తూ రోడ్డు పైకి రావడంతో స్థానికులు మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. అప్పటికే 90 శాతం కాలి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు.
108 అంబులెన్స్‌లో స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి సీపీఐ శాసనసభ పక్షనేత, ఎమ్మెల్యే గుండా మల్లేశ్ పరామర్శించారు. సీఐ రవీందర్ ఆస్పత్రికి చేరుకొని సంఘటన పూర్వపరాలు తెలుసుకున్నారు. రాజ్‌కుమార్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో అంబులెన్స్‌లో మంచిర్యాలకు తీసుకెళ్లగా చికిత్స పొందుతూ ప్రభుత్వాస్పత్రిలో సాయంత్రం మృతి చెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
తెలంగాణవాదుల ధర్నా..
సీఎం కిరణ్ చేసిన వ్యాఖ్యలకు ఓ నిండుప్రాణం బలైన ఘటనను పురస్కరించుకొని తెలంగాణవాదులు బజార్ ఏరియాలో ధర్నా నిర్వహించారు. కాంటా సమీపంలో ధర్నా చేసి కిరణ్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సీఎం వ్యాఖ్యల కారణంగానే రాజ్‌కుమార్ ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఆరోపించారు. తెలంగాణ బిల్లు వెనక్కి పంపిస్తామని కిరణ్‌కుమార్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలతో క్షోభకు గురైన గుమస్తాగా పని చేసే రాజ్‌కుమార్ టీవీలో వీక్షించి మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడని సీపీఐ శాసనసభ పక్షనేత తెలిపారు.
బెల్లంపల్లి ప్రభుత్వాస్పత్రిలో రాజ్‌కుమార్‌ను పరామర్శించిన అనంతరం మల్లేశ్ మాట్లాడారు. శాసనసభలో రాజ్‌కుమార్ మృతి అంశాన్ని లేవనెత్తుతానని తెలిపారు. మృతుడికి సంతాపం తెలిపి కుటుంబ సభ్యులకు సానుభూతి ప్రకటించారు.
కొవ్వొత్తుల ర్యాలీ..
రాజ్‌కుమార్ మృతికి సంతాపంగా టీ-జేఏసీ, ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో పట్టణంలో కొవ్వొత్తుల ర్యాలీ జరిగింది. కాంటా చౌరస్తా నుంచి బజార్ ఏరియా పురవీధుల మీదుగా ర్యాలీ కొనసాగింది. రాజ్‌కుమార్ అమర్‌హే.., ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి డౌన్ డౌన్ అంటూ తెలంగాణ వాదులు పెద్ద పెట్టున నినాదాలు చేశారు. కొవ్వొత్తులతో నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో టీ-జేఏసీ పట్టణ కన్వీనర్ గజెల్లి వెంకటయ్య, నాయకులు పున్నం చంద్రు, వాసురాం, కె.విద్యాసాగర్, రంగ మహేశ్, రేణికుంట్ల శ్రీనివాస్, వేణుగోపాల్ పాల్గొన్నారు.
నేడు బెల్లంపల్లి బంద్
తెలంగాణ కోసం ఆత్మార్పణ చేసుకున్న రాజ్‌కుమార్ మృతికి సంతాపంగా సోమవారం బెల్లంపల్లి పట్టణ బంద్‌కు పిలుపు ఇచ్చినట్లు ఆర్యవైశ్య సంఘం, టీ-జేఏసీ నాయకులు ప్రకటించారు. వ్యాపార, వాణిజ్యవర్గాలు బంద్‌కు సంపూర్ణంగా సహకరించాలని కోరారు. ఆటోలు,జీపులు, బస్సులు, దుకాణాలను మూసివేసి బంద్‌లో పాల్గొనాలని కోరారు.
సీఎం వ్యాఖ్యలకు కలత చెంది..
Published Mon, Jan 27 2014 2:34 AM | Last Updated on Tue, Nov 6 2018 7:53 PM
Advertisement
Advertisement