నెలలోగా సమస్యలు పరిష్కరించాలి | one month finesh you problems | Sakshi
Sakshi News home page

నెలలోగా సమస్యలు పరిష్కరించాలి

Published Thu, Aug 8 2013 3:16 AM | Last Updated on Tue, Oct 2 2018 4:26 PM

one month finesh you  problems

నల్లగొండ టౌన్, న్యూస్‌లైన్ : జిల్లా కేంద్ర ప్రభుత్వాస్పత్రిలో తిష్టవేసిన సమస్యలన్నింటినీ నెలరోజుల్లోగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్, ఆస్పత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ ఎన్.ముక్తేశ్వర్‌రావు అధికారులను ఆదేశించారు. నల్లగొండలోని ఆస్పత్రి కార్యాలయంలో బుధవారం జరిగిన ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. మూలనపడిన అల్ట్రా సౌండ్ మిషన్ స్థానంలో కొత్త మిషన్‌ను కమిటీ తీర్మాణంతో కొనుగోలు చేయాలని, గత ఐదు నెలలుగా పనిచేయని సీటీస్కాన్ మిషన్‌ను వెంటనే మరమ్మతులను చేయించి వినియోగంలోకి తీసుకురావాలని ఆదేశించారు. ఆస్పత్రికి వచ్చే నిరుపేదలకు ఎలాంటి ఇబ్బం దులు తలెత్తకుండా చూడాల్సిన బాధ్యత సిబ్బందిపైనే ఉందన్నారు.
 
 అత్యవసర మందులను బయట నుంచి కొనుగోలు చేయకుండా జనరిక్ స్టోర్స్ నుంచే కొనుగోలు చేయాలని ఆదేశించారు. అవసరమున్న మందులు సరఫరా చేయడానికి డీఆర్‌డీఏ సిద్ధంగా ఉందన్నారు. తాగునీటి పైప్‌లైన్‌ను, డ్రెయిన్ పైప్‌లైన్‌లను తొలగించి వాటి స్థానంలో కొత్త పైప్‌లైన్లు వేయించాలని ఆదేశించారు. నాణ్య తా ప్రమాణాలు పాటించే కాంట్రాక్టర్‌ను గుర్తించి పనులను అప్పగించి త్వరితగతిన పూర్తిచేసే విధంగా చూడాలన్నారు. ఆస్పత్రి రక్తనిధి కేంద్రం నుంచి ఆస్పత్రిలోని పేషంట్లకు ఉచి తంగా రక్తం అందజేయాలని, బయటి పేషంట్లకు నామమాత్రపు ఫీజు తీసుకుని అందజేయాలని కోరారు.  రోగులకు మెరుగైన వైద్యసేవలను అందించేందుకు వైద్యులు కృషి చేయాలని కోరారు. 
 
 వచ్చే నెల 7వ తేదీన తిరిగి సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఆ సమావేశం నాటికి అస్పత్రిలో సమస్యలన్నింటినీ పరిస్కరించాలన్నారు. ఈ సమావేశంలో డీసీహెచ్‌ఎస్ డాక్టర్ సురేష్‌కుమార్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ పి.ఆ మోస్, ఆస్పత్రి పర్యవేక్షకులు డాక్టర్ హరినాథ్, ఆర్‌ఎంఓ డాక్టర్ ఉదయ్‌సింగ్, డాక్టర్లు శ్రీనివాస్‌రావు, నర్సింగరా వు, మాతృనాయక్, హేమలత, రెడ్‌క్రాస్ కార్యదర్శి పులిజాల రాంమోహన్‌రావు, ఈఈ ఇజాజ్ తదితరులు పాల్గొన్నారు.
 
 మొక్కుబడిగా సాగిన సమావేశం
 నిత్యం 300మంది ఇన్‌పేషంట్లు, 500కు పైగా ఔట్ పేషంట్లతో కిటకిటలాడుతున్న జిల్లా కేంద్ర ప్రభుత్వాస్పత్రిలో అనేక సమస్యలు తిష్టవేసి ఉన్నాయి. వాటిని పరిస్కరించడానికి జిల్లా కలెక్టర్ చైర్మన్‌గా, స్థానిక ప్రజాప్రతినిధులతో పాటు ఇతర అధికారులు సభ్యులుగా ఉన్న ఆస్పత్రి అభివృద్ధి కమిటీ చర్యలు తీసుకోవాల్సి ఉంది. ప్రతి మూడునెలలకు ఒకసారి కమిటీ సమావేశం కావా ల్సి ఉంది. కానీ, 20 నెలల తరువాత సమావేశమైనప్పటికీ ఏ ఒక్క ప్రజాప్రతినిధి కూడా హాజరుకాకపోవడం గమనార్హం. సమస్యలపై చర్చించేవారు లేకపోవడంతో సమావేశం మొక్కుబడిగా గంటసేపట్లోనే ముగించేశారు.
 
 డీవైఎఫ్‌ఐ, ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా
 జిల్లా కేంద్ర ప్రభుత్వాస్పత్రిలో నెలకొన్న సమస్యలు పరిస్కరించాలని, ఆస్పత్రిలో జరుగుతున్న అక్రమాలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ బుధవారం నల్లగొండలోని ఆస్పత్రిలో డీవైఎఫ్‌ఐ, ఏఐవైఎఫ్‌ల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఎన్.ముక్తేశ్వర్‌రావు అధ్యక్షతన జరుగుతున్న సమావేశంలోనికి వెళ్లి వినతిపత్రం ఇవ్వడానికి ప్రయత్నించారు. కానీ సమావేశం అనంతరం వినతిపత్రం తీసుకుంటామని అధికారులు సమాధానం  చెప్పడంతో ఆయా సంఘాల  నాయకులు సమావేశ మందిరంలోకి చొచ్చుకుని వెళ్లేందుకు ప్రయత్నించడంతో సిబ్బంది అడ్డుకున్నారు. 
 
 అధికారుల తీరును నిరసిస్తూ అక్కడే ధర్నా నిర్వహించారు. సమాచారం అందుకున్న టూటౌన్ పోలీసులు ఆస్పత్రికి చేరుకుని ధర్నా చేస్తున్న డీవైఎఫ్‌ఐ నాయకులు జంజిరాల సైదులు, శ్రీనివాసచారి, శ్రీకాంత్,శ్రీను, నరేష్, సాయి ఇమ్రాన్, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి ఎల్.శ్రవణ్‌కుమార్, వి.లెనిన్, మునీర్, పి.నాగరాజు, సైదులు, మణీందర్‌లను అరెస్టు చేశారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement