ఒకటే ఉత్కంఠ.. సీటు ఎవరికంట? | One Of The Most Exciting Places For The Seat In Kakinada | Sakshi
Sakshi News home page

ఒకటే ఉత్కంఠ.. సీటు ఎవరికంట?

Published Fri, Mar 15 2019 1:22 PM | Last Updated on Fri, Mar 15 2019 1:23 PM

One Of The Most Exciting Places For The Seat In Kakinada - Sakshi

సాక్షి, బోట్‌క్లబ్‌: ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావడానికి సమయం దగ్గర పడుతున్నకొద్దీ అటు నాయకుల్లోను, ఇటు పార్టీల కార్యకర్తల్లోను ఉత్కంఠ పెరుగుతోంది. తామంటే తామే అభ్యర్థులమంటూ కొంతమంది ఏర్పాట్లు చేసుకొంటున్నప్పటికీ అధినేతల నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ రాకపోవడంతో లోలోపల ఒత్తిడి పెరుగుతోంది. అసలు తమ నాయకుడికి టిక్కెట్‌ వస్తుందా? మరెవరికైనా పోతుందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 


ఎమ్మెల్యే వనమాడిపై తీవ్ర వ్యతిరేకత


కాకినాడ సిటీ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి ఎంపికపై ఆ పార్టీ అధినేత ఇప్పటికీ నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. ఇక్కడ సిట్టింగ్‌ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు సీటు తనదేనని ప్రచారం చేసుకొంటున్నప్పటికి ఆయన సీటుపై సృష్టత లేదు. కొండబాబు సోదరుడు సత్యనారాయణ పెత్తనం పెరిగిపోవడంతో ఆ పార్టీకి చెందిన 17 మంది కార్పొరేటర్లు కొండబాబుకి టిక్కెట్లు ఇస్తే అతనిని ఓడిస్తామని ఏకంగా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు వద్ద పంచాయతీ పెట్టారు.

టిక్కెట్టు కొండబాబుకు కాకుండా ఎవరికి ఇచ్చినా తాము పార్టీకి అండగా ఉంటామని అల్టిమేటం జారీ చేశారు. ఇటీవల ఒక ఫంక్షన్‌ హాల్‌లో కూడా సిట్టింగ్‌ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా సమావేశం కూడా ఏర్పాటు చేసుకొన్నారు. కాకినాడ నగరంలో పలు స్థలాలు కబ్జా చేయడంతోపాటు మద్యం, గుట్కా మాఫియా నుంచి ముడుపులు స్వీకరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వనమాడికి టిక్కెట్లు ఇస్తే ఇబ్బందులు తప్పవన్న ఆలోచనలో టీడీపీ నాయకులు ఉన్నారు.


ప్రాబల్యం చూపని జనసేన


జనసేన టిక్కెట్టు మాజీ మంత్రి ముత్తా గోపాలకృష్ణ  తనయుడు ముత్తా శశిధర్‌కు కేటాయించారు. దీంతో ఆయన ప్రచారం కూడా ప్రారంభించారు. శశిధర్‌కు ప్రజలను ఆకట్టుకోవడంలో అంతు చురుకుదనం లేకపోవడం, జనసేన టిక్కెట్టు ఆశించి భంగపడ్డ నాయకులు ప్రస్తుతం దూరంగా ఉన్న నేపథ్యంలో ఆయనది ఒంటరి పోరాటం అని చెప్పాలి.


అభ్యర్థి వేటలో కాంగ్రెస్‌ 


2014 ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీచేసిన పంతం నానాజీ ప్రస్తుతం జనసేన పార్టీలోకి వెళ్లడంతో ప్రస్తుతం కాంగ్రెస్‌ పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్థి కరువయ్యారు. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించడంతో కాంగ్రెస్‌ పార్టీకి డిపాజిట్లు కూడా దక్కడం లేదు. కనీసం జెండా మోసేవారు కూడా ఆ పార్టీకి కరువయ్యారు. ఈ నేపథ్యంలో టిక్కెట్‌ ఇస్తామన్నా పోటీ చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. 

దూకుడుగా జనంలోకి వైఎస్సార్‌ సీపీ

రానున్న ఎన్నికల్లో తన సత్తా చాటేందుకు వైఎస్సార్‌ సీపీ దూకుడు ప్రదర్శిస్తోంది. పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన నవరత్నాల పథకాలను ఇప్పటికే ప్రజల్లోకి నాయకులు, కార్యకర్తలు తీసుకెళ్లారు. ముఖ్యమంత్రిగా జగన్‌మోహన్‌రెడ్డికి ఒక అవకాశం ఇవ్వాలని కోరుతుండడంతో ప్రజల నుంచి సానుకూలత వ్యక్తమవుతోంది. పార్టీ కాకినాడ సిటీ కో– ఆర్డినేటర్‌ ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి ఆధ్వర్యంలో రోజూ వివిధ డివిజన్లలో నవరత్నాల ప్రచార కార్యక్రమం నిరంతరం కొనసాగుతుండడంతో ఈ పథకాలపై ప్రజల్లో సృష్టత ఏర్పడింది.

వైఎస్సార్‌ రైతు భరోసా, ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ, జలయజ్ఞం, మద్యపాన నిషేధం, అమ్మ ఒడి, వైఎస్సార్‌ ఆసరా, పేదలందరికీ ఇళ్లు, పింఛన్ల పెంపు తదితర పథకాలతోనే నిజమైన సంక్షేమం సాధ్యమవుతుందన్న భరోసా ఏర్పడడంతో ఈసారి వైఎస్సార్‌ సీపీకి అవకాశం ఇస్తే బాగుంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement