కదిరి: కదిరి పట్టణంలోని కస్తూరిబాయి వీధికి చెందిన బోగాతమ్మ హత్య మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఆస్తి కోసమే ఆమెను అంతమొందించినట్లు విచారణలో తేలింది. చిన్నల్లుడి సోదరే నిందితురాలని తేలింది. ఈమెతోపాటు మరో ఇద్దరు కిరాయి హంతకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను పట్టణ సీఐ గోరంట్ల మాధవ్ శనివారం తన చాంబర్‌లో మీడియాకు వెల్లడించారు.
డబ్బు కోసం ఒత్తిడి
బోగాతమ్మకు ఇద్దరు సంతానం. పెద్ద కుమార్తె పద్మావతమ్మ హైదరాబాద్‌లోని నిమ్స్‌లో ఉద్యోగం చేస్తోంది. చిన్న కుమార్తె భాగ్యలక్ష్మి గృహిణి. ఈమె భర్త రైల్వే కుళ్లాయప్ప అలియాస్ కుమార్ తిరుపతిలో రైల్వే గార్డుగా పనిచేస్తున్నాడు. బోగాతమ్మకు కదిరి పట్టణంలోని కస్తూరిబాయి వీధిలో రెండు, చైర్మన్ వీధిలో ఒకటి ఇలా మొత్తం మూడు ఇళ్లు ఉన్నాయి. అందులో ఒక ఇల్లు తన చిన్న కుమార్తె పేరుమీద ఉండటంతో ఆ ఇంటిని గత నెలలో తల్లి బోగాతమ్మ తిరిగి తన పేరుమీద రాయించుకుంది. మరో ఇల్లు ఈ మ«ధ్యే అమ్మి ఆ వచ్చిన డబ్బులో చిన్నల్లుడి అవసరాల కోసం రూ.18 లక్షలు ఇచ్చింది. ఇంకా కావాలని డిమాండ్ చేస్తుండటంతో తన దగ్గర డబ్బు లేదంటూ చివరిగా రూ.5 లక్షలు ఇచ్చింది. ఇక డబ్బులు అడగనంటూ చిన్నల్లుడి చేత రాయించుకొని దాన్ని ల్యామినేషన్ చేయించుకొని ఇంట్లో భద్రంగా దాచుకుంది.
వెలుగులోకి వచ్చిందిలా..
తల్లి బోగాతమ్మ కన్పించడం లేదంటూ హైదరాబాద్‌లో ఉంటున్న పెద్ద కుమార్తె పద్మావతమ్మ ఈ నెల రెండో తేదీన కదిరి పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ కేసును ఎస్పీ జీవీజీ అశోక్‌కుమార్‌తో పాటు కదిరి డీఎస్పీ శ్రీలక్ష్మి సీరియస్‌గా తీసుకున్నారు. ఆమె సెల్‌కు వచ్చిన ఫోన్ నంబర్ల ఆధారంగా ఎవరో హత్య చేశారని నిర్ధారించుకున్నారు. ఎస్పీ, డీఎస్పీల ఆదేశాల మేరకు సీఐ ఆధ్వర్యంలో రంగంలోకి దిగిన పట్టణ ఎస్‌ఐ హేమంత్‌కుమార్‌లు దర్యాప్తు ప్రారంభించారు. కర్ణాటక పోలీసుల సహకారంతో కేసును ఛేదించారు. ప్రధాన నిందితురాలైన చిన్నల్లుడు సోదరి రామలక్ష్మితోపాటు ఆమెకు సహకరించిన కిరాయి హంతకులు అల్లాబకాష్, రమేష్‌లను అరెస్ట్ చేసినట్లు సీఐ వెల్లడించారు. బోగాతమ్మ చిన్నల్లుడు కుళ్లాయప్ప అలియాస్ కుమార్ పాత్రపై కూడా అనుమానం ఉందని, విచారణలో తేలుస్తామని తెలిపారు. నిందితులను శనివారం కోర్టులో హాజరుపరచగా.. వారిని మెజిస్ట్రేట్ రిమాండ్‌కు ఆదేశించారన్నారు.
నమ్మించి మట్టుబెట్టేశారు
గోరంట్లలో తక్కువ ధరకే రైతుల దగ్గర బియ్యం దొరుకుతాయని చిన్నల్లుడి సోదరి రామలక్ష్మితో పాటు ముదిగుబ్బ మండలం నాగారెడ్డిపల్లికి చెందిన అల్లాబకాష్, బెంగుళూరులో కారు అద్దెకు పెట్టుకొని జీవనం సాగిస్తున్న రమేష్‌లు బోగాతమ్మను నమ్మించి జూన్ 26న కారులో తీసుకెళ్లారు. అల్లుడి సోదరే కదా అని ఆమె వారి మాటలు నమ్మి వెంట వెళ్లింది. గోరంట్ల దగ్గరకు వెళ్లగానే కారులో సిద్ధంగా ఉంచుకున్న దోమల నివారణ మందును ఆమెపై స్ప్రేపై చేయడంతో స్పృహతప్పి పడిపోయింది. అక్కడే బోగాతమ్మను హత్య చేసి.. ఎవరికీ అనుమానం రాకుండా కర్ణాటక రాష్ట్రం తవరగిరి పోలీస్‌స్టేషన్ పరిధిలోని రోడ్డు పక్కన శవాన్ని పడేసి వచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment