జూనియర్ అసిస్టెంట్ కుర్చీలో కూర్చుని విధులు నిర్వర్తిస్తున్న నూతన ఎంపీడీఓ, బదిలీఅయిన కుర్చీ వదలని ఇన్‌చార్జి ఎంపీడీఓ స్వరూపరాణి
నెల్లూరు, సైదాపురం: స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో కుర్చీలాట సాగుతోంది. బదిలీ ఉత్తర్వులు అందినా ఇన్‌చార్జి ఎంపీడీఓ కుర్చీని వదలడం లేదు. అధికార పార్టీ నేతల సిఫార్సు తనకు ఉందని...మళ్లీ ఉత్తర్వులు తెచ్చుకుంటానని చెబుతూ బాధ్యతలు అప్పగించలేదు. దీంతో నూతన ఎంపీడీఓ చేసేది లేక జూనియర్ అసిస్టెంట్ సీటులో ఆశీనులయ్యారు. ఈ విచిత్రమైన పరిణామమం సోమవారం చోటు చేసుకుంది.
సైదాపురం ఇన్‌చార్జి ఎంపీడీఓగా రాపూరు ఈఓపీఆర్డీ స్వరూపరాణి విధులను నిర్వహిస్తున్నారు. గత వారం ఎంపీడీఓ కార్యాలయంపై అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు చేసి బహిరంగంగా కార్యాలయంలో లంచం తీసుకుంటున్న పంచాయతీ కార్యదర్శి సుబ్బరాయులను పట్టుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇన్‌చార్జి ఎంపీడీఓ స్వరూపరాణిని జెడ్పీ సీఈఓ బదిలీ చేశారు. ఆమె స్థానంలో చిట్టమూరు ఈఓపీఆర్డీ వీరబ్రహ్మాన్ని నియమిస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఎంపీడీఓ కార్యాలయానికి శనివారం ఉత్తర్వులతో వచ్చిన కొత్త ఎంపీడీఓ వీరబ్రహ్మానికి చేదు అనుభవం ఎదురైంది. బాధ్యతలను అప్పగించాల్సిన ఇన్‌చార్జి ఎంపీడీఓ స్వరూపారాణి అందుకు నిరాకరించింది. ఈ క్రమంలో సోమవారం కార్యాలయానికి చేరుకున్న ఎంపీడీఓ వీరబ్రహ్మానికి ఎంపీడీఓ గదికి తాళాలు వేసి దర్శనమిచ్చాయి. ముందుగా కార్యాలయానికి చేరుకున్న బదిలీ అయిన ఇన్‌చార్జి ఎంపీడీఓ స్వరూపరాణి గదికి తాళాలు వేసుకుని తహసీల్దార్ కార్యాలయంలో జరుగుతున్న గ్రీవెన్స్‌డేకు హాజరయ్యారు. ఈ విషయాన్ని తెలుసుకున్న కొత్తగా బాధ్యతలు చేపట్టిన ఎంపీడీఓ సైతం గ్రీవెన్స్‌డేకు హాజరయ్యారు. గ్రీవెన్స్‌డేకు ఇద్దరు ఎంపీడీఓలు హాజరుకావడం చూసి మిగిలిన అధికారులు నవ్వుకుంటూ గుసగుసలాడుకున్నారు.
బదిలీ ఉత్తర్వులనుపట్టించుకోని ఇన్‌చార్జి ఎంపీడీఓ
సోమవారం ఉదయం 11:54 గంటలకు స్వరూపరాణిని బదిలీ చేసిన ఉత్తర్వుల కాపీ జెడ్పీ కార్యాలయం నుంచి ఎంపీడీఓ కార్యాలయానికి మెయిల్ ద్వారా వచ్చింది. అయినా ఇన్‌చార్జి ఎంపీడీఓ పట్టించుకోకపోవడం గమనార్హం.
జూనియర్ అసిస్టెంట్ సీటులో నుంచి విధులు
ఇన్‌చార్జి ఎంపీడీఓ కుర్చీని వదలకపోవడంతో కొత్తగా బాధ్యతలు చేపట్టిన ఎంపీడీఓ వీరబ్రహ్మం జూనియర్ అసిస్టెంట్ సీటులో నుంచే విధులను నిర్వర్తించాల్సి వచ్చింది. బదిలీ అయినా స్వరూపరాణి కుర్చీని వదలకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
సీఈఓకు రాతపూర్వకంగా ఫిర్యాదు
ఉన్నతాధికారుల ఉత్తర్వుల మేరకు ఎంపీడీఓగా బాధ్యతలను చేపట్టిన వీరబ్రహ్మానికి ఇన్‌చార్జి ఎంపీడీఓ స్వరూపరాణి బాధ్యతలను అప్పగించ లేదు. ఇన్‌చార్జి ఎంపీడీఓ బాధ్యతలు అప్పగించకుండా విధులకు అంటకం కలిగించడంపై జెడ్పీ సీఈఓకు రాత పూర్వకంగా ఫిర్యాదు చేస్తున్నట్లు కొత్తగా బాధ్యతలు చేపట్టిన ఎంపీడీఓ వీరబ్రహ్మాం సోమవారం తెలిపారు.
అధికార పార్టీ నాయకుల మద్దతు
‘తనకు అధికార పార్టీ నాయకులు సిఫార్సు ఉంది. బదిలీ అయినా బాధ్యతలను ఎవ్వరికి అప్పగించొద్దని తనకు చెప్పారని, అందుకే బాధ్యతల నుంచి తప్పుకునే ఉదేశం లేదని’ బదిలీ అయిన ఎంపీడీఓ స్వరూపారాణి చెబుతుండడం గమనార్హం. ఓ బాధ్యత కలిగిన అధికారి ఉన్నతాధికారులు ఇచ్చిన బదిలీ ఉత్తర్వులను ఖాతరు చేయకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment