మరణించినా.. చిరంజీవుడే!
Published Wed, Feb 5 2014 3:13 AM | Last Updated on Fri, Sep 28 2018 3:39 PM
చీపురుపల్లి రూరల్, న్యూస్‌లైన్ : మండలంలోని పేరిపి-ఇటకర్లపల్లి గ్రామాల మధ్య మంగళవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో పట్టణంలోని అడ్డూరివీధికి చెందిన చల్లా రమణ(38) మృతి చెందాడు. మృతుడు రమణ పట్టణంలోని సిటీకేబుల్ నెట్‌వర్క్‌లో కేబుల్ ఆపరేటర్‌గా పని చేస్తున్నాడు. విధుల్లో భాగంగా మండలంలోని ఇటకర్లపల్లి గ్రామానికి చీపురుపల్లి వైపు నుంచి ద్విచక్రవాహనంపై తన స్నేహితుడితో కలసి బయల్దేరాడు. వీరి వాహనానికి ముందు భాగాన ట్రాక్టర్ వెళ్తోంది. పేరిపి-ఇటకర్లపల్లి మధ్య ట్రాక్టర్‌ను ద్విచక్ర వాహనంతో ఓవర్‌టేక్ చేయబోయారు. అదే సమయంలో ట్రాక్టర్ పక్కవైపునకు తిరగడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ట్రాక్టర్‌ను వీరి ద్విచక్ర వాహనం ఢీకొనడంతో వెనుక కూర్చొన్న రమణ ఒక్క ఉదుటున కిందపడిపోయాడు. అతని శరీరం మీద నుంచి ట్రాక్టర్ వెళ్లిపోవడంతో సంఘటన స్థలంలోనే ప్రాణాలు విడిచాడు. మృతుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అనాథలైన భార్యాపిల్లలు
మృతుడు రమణది నిరుపేద కుటుంబం. అతనికి భార్య మాధవితోపాటు ఆరు, నాలుగు సంవత్సరాల వయస్సు గల ఇద్దరు పిల్లలు ఉన్నారు. రమణ మరణంతో వీరు అనాథలయ్యారు.
విషాదంలోనూ నేత్రదానానికి అంగీకారం
పుట్టెడు శోకంలోనూ రమణ నేత్రాలను దానం చేసేందుకు కుటుంబ సభ్యులు ముందుకొచ్చారు. ఈ మేరకు పట్టణానికి చెందిన మానవీయతా స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకుడు బి.వి.గోవిందరాజులుకు ఫోన్ చేసి నేత్రదానానికి అంగీకరించారు. దీంతో గరివిడి కంటి ఆస్పత్రి వైద్యనిపుణులు వచ్చి రమణ మృతదేహం నుంచి నేత్రాలను సేకరించి నేత్రనిధికి పంపారు.
Advertisement
Advertisement