భద్రాచలం టౌన్, న్యూస్‌లైన్: చెట్టును కారు ఢీకొన్న ప్రమాదంలో ఒకరు మృతచెందగా, ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. దుమ్ముగూడెం మండలం తూరుపాక గ్రామం వద్ద శుక్రవారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. మృతుడి బంధువులు తెలిపిన ప్రకారం...
వరంగల్ జిల్లా జనగాం మండలం కామారెడ్డిపల్లి గ్రామానికి చెందిన జిలకర సురేష్.. భద్రాచలంలోని రిక్షా కాలనీలో ఉంటున్న బంధువులైన గిరిగాని వెంకటేశ్వర్లు-పద్మ ఇంటికి శుక్రవారం సాయంత్రం కారులో చుట్టపు చూపుగా వచ్చాడు. కొద్దిసేపటి తరువాత వెంకటేశ్వర్లు-పద్మ దంపతుల కుమారులు సాయికిరణ్, శశికిరణ్‌ను తీసుకుని బజారులో చికెన్ తెచ్చేందుకుని సురేష్ బయల్దేరాడు. వారు చికెన్ తీసుకుని, పెద్దనల్లబల్లి గ్రామంలోని బంధువుల ఇంటికి బయల్దేరారు. ఆ పిల్లలు దారి మధ్యలో తమ తల్లికి ఫోన్ చేసి, పెద్దనల్లబల్లిలో బంధువులను కలిసి వస్తామని చెప్పారు. ‘త్వరగా రండి..’ అంటూ ఆమె ఫోన్ పెట్టేసిన కొద్ది క్షణాలకే.. తూరుబాక వద్ద కారు రోడ్డు పక్కనున్న చెట్టును ఢీకొంది. స్థానికులిచ్చిన సమాచారంతో వెంటనే 108 సిబ్బంది వచ్చి క్షతగాత్రులను భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే, తలకు బలమైన గాయంతో సాయికిరణ్ (13) మృతిచెందాడు.
శశికిరణ్, సురేష్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వారిని మెరుగైన చికిత్స కోసం ఖమ్మం తరలించారు. వీరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. స్థానిక జ్యోతి కాన్వెంట్‌లో సాయికిరణ్ 8వ తరగతి, శశికిరణ్ 5వ తరగతి చదువుతున్నారు. పిల్లల తల్లి గిరిగాని పద్మ.. సీపీఎం అనుబంధ మహిళా సంఘం (ఐద్వా) డివిజన్ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు.
చెట్టును ఢీకొన్న కారు
Published Sat, Dec 14 2013 6:35 AM | Last Updated on Tue, Aug 14 2018 3:22 PM
Advertisement
Advertisement