
ఎన్‌ఏడీ జంక్షన్(విశాఖ పశ్చిమ): రవాణా శాఖలో నూతనంగా ప్రవేశపెట్టిన ‘ఒకే రాష్ట్రం–ఒకే సిరీస్’విధానం వాహనదారులకు సరికొత్త ఇక్కట్లను తీసుకొచ్చింది. ఈ విధానంలో భాగంగా వాహనాలకు ఏపీ 39 సిరీస్ గత నెలాఖరు నుంచి అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. దీని ద్వారా భారీగా ఆదాయం వచ్చి చేరుతుందని ఆలోచించిన ప్రభుత్వం.. వాహనదారులపై పడే భారం గురించి ఆలోచించలేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. నూతన విధానంతో ప్రత్యేక(ఫ్యాన్సీ) నంబర్ల కోసం గతంలో కంటే అధికంగా వెచ్చించాల్సి వస్తోందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పైగా బిడ్డింగ్‌లో పాల్గొనకపోతే ఫ్యాన్సీ నంబర్ల కోసం రవాణా శాఖకు ముందుగా డీడీ రూపంలో ఇచ్చే ధరావత్తు మొత్తం తిరిగి రాదన్న నిబంధనతో వారు ఆందోళన చెందుతున్నారు.
గతంలో రూ. 2వేలే.. నేడు రూ. 10 వేలు
తాజాగా ప్రవేశపెట్టిన ఏపీ 39 సిరీస్‌తో వాహనదారుల జేబులు గుల్ల అవుతున్నాయి. నూతన విధానం రాక ముందు ఉదాహరణకు 3663 నంబరు కావాలంటే రూ. 2వేలు చెల్లిస్తే సరిపోయేది. పోటీ ఉంటే బిడ్డింగ్ జరిగేది.. అదికూడా మహా అయితే రూ. 5వేల దాటకుండా ఉండేది. ప్రస్తుతం ఇదే నంబరుకు రూ. 10 వేలు చెల్లించాల్సి వస్తోంది. నూతన విధానం వల్ల ఒకే నంబరుకు ఎక్కువ మంది పోటీ పడాల్సి వస్తోంది. దీంతో వేలంలో వాహనాల నంబర్లకు అధిక ధరలు చెల్లించాల్సి వస్తుందని వాహనదారులు వాపోతున్నారు. వాహనదారుల్లో అధిక శాతం మంది టోటల్ 9కే ఆసక్తి చూపుతారు. అందులోనూ రేజింగ్ నంబర్లకు(ఉదా.3699, 4599) గిరాకీ ఉంటుంది. ప్రస్తుత విధానంతో సామాన్యుడు ఓ మోస్తరు నంబరు పొందాలంటే భారీగా సమర్పించుకోవాల్సిన పరిస్థితి ఉంది.
బిడ్డింగ్‌లో పాల్గొనకపోతే..
బిడ్డింగ్ సమయంలో వాహనదారుడు పాల్గొనక పోతే.. బిడ్డింగ్ రిజర్వేషన్ సమయంలో చెల్లించిన నగదు వెనక్కిరాదు. సాధారణంగా మధ్యాహ్నం 2గంటల నుంచి 4 గంటల వరకు బిడ్డింగ్ జరుపుతారు. అయితే బిడ్డింగ్ సమయంలో సర్వర్‌లు హ్యాంగ్ అయినా, నెట్‌వర్క్ సపోర్ట్ లేకపోయినా బిడ్డింగ్‌లో పాల్గొననట్టే లెక్క. ఉదాహరణకు 0009 నంబరు ప్రీమియం నంబరు కావడంతో రూ.50వేలు చెల్లించాల్సి ఉంది. ఇటువంటి నంబర్లకు పోటీ ఎక్కువగా ఉంటుంది.
పోటీదారులు నంబరు రిజర్వేషన్‌కు రూ.50వేలు ముందుగానే చెల్లించి వేలానికి వెళతారు. అయితే వేలం జరిగే సమయంలో సర్వర్ హ్యాంగ్ అయినా, నెట్ సపోర్ట్ లేకపోయినా, ఇతర కారణాలవల్ల వేలంలో పాల్గొనలేకపోయినా రూ.50వేలు నష్టపోయినట్టే. రిజర్వేషన్ అయిన తర్వాత బిడ్డింగ్ ఆప్షన్ ఎంచుకున్న వాహనదారుడికి కనీసం మెసేజ్ కూడా రావపోవడం వల్ల నగదును నష్టపోతున్నామని వారు వాపోతున్నారు.
ఫ్యాన్సీ నంబర్లు ఇక కష్టమే
గతంలో వలే ఇక ఫ్యాన్సీ నంబర్లను దక్కించుకోవడం కష్టమే. రాష్ట్ర వ్యాప్తంగా పోటీ పెరుగుతుంది. సిరీస్‌లో నచ్చిన నంబర్ కావాలంటే సాధారణ వాహన చోదకులకు భారంగా మారుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా దీని కోసం బిడ్‌లో పోటీ పడడమే కారణం.– శంకర్ రెడ్డి, కరాసా, విశాఖ
బిడ్ ధర ఎక్కువకెళ్తోంది..
ఫ్యాన్సీ నంబర్ల కోసం ప్రభుత్వ ధరల్లో మార్పు లేకపోయినా బిడ్ ధర ఎక్కువకెళ్తోంది. ఇది కార్ల యజమానులకు భారమవుతుంది. ద్విచక్ర వాహనానికి ఫ్యాన్సీ నంబర్ కోసం ఆన్‌లైన్‌లో ప్రయత్నించి విరమించుకున్నాను. ఏకరూప నంబర్ బాగున్నా సామాన్యులకు మాత్రం భారంగా ఉంటుంది.– హనుమంతు, శివనగర్
సాంకేతిక సమస్యలుంటే ఫిర్యాదు చేయాలి
ప్రత్యేక నంబర్ల కోసం వేలంలో పాల్గొనే ముందు రవాణాశాఖలో పొందుపర్చిన నిబంధనలను క్షుణ్ణంగా తెలుసుకోవాలి. డబ్బులు చెల్లించి వేలంలో పాల్గొనకపోతే డబ్బు తిరిగి ఇవ్వడం జరగదు. ఎవరికైనా బిడ్డింగ్ సమయంలో సర్వర్ సమస్య వచ్చినా.. నెట్‌వర్క్ సపోర్ట్ లేకపోయినా రవాణా శాఖ హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేయాలి. ఆ ఫిర్యాదు ఆధారంగా రవాణాశాఖ సిబ్బంది పూర్తి స్థాయిలో విచారణ చేస్తారు. సాంకేతిక సమస్యలు తలెత్తినట్లు తేలితే మాత్రం ఆ డబ్బును వెనక్కు అప్పగిస్తాం. ఎవరో మధ్యవర్తులకు డబ్బులు ఇచ్చి.. ఇలాంటి ఫిర్యాదు చేస్తే మాత్రం ఎలాంటి ఉపయోగం ఉండదు. – వెంకటేశ్వరరావు, ఉప రవాణా శాఖ కమిషనర్
Comments
Please login to add a commentAdd a comment