‘ఒంగోలు’ ఇడుపులపాయకెళ్లింది! | Ongole IIIT Students Suffering Travel To YSR Kadapa | Sakshi
Sakshi News home page

‘ఒంగోలు’ ఇడుపులపాయకెళ్లింది!

Published Wed, Jul 11 2018 11:32 AM | Last Updated on Wed, Jul 11 2018 11:32 AM

Ongole IIIT Students Suffering Travel To YSR Kadapa - Sakshi

సాక్షి, కడప :  పాలకుల నిర్లక్ష్యం...ప్రభుత్వ అలసత్వం..వెరసి విద్యార్థులకు ఇబ్బందులు తెచ్చి పెడుతున్నాయి. అత్యున్నత సాంకేతిక విద్య అందించేందుకు ట్రిపుల్‌ ఐటీని మంజూరు చేసే విషయంలో ఉన్న శ్రద్ధ వసతులు కల్పించడంలో లేదు. 2016లో టీడీపీ సర్కార్‌ కొత్తగా శ్రీకాకుళం, ఒంగోలు ట్రిపుల్‌ ఐటీల ఏర్పాటుకు పూనుకుంది. అనుకున్నదే తడువుగా తరగతులు ప్రారంభించేలా చర్యలు చేపట్టారు. అయితే సమస్యలు శాశ్వత పరిష్కారం దిశగా ఇప్పటివరకు అడుగులు పడకపోవడం గమనార్హం. ఇడుపులపాయలోనే రెండేళ్లు విద్యా సంవత్సరం దాటి మూడో ఏడాది అడ్మిషన్ల ప్రక్రియ నడుస్తున్నా ఇప్పటికీ ఒంగోలులో ప్రత్యేక బోధనకు బీజం పడలేదు.

ప్రస్తుతం వేంపల్లె సమీపంలోని ఇడుపులపాయలోనే రెండు ట్రిపుల్‌ ఐటీల విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. వైఎస్సార్‌ జిల్లాకు చెందిన ట్రిపుల్‌ ఐటీ విద్యార్థులు సొంత భవనాల్లో విద్యను అభ్యసిస్తుండగా.. ఒంగోలు ట్రిపుల్‌ ఐటీ వారు పాత క్యాంపస్‌ (రేకుల షెడ్లు)లో ఉంటున్నారు. అక్కడ విద్యాబోధనతోపాటు హాస్టల్‌ వసతులు కల్పించారు. దివంగత సీఎం వైఎస్సార్‌ హయాంలో ఇడుపులపాయలో ట్రిపుల్‌ ఐటీ నిర్మాణానికి గ్రీన్‌ సిగ్నల్‌ లభించింది.ఈ నేపథ్యంలో 2008లో తాత్కాలిక షెడ్లు వేసి ప్రారంభించారు. ప్రస్తుతం రెండేళ్ల ఇంటర్‌ విద్యను పూర్తి చేసుకుని ఇంజినీరింగ్‌లోకి అడుగు పెడుతున్న విద్యార్థులకు భవనాల్లో చదువు ఏర్పాట్లకు ఒంగోలు ట్రిపుల్‌ ఐటీ యాజమాన్యం చర్యలు చేపట్టింది. ప్రస్తుత సంవత్సరానికి సంబంధించి ఇంజినీరింగ్‌ విద్యార్థులను భవనాల్లో సర్దుబాటు చేయడం ద్వారా పాత క్యాంపస్‌లో రెండు వేల మందిని యథావిధిగా కొనసాగించేలా చర్యలు చేపడుతున్నారు.

కొలిక్కి రాని ఒంగోలు వ్యవహారం
ప్రస్తుతం ఎన్నికల హడావుడి ప్రారంభమవుతోంది.డిసెంబరులోనే ఎన్నికలు ఉంటాయని ప్రచారం జరుగుతోంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ ఒంగోలు ట్రిపుల్‌ ఐటీ శాశ్వత క్యాంపస్‌ ఏర్పాటు చేయలేదు. ప్రకాశం జిల్లాలో పలుచోట్ల భూముల అన్వేషణ ప్రారంభించింది. కనిగిరి నియోజకవర్గంలో దాదాపు 200కు పైగా ఎకరాల స్థలం సిద్ధంగా ఉన్నట్లు ప్రత్యేక బృందాలు గుర్తించాయి.  ఈ విషయం మంత్రివర్గంలో చర్చించి జీఓ విడుదల చేయాల్సి ఉంది.  ఇదంతా ఎప్పుడు కొలిక్కి వస్తుంది.. ఎప్పుడు ఆమోదముద్ర పడుతుందనేది అర్థం కావడం లేదు. ఎందుకంటే స్థలానికి సంబంధించి అన్ని అనుమతులు తీసుకోవాలంటేనే చాలా సమయం పడుతుంది. పైగా ఈ ఏడాది ఎన్నికల ఏడాదిగా భావిస్తున్న తరుణంలో యుద్ధ ప్రాతిపదికన పనులు జరగడం గగనమే. స్థల సేకరణకే దాదాపు రెండేళ్లుగా సమయం పడితే.. ఇక భవనాల నిర్మాణానికి ఎన్ని రోజులు వేచి చూడాల్సి వస్తుందోనని పలువురు విద్యార్థులు పేర్కొంటున్నారు. 

ఒంగోలు ట్రిపుల్‌ ఐటీలో 3 వేలమంది
జిల్లాలోని ఇడుపులపాయలో ఏర్పాటు చేసిన ఒంగోలు ట్రిపుల్‌ ఐటీలో విద్యార్థులు మూడు వేల సంఖ్యను దాటుతున్నారు. మొదటి సంవత్సరం వెయ్యి మందితోపాటు అదనంగా మరో 150 మంది..రెండో ఏడాది  మరో వెయ్యి కలుపుకుని 2150 మందికి పైగా ఉండగా, ప్రస్తుత సంవత్సరంలో కూడా వెయ్యి మందికి అడ్మిషన్లు ఇస్తున్నారు. ఈ నేప«థ్యంలో ఒంగోలు ట్రిపుల్‌ ఐటీ క్యాంపస్‌లో మూడు వేల మంది మార్కును దాటుతున్నారు. ప్రస్తుతం ట్రిపుల్‌ ఐటీలో అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతోంది.

విద్యార్థులకు తప్పని ఇబ్బందులు
ఒంగోలు ట్రిపుల్‌ ఐటీ విద్యార్థులకు  ఇబ్బందులు తప్పడంలేదు. మొదటి, రెండు సంవత్సరాల వారికి మొదట్లో చాలా రోజులు ల్యాప్‌టాప్‌ల సమస్య వేధించింది. దీంతో స్క్రీన్‌ మీదనే పాఠాలు బోధిస్తూ ల్యాప్‌ట్యాప్‌లు లేకుండా విద్యా సంవత్సరాన్ని కొనసాగించారు. రేకుల షెడ్లలో సమస్యలు వెంటాడుతున్నాయి. తాత్కాలికం మాటున వారు  అవస్థలు పడుతున్నారు. సొంత భవనాలు లేకపోవడంతో పాత క్యాంపస్‌లోనే ఉండాల్సి వస్తోంది. కోస్తాంధ్ర జిల్లాల్లోని ట్రిపుల్‌ ఐటీ విద్యార్థులకు నూజివీడు, ఒంగోలు క్యాంపస్‌లు అనువుగా ఉంటాయి. ఉత్తరాంధ్ర జిల్లాల వారికి శ్రీకాకుళం, రాయలసీమ ప్రాంత విద్యార్థులకు ఇడుపులపాయ సౌకర్యంగా ఉంటుంది. అయితే శ్రీకాకుళం, ఇడుపులపాయ మినహాయిస్తే ఒంగోలు విద్యార్థులకు అటు, ఇటు వెళ్లిరావాలన్నా కూడా కష్టతరమైన పరిస్థితులు నెలకొన్నాయి. దూర ప్రయాణాలు చేయలేక అవస్థలు పడాల్సి వస్తోంది.

సమస్యల్లేవు...భవనాల్లోకి మారుతున్నాం,ట్రిపుల్‌ ఐటీ ఇన్‌చార్జి డైరెక్టర్‌ నరసింహరాజు
ఒంగోలు ట్రిపుల్‌ ఐటీలో విద్యను అభ్యసించే మూడో సంవత్సరం విద్యార్థులకు భవనాల్లో వసతి కల్పించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ట్రిపుల్‌ ఐటీ ఇన్‌చార్జి డైరెక్టర్‌ నరసింహారాజు తెలిపారు. సమస్యల విషయమై ‘సాక్షి’ ప్రతినిధి డైరెక్టర్‌ను వివరణ కోరగా పై విధంగా స్పందించారు. భవనాలకు సంబంధించి పనులు పూర్తయ్యాయని వెల్లడించారు. ప్రస్తుతం ఒంగోలు ట్రిపుల్‌ ఐటీలో ఎలాంటి సమస్యలు లేవు. తాత్కాలిక క్యాంపస్‌లోనే ఒకటి, రెండు సంవత్సరాల విద్యార్థులకు వసతి ఉంటుందన్నారు. ఒంగోలు ట్రిపుల్‌ ఐటీకి సంబంధించి కనిగిరి వద్ద స్థల సేకరణ పూర్తయిందని, జీఓ రావడమే తరువాయి అని తెలిపారు. ప్రస్తుతానికి అడ్మిషన్లు ఇడుపులపాయలోనే చేసుకుంటున్నామని తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement