మాట్లాడుతున్న మనోజ్ సాయి తల్లి రమాదేవి మృతిచెందిన మనోజ్‌సాయి
ఒంగోలు(ప్రకాశం): తమ ఏకైక కుమారుడు పమిడి సాయిమనోజ్, మారిషస్ వాటర్‌ఫాల్‌లో పడి చనిపోయాడనే వాదన పూర్తిగా అవాస్తవమని, అక్కడి కాలేజీలో డ్రగ్స్ విక్రయాల గురించి తెలుసుకోవడం వల్లే మాఫియా విద్యార్థులతో కలిసి హత్యచేసిందని పమిడి సాయి మనోజ్ తల్లిదండ్రులు రమాదేవి, వెంకటస్వామిలు ఆరోపించారు. మంగళవారం స్థానిక సౌమ్య అపార్టుమెంట్‌లోని తమ నివాసంలో విలేకరులతో మాట్లాడారు. 2017 అక్టోబరులో తమ కుమారుడు మారిషస్‌లోని అన్నా మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ మొదటి సంవత్సరంలో జాయిన్ అయ్యాడన్నారు. ఆ తరువాత ఒకసారి ఇంటికి వచ్చాడని, ఈ సమయంలో కాలేజీలో డ్రగ్స్ విక్రయాలు జరుగుతున్నట్లు తమతో చెప్పాడన్నారు. తిరిగి జనవరిలో మారిషస్‌కు వెళ్లాడని, అయితే గత ఏప్రిల్ 15న అతన్ని 5గురు ఫ్రెండ్స్ బలవంతంగా కారులో ఎక్కించుకొని తీసుకువెళ్లారన్నారు.
ఇలా మూడు వారాల నుంచి బలవంతంగా తనను ప్రమాదకరమైన స్థలాల్లో పిక్నిక్‌కు తీసుకువచ్చినట్లు ఇండియాలోని స్నేహితులకు చాటింగ్ ద్వారా చెప్పాడని పేర్కొన్నారు. అదే రోజు సాయంత్రం 4గంటల నుంచి ఫోన్ స్విచ్చాఫ్ అయిందని, 16వ తేదీ ఉదయం 1.20 గంటలకు చెన్నైలో ఉన్న అన్నా మెడికల్ కాలేజీ ఆఫీసు నుంచి ఫోన్ వచ్చిందని చెప్పారు. తమ కుమారుడు వాటర్‌ఫాల్‌లో పడిపోయాడని, పరిస్థితి క్రిటికల్ అంటూ ఫోన్ చేశారన్నారు. మరికొద్దిసేపటికే తమ బాబు మరణించాడని అతని స్నేహితులు ఫోన్‌చేసి చెప్పారని, కానీ యాజమాన్యం మాత్రం తప్పుడు సమాచారం అంటూ కొట్టిపారేసిందని చెప్పారు. ఉదయం 11గంటలకు మరలా ఫోన్‌చేసి చనిపోయాడని చెప్పారన్నారు. 19వ తేదీకి ముందు తమకు ఎలాంటి సమాచారం లేదని, 19వ తేదీన ఎయిర్‌పోర్టులో కొన్ని కాగితాలు అందించారన్నారు. కొన్ని వారాల తరువాత వాటిని పరిశీలిస్తే డ్రగ్స్ ముఠా విద్యార్థులతో కలిసి తమ కుమారుడ్ని చంపి ప్రమాదవశాత్తు మృతిచెందినట్లు చిత్రీకరించినట్లుగా భావిస్తున్నామంటూ ఆరోపించారు.
అనుమానం ఇలా:
పిక్నిక్‌కు 40 మంది విద్యార్థులు బస్‌లో వెళితే కారులో 5గురు విద్యార్థులు తమ కుమారుడ్ని బలవంతంగా ఎలా తీసుకువెళ్లగలిగారనేదానితో తమకు అనుమానం మొదలైందన్నారు. వాటర్ ఫాల్‌లో నీరు కేవలం 3 నుంచి 4అడుగుల లోతు మాత్రమే ఉంటుందని, తమ కుమారుడు 5.10అడుగుల ఎత్తు ఉంటాడన్నారు. అంతమంది విద్యార్థులు, టూరిస్టులకు తెలియకుండా ఎప్పుడో ఎవరో గుర్తించి పైకి తీసేంత పరిస్థితి ముమ్మాటికీ అనుమానమేనని చెప్పారు. డెత్ రిపోర్టులో పల్మనరీ హేమరేజి అని చెబుతున్నారు. దీని ప్రకారం 24 గంటలు గడిచిన తరువాత మాత్రమే వ్యక్తి ఇటువంటి పరిస్థితికి లోనవుతాడని వైద్యులు చెబుతున్నారు. కానీ మా బాబు చనిపోయింది 6 గంటల్లోపే అని తెలిపారు. వాటర్‌ఫాల్‌లోనే మృతిచెందినట్లు రిపోర్టులు చెబుతుంటే కాలేజీ యాజమాన్యం మాత్రం.. ఆస్పత్రిలో మృతిచెందినట్లు చెబుతున్నారు.
ఇటీవల తాము చెన్నైలోని ఆఫీసులో మాట్లాడేందుకు యత్నిస్తే అపాయింట్‌మెంట్ ఇచ్చారని..,
తీరా అక్కడకు వెళితే మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు అంటూ దబాయించారన్నారు. తాము కాలేజీ వద్దే మీడియాతో సమావేశం అవుతామని చెప్పడంతో చెన్నై హైకోర్టు అడ్వకేట్ సమక్షంలో కాగితాలను త్వరలోనే పంపిస్తామంటూ ఒప్పందం చేసుకొన్నారని తెలిపారు. కానీ ఇంతవరకు మరణానికి సంబంధించి ఎఫ్‌ఐఆర్ కాపీ, పోస్టుమార్టం రిపోర్టు, ఫోరెన్సిక్ రిపోర్టు, హాస్పిటల్‌లో ట్రీట్‌మెంట్‌కు సంబంధించిన కాగితాలు ఏవీ ఇంతవరకు ఇవ్వకపోగా రెండు సంవత్సరాల తరువాత అయితే ఇస్తామని చెబుతున్నారన్నారు.
శశికళకు బినామీ అట..
ఇటీవల నెల్లూరు జిల్లా గూడూరు నుంచి ఇద్దరు వ్యక్తులు వచ్చి అన్నా మెడికల్ కాలేజీ యాజమాన్యం శశికళకు బినామీ అని, అందువల్ల కేసును క్లోజ్ చేసుకోవాలంటూ రెండు సార్లు సూచించడం మా అనుమానాన్ని మరింతగా బలపరిచిందన్నారు. తాము మెయిల్ ద్వారా కేసును క్లోజ్ చేయవద్దంటూ మారిషస్ పోలీసులకు సమాచారం పంపామన్నారు. దీనిపై కాలేజీ ఎండీ వైద్యలింగం తొలుత అడ్మిషన్ల సమయంలో యాజమాన్యం మొత్తం తామే అని చెప్పారని, కానీ ఇప్పుడు తాము కేవలం అడ్మిషన్స్ మాత్రమే చూస్తామని, అది మారిషస్ కాలేజీ అని చెప్పడం తల్లిదండ్రులను నమ్మించి మోసం చేయడంగానే భావిస్తున్నామన్నారు.
డిమాండ్ ఇదీ..
తమ కుమారుడి మృతికి సంబంధించిన ఎఫ్‌ఐఆర్ కాపీ, పోస్టుమార్టం రిపోర్టు, సాక్షుల వాంగ్మూలం, ఫోరెన్సిక్ రిపోర్టు, హాస్పిటల్‌లో బాబుకు అందించిన ట్రీట్‌మెంట్ సమాచారం తదితరాల వివరాల కాపీలు అందించాలని తాము కాలేజీ యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఎంబసీ ద్వారా కూడా జరిగిన అంశంపై పోరాటం చేస్తూ తమ కుమారుడికి జరిగిన అన్యాయం మరో విద్యార్థికి జరగకూడదని, నిజం నిగ్గుతేలాలంటూ ఎస్పీని కూడా కలిసి ఫిర్యాదు చేయనున్నట్లు మీడియా సమావేశంలో మనోజ్‌సాయి తల్లిదండ్రులు పమిడి రమాదేవి, వెంకటస్వామిలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment