నిద్దరోతున్న నిఘా
- ఉసురు తీస్తున్న ఉల్లిపాయ బాంబులు
- ఇష్టారాజ్యంగా బాణసంచా తయారీ
- నిద్రావస్థలో నిఘావ్యవస్థ
- మామూళ్ల మత్తులో జోగుతున్న స్థానిక అధికారులు
మచిలీపట్నం : జిల్లాలో వరుసగా జరుగుతున్న బాణసంచా పేలుళ్లు కలవరపెడుతున్నాయి. నిఘా వ్యవస్థ నిద్రావస్థలో ఉండటం, స్థానిక అధికారులు మామూళ్ల మత్తుతో జోగుతుండటం వల్లే ఈ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. దీపావళి పండగను పురస్కరించుకుని ఇబ్బడిముబ్బడిగా నివాస గృహాల్లో బాణసంచా తయారు చేస్తున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. శక్తివంతమైన పేలుడు పదార్థాలను విక్రయించే వ్యాపారులపైనా దృష్టి పెట్టకపోవడంతో పేలుడు పదార్ధాలు పెద్దఎత్తున దిగుమతి అవుతున్నాయి.
భారీగా శబ్దం వచ్చే ఉల్లిపాయ బాంబుల తయారీలో వాడే గంధకం, సూరేకారం, గన్ పౌడర్ విక్రయాలు గుట్టుచప్పుడు కాకుండా సాగిపోతున్నాయి. మచిలీపట్నం పరిసర ప్రాంతాల్లో ఇప్పటి వరకు ప్రమాదాలన్ని ఉల్లిపాయ బాంబులు తయారు చేస్తుండగా, వాటిని పేల్చే సమయంలోనే జరగటం గమనార్హం.
ఇళ్ల మధ్య తయారు చేస్తున్నా...
నివాస గృహాల మధ్య మందుగుండు సామగ్రి తయారీ చేయకూడదనే నిబంధనలు ఉన్నా పట్టించుకునే వారే కరువయ్యారు. దీపావళి పండగను పురస్కరించుకుని మచిలీపట్నంలో మందుగుండు సామగ్రి తయారీ కుటీర పరిశ్రమగా మారటం విశేషం. గతంలో మచిలీపట్నం మినర్వా టాకీసు వీధిలో మందుగుండు సామగ్రి అధికంగా తయారు చేసేవారు. ఆరేళ్ల క్రితం అక్కడ ప్రమాదం జరగటంతో నివాస గృహాల మధ్య మందుగుండు సామగ్రి తయారు చేయకూడదని షరతులు విధించిన రెవెన్యూ, పోలీస్, అగ్నిమాపకశాఖ అధికారులు వారం రోజులు హడావుడి చేసి అనంతరం మిన్నకుండిపోయారు.
పట్టణానికి శివారు ప్రాంతాల్లో మందుగుండు సామగ్రి తయారు చేస్తున్నా వాటిని భద్రపరచడం, తరలించటంలో సరైన జాగ్రత్తలు తీసుకోవడంలేదు. బైపాస్ రోడ్డులో పెద్ద ఎత్తున మందుగుండు సామగ్రి తయారు చేస్తూ పేలుడు సంభవించటంతో నిఘా వైఫల్యంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి నిబంధనలకు విరుద్ధంగా బాణసంచా సామగ్రి తయారు చేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
గత ఏడాది మచిలీపట్నం రుస్తుంబాదలోని ఓ గుడిసెలో ఉల్లి పాయబాంబులు తయారు చేస్తుండగా భారీ పేలుడు జరిగింది. ఈ ప్రమాదంలో విఠల్‌రావు అనే వృద్ధుడు మరణించారు. అతని కుమారుడు తీవ్రంగా గాయపడ్డారు.
ఈ ఏడాది ఆగస్టు 2వ తేదీన పెడన బస్టాండ్, రైల్వేస్టేషన్ల సమీపంలో పెద్దఎత్తున పేలుడు సంభవించింది. మహ్మద్ రఫీ(5)అనే బాలుడు మృతిచెందాడు. మహ్మద్ ఇద్రీస్ అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. ఉల్లిపాయబాంబులు పేలడం వల్లే ఈ దుర్ఘటన జరిగింది.
తాజాగా మంగళవారం మచిలీపట్నం బైపాస్‌రోడ్డులోని ఓ నివాస గృహంలో మందుగుండు సామగ్రి తయారు చేస్తుండగా భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో జోగి కిరణ్ (22) అనే ఎంబీఏ చదివే విద్యార్థి మరణించాడు. తీవ్రంగా గాయపడిన కిరణ్ సోదరుడు ప్రాణాపాయ పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. మరో నలుగురు గాయపడ్డారు.