రైతుబజార్‌లో 'ఉల్లి' జాతర
అనంతపురం : రైతులు, వినియోగదారుల తాకిడి లేక బోసిపోయి అలంకార ప్రాయంగా ఉన్న అనంతపురం జిల్లా స్థానిక రైతుబజార్ గురువారం పూర్వ వైభవం సంతరించుకున్నట్లుగా జనంతో కిటకిటలాడింది. బైకులు, బ్యాగులతో వందలు, వేల సంఖ్యలో వినియోగదారులు తరలిరావడంతో రైతుబజార్ రద్దీగా కనిపించింది. వందలమంది నెత్తిన బ్యాగు పెట్టుకుని గంటల కొద్దీ లైన్లలో నిలుచున్నారు. క్యూ లైన్లలో ఎక్కువసేపు నిలబడలేక ముందు, వెనుకనున్న వారికి చెప్పి వృద్ధులు, మహిళలు చెట్ల కింద కాసేపు సేదతీరడం కనిపించింది. ఇంతకీ ఈ శ్రమంతా దేనికనుకుంటున్నారు? రెండు కిలోల ఉల్లిగడ్డల కోసమే!
బహిరంగ మార్కెట్లో ఉల్లి ఘాటెక్కడంతో వినియోగదారులు కొనలేని పరిస్థితి నెలకొంది. దీంతో జిల్లా యంత్రాంగం రైతుబజార్‌లో బుధవారం ఉల్లి విక్రయ కేంద్రం ఏర్పాటు చేసింది. కిలో రూ.20 ప్రకారం ఒక్కొక్కరికి రెండు కిలోల చొప్పున పంపిణీ చేపట్టింది. దీంతో రెండు కిలోల ఉల్లి కోసం రెండు గంటలపాటు క్యూలో నిల్చుకుని తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. జనం రద్దీని దృష్టిలో పెట్టుకుని మరొక కౌంటర్ ఏర్పాటు చేసి ఉంటే బాగుండేదని పలువురు వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేశారు. కాగా ఒక్క రోజే 2,500 మందికి పైగా వినియోగదారులకు ఉల్లి పంపిణీ చేసినట్లు రైతు బజార్ ఎస్టేట్ ఆఫీసర్ ప్రతాప్ రుద్ర తెలిపారు.