
ఘాటెక్కిన ఉల్లి ధరలు
గుమ్మఘట్ట (అనంతపురం) : వంటింటి నిత్యవసర సరుకైన ఉల్లి ధర అమాంతం పెరిగిపోవడంతో జనం బెంబేలెత్తుతున్నారు. వారం రోజుల వ్యవధిలోనే కిలోకి రూ.10 పెరగడంతో ప్రస్తుతం మారెట్‌లో కిలో ఉల్లి ధర రూ. 35 నుంచి రూ.40 పలుకుతోంది. దీంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలకు ఉల్లి ధరల ఘాటు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. కిలో కొనాలనుకున్నవారు అరకిలోతోనే సరిపెట్టుకుంటున్నారు. జూన్ చివరిదాక రూ.16 పలికిన ఉల్లి ధర, జూలై మొదట్లో రూ. 20కి పెరిగింది. నెల ఆఖరిలోపు ఏకంగా మూడు సార్లు పెరగడంతో ప్రస్తుతం మార్కెట్‌లో ఎర్ర ఉల్లి కిలో రూ. 35 నుండి రూ. 40 , తెల్లగా ఉన్న ఉల్లి గడ్డలు రూ. 25 నుండి రూ. 30 వరకు ధరలు పలుకుతున్నాయి.
వర్షాభావ పరిస్థితుల కారణంగా ఉల్లి పంటలో ఆశించిన స్థాయిలో దిగుబడులు చేతికందక పోవడంతోనే ధరలు భగ్గుమంటున్నాయని వ్యాపార వర్గాలు భావిస్తున్నాయి. దీనికి తోడు ఇతర రాష్ట్రాల నుండి ఉల్లి దిగుమతులు కూడా పూర్తిగా తగ్గిపోవడంతో ఆశించిన స్థాయిలో మార్కెట్కు రవాణా కావడం లేదని ఉల్లి వ్యాపారులు చెపుతున్నారు. హోటళ్ల యజమానులు ఉల్లి కొనేందుకు ఆసక్తి చూపడం లేదు. ఇక దాబాల్లో కూడా ఉల్లికి బదులు ఎక్కువగా కీర దోసతోనే సరిపెడుతున్నారు. ఉల్లి లేని కూరలు తినడానికి పెద్దగా రుచి ఉండకపోవడంతో సామాన్యులు కొనలేక తిప్పలు పడుతున్నారు.