తాడేపల్లిగూడెం : ఉల్లిపాయల ఘాటు ఇప్పట్లో తగ్గనంటోంది. నాసిరకం ఉల్లిపాయలు కూడా కిలో రూ.25 పలుకుతున్నాయి. దీంతో జనం గగ్గోలు పెడుతున్నారు. ఆదివారం తాడేపల్లిగూడెం గుత్తమార్కెట్‌కు కర్నూలు నుంచి కురచ రకాలతో పాటు పాడైన ఉల్లిపాయలే ఎక్కుగా వచ్చాయి. నాణ్యత కలిగిన ఉల్లిపాయలు క్వింటాల్ 3,100 పలికితే బాగా పాడైన ఉల్లి క్వింటాల్ రూ.400 పలికాయి. కానీ అవి నిల్వకు ఆగవు. రిటైల్‌గా మార్కెట్‌లో కిలో రూ.25 నుంచి రూ.40 వరకు విక్రయించారు.
15 రోజుల్లో కర్నూలు ఉల్లి ఖాళీ
కర్నూలులో ఉల్లిపాయలు 15 రోజుల్లో ఖాళీ కాబోతున్నాయి. వాతావరణం ఈసారి కర్నూలు ఉల్లిపాయల సీజన్‌పై భారీగా ప్రభావం చూపించింది. దీంతో ఏనాడూ లేనంతగా రెండు నెలల 15 రోజుల ముందుగానే సీజన్ ముగిసే వాతావరణం కనపడుతోంది. వాస్తవానికి ఈ ఉల్లిపాయలు సంక్రాంతి వరకు మార్కెట్‌కు రావాలి. అలాంటిది రైతు కోలుకోలేనంతగా ఉల్లిపాయలు రైతులను దెబ్బతీశాయి. కర్నూలు ఉల్లిపాయలకు వాతావరణం శాపం. ఎండ ఎక్కువగా కాయకుండా, వానలు కురవకుండా ఉంటేనే ఉల్లిపాయలు తాజాగా, నాజూకుగా బయటకు వస్తాయి. ఉల్లిపాయలకు మంచి ధర లభించే సమయంలో ప్రకృతి రైతులపై పగబూనినట్టు ఎండలు, వానలు కలగలుపుగా ఉల్లి రైతులపై విరుచుకుపడ్డాయి. దీంతో రాష్ట్రంలో ఉల్లి అవసరాల కోసం మహారాష్ట్ర లేదా కర్ణాటక మీదో ఆధార మీదో ఆధారపడాల్సి వచ్చే పరిస్థితి నెలకొంది.
కాస్త తగ్గిన కూరగాయల ధరలు
కూరగాయల ధరలు వారం రోజుల కిత్రంతో పోలిస్తే కాస్త కనికరించాయి. తాడేపల్లిగూడెం గుత్త మార్కెట్‌లో తెల్లవంకాయలు, నల్ల వంకాయలు కిలో రూ.50 చేసి అమ్మారు. బీరకాయలు రూ.40కి లభించాయి. బెండకాయలు రూ.50, దోసకాయలు రూ.12, దొండకాయలు రూ.30, చిక్కుళ్లు రూ.70, ఆకాకర రూ.60, చేదు కాకర కాయలు రూ.30కి విక్రయించారు. బీన్స్, క్యాప్సికం కిలో రూ.70కి అమ్మారు. కీరా రూ.40, కంద రూ.30, క్యారెట్ రూ.70, బీటురూట్ రూ.60కి దొరికాయి. చామ రూ.40, కొత్తగా మార్కెట్‌కు వచ్చిన ఉసిరి కాయలు కిలో రూ.60కి అమ్మారు. ములగకాడలు ఒకటి పది రూపాయలు, మామిడి కాయలు జత రూ.25కి అమ్మారు. కొత్తిమీర ధరల సెగ ఇంకా తగ్గలేదు. కిలో రూ.150 రూపాయలకు గుత్తగా అమ్మగా విడిగా కట్ట ఒకటి రూ.50కి అమ్మారు.
Comments
Please login to add a commentAdd a comment