ఆలేరు: ఉల్లి కోస్తేనే కన్నీళ్లు వస్తాయి. కానీ నేడు కోయకుండానే ఉల్లి కన్నీళ్లు పెట్టిస్తుంది. ప్రతినిత్యం వంటకాల్లో వాడే ఉల్లి ధర రోజురోజుకు పెరుగుతుంది. దీంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. కేజీ ఉల్లి ధర రూ.45కు చేరడంతో సామాన్య ప్రజలు ఉల్లిని కొనలేని పరిస్థితి నెలకొంది. దీంతో వంటింట్లో ఉల్లిగడ్డను వెతకాల్సిన పరిస్థితి ఏర్పడింది. నిత్యవసర వస్తువుల ధరలు నింగినంటిన తరుణంలో ఉల్లి కన్నీళ్లు తెప్పిస్తుంది. ప్రస్తుతం డిమాండ్‌కు అనుగుణంగా మార్కెట్‌లో ఉల్లి లేకపోవడతో ధర రోజురోజుకు పెరుగుతుంది. రాష్ట్రంలో ఉల్లి దిగుబడి గణనీయంగా తగ్గడంతో పాటు అధికంగా దిగుమతయ్యే కర్ణాటక, మహరాష్ట్రలో సాగు విస్తీర్ణం తగ్గడంతో «కొరత ఏర్పడింది. ధర పెరగడంతో హోటళ్ల నిర్వాహకులు ఉల్లి వాడకాన్ని తగ్గించారు. మున్ముందు ఇదే పరిస్థితి కొనసాగితే ధర మరింత పెరిగే అవకాశముందని వ్యాపారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఉల్లి వాడకాన్ని తగ్గించాం
ఉల్లి ధర అమాంతం పెరగడంతో ఉల్లి కొనాలంటే భయమేస్తుంది. దీంతో ఉల్లి వాడకాన్ని తగ్గించాం. ప్రభుత్వం చౌక ధర దుకాణాల్లో వీటిని విక్రయించే ఏర్పాటు చేయాలి. ఉల్లిపాయల ధరలను అదుపుచేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం.
వసంత, ఆలేరు
ధర తగ్గించాలి
నిత్యవసర వస్తువుల పెరుగుదలతో సతమతమవుతున్నాం. ఇటీవల ఉల్లిగడ్డ ధర మునుపెన్నడు లేనంతగా పెరిగింది. ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుని ఉల్లి ధర తగ్గించాలి. ఉల్లి సాగు చేసేలా రైతులను ప్రోత్సాహించాలి.
జయమ్మ, ఆలేరు
Comments
Please login to add a commentAdd a comment