ఉల్లి.. ధర పేలి
తాడేపల్లిగూడెం : వంటింట్లో మరోసారి ఉల్లి బాంబు పేలుతోంది. డిమాండ్‌కు తగినట్టుగా సరఫరా లేకపోవడంతో శుక్రవారం ఒక్కసారిగా ధరలు పెరిగాయి. తాడేపల్లిగూడెం హోల్‌సేల్ మార్కెట్‌లో ఆదివారం క్వింటాల్ రూ.2,300 పలికిన ఉల్లి ధర శుక్రవారం అమాంతం రూ.3,300కు ఎగబాకింది. గుత్త మార్కెట్‌లోనే కిలోకు రూ.10 పెరగటంతో వ్యాపారులు ఠారెత్తిపోయారు. ఒకేసారి కిలోకు రూ.10 పెరగటం గడచిన పదేళ్లలో ఎప్పుడూ లేదు. రిటైల్ మార్కెట్‌లో నాణ్యత గల ఉల్లిపాయల ధర కిలో రూ.40 దాటింది. ఒక్కసారిగా ధర పెరగడంతో చిల్లర బేరం తగ్గిం ది. శుక్రవారం తాడేపల్లిగూడెం మార్కెట్‌కు మహారాష్ట్ర నుంచి రెండు లారీలు, కర్నూలు నుంచి 15 లారీల ఉల్లిపాయలు మాత్రమే వచ్చాయి.
సాధారణంగా ఈ సీజన్‌లో కర్నూలు నుంచి 200-300 లారీల ఉల్లిపాయలు వచ్చేవి. అనూహ్యంగా దిగుమతులు తగ్గిపోవడంతో ధరలు పెరిగాయి. రానున్న రోజుల్లో ధరలు మరింతగా పెరిగే సూచనలు ఉన్నా యని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. దేశంలో ఉల్లి అవసరాలను తీర్చే మహా రాష్ట్ర మార్కెట్ నుంచి సరఫరా తగ్గిపోయింది. వాతావరణం అనుకూలించకపోవడంతో అక్కడి ఉల్లి పంటకు వైరస్ సోకింది. మరోవైపు రైతులు గోదాములలో నిల్వ చేసిన ఉల్లిని మార్కెట్లకు తీసుకురావడం లేదు. నాఫెడ్‌తో ఒప్పం దం చేసుకున్న కొన్ని కంపెనీలు ఉల్లిని విదేశాలకు ఎగుమతి చేస్తున్నాయి. ఈ పరిణామాల నడుమ గతంలో ఎన్నడూ లేనివిధంగా జూలై నెలలో ఉల్లి ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి.
నాసిరకం ఉల్లికి డిమాండ్
కర్నూలు నుంచి వచ్చే ఉల్లిపాయలకు డిమాండ్ ఒక్కసారిగా పెరిగింది. కర్నూలు ఉల్లి సాధారణంగా క్వింటాల్ రూ.1,700 నుంచి రూ.2 వేల వరకు మాత్రమే ఉంటుంది. ప్రస్తుతం వీటిధర క్వింటాల్ రూ.2,700కు చేరుకుంది.