మెదక్ రూరల్, న్యూస్‌లైన్:
మళ్లీ ఉల్లి ధరలకు రెక్కలొచ్చాయి. నిన్నమొన్నటి వరకు మార్కెట్‌లో కిలో ఉల్లి ధర రూ. 45 నుంచి 50 విక్రయించగా మూడు రోజుల నుంచి పాత గడ్డ కిలో రూ. 60, కొత్త గడ్డ కిలో రూ. 50 చొప్పున విక్రయిస్తున్నారు. ఉల్లి ధరలు మాటి మాటికీ పెరగటంతో కొనుగోలు దారులు ఆందోళన చెందుతున్నారు. ఉల్లి ధరల నుంచి ప్రజలను ఆదుకునేందుకు పట్టణంలో ఏర్పాటు చేసిన విక్రయ కేంద్రాన్ని పట్టుమని వారం రోజులు కాకుండానే అధికారులు మూసివేశారు. సీమాంధ్రలో జరుగుతున్న సమైక్య ఉద్యమం ఉల్లి ధర విపరీతంగా పెరగడానికి కారణమవుతోంది. మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి మున్సిపాలిటీల్లో కలెక్టర్ ఆదేశాల మేరకు ఉల్లి విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మెదక్ మార్కెట్ యార్డులో గత నెల ఆగస్టు 27న జేసీ శరత్ ఉల్లి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. కిలో రూ. 34కు విక్రయించాలని ఆదేశించారు.
కొనుగోలు కేంద్రాన్ని ప్రజలకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జేసీ ఆదేశాలను అమలు చేయాల్సిన అధికారులు ఆది శగా చర్యలు తీసుకోలేదు. వారం రోజుల పాటు కూడా నడపకుండానే కొనుగోలు కేంద్రాన్ని మూసివేశారు. మెదక్ వాసుల కోసం వచ్చిన ఉల్లి నిల్వలను సిద్దిపేటకు తరలించి ఇక తమ పనైపోయిందని అధికారులు చేతులు దులుపుకుంటున్నారు. మెదక్‌లో ఉల్లి విక్రయ కేంద్రం ఏర్పాటు చేయనప్పుడు స్థానిక కూరగాయల మార్కెట్లో కిలో ఉల్లి ధర రూ. 70 నుంచి 80 పలికింది. కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేశాక కిలో రూ. 40 నుం చి రూ. 50కి దిగొచ్చింది. విక్రయ కేంద్రాన్ని మూసివేయగానే మళ్లీ ధరలు పెరిగాయి. కిలో రూ. 50 నుంచి రూ. 55కు చేరింది. మూడు రోజుల నుంచి పాత ఉల్లి గడ్డను కిలో రూ. 60, కొత్త గడ్డను రూ. 50 విక్రయిస్తున్నారు. జిల్లాలో మూడు విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేయగా సిద్దిపేట, సంగారెడ్డిలో అక్కడి అధికారులు సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. మెదక్‌లో మాత్రం ఉల్లి విక్రయ కేంద్రాన్ని మూసివేయడంతో ఇక్కడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అయితే ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకొని ఉల్లి ధరను అమాం తంగా పెంచి జేబులు నింపుకుంటున్నారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు మెదక్‌లో ఉల్లి విక్రయ యథావిధిగా కొనసాగించాలని స్థానికులు కోరుతున్నారు.
సీమాంధ్ర ఉద్యమాలతోనే ఉల్లికి రెక్కలు
సీమాంధ్రలో 46 రోజులుగా సమ్మె జరుగుతుండడం తో ఉల్లి దిగుమతులు పూర్తిగా తగ్గి పోయి డిమాండ్ పెరిగిందని వ్యాపారులు అంటున్నారు. గుంటూరు జిల్లాలో ఉల్లి సాగు అధికమని సమైక్య ఉద్యమం వల్ల ఇబ్బందులు తలెత్తాయని తెలిపారు. ఉద్యమం ఆగి.. గతంలో లాగా ఉల్లి దిగుమతి అయితే ధరలు తగ్గే అవకాశం ఉందని వారు తెలిపారు. లేకుంటే మరింత ప్రియం అయినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని వ్యాపారులు తెలిపారు.
మళ్లీ పెరిగిన ఉల్లిధర
Published Sun, Sep 15 2013 12:18 AM | Last Updated on Fri, Sep 1 2017 10:43 PM
Advertisement
Advertisement