
ఆన్‌లైన్‌లో ఓటరు నమోదు పోర్టల్
గుంటూరు, తుళ్లూరు: ఓటు హక్కు.. ప్రజా స్వామ్యాన్ని కాపాడే వజ్రాయుధం. ప్రజాస్వామ్య దేశంలో ఓటు హక్కుకు ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ విధిగా ఓటర్లుగా నమోదు కావాలి. త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న క్రమంలో ఎన్నికల కమిషన్ సెప్టెంబరు 1 నుంచి ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని చేపడుతోంది. ఓటరుగా నమోదు కావడానికి, అభ్యంతరాలకు, సవరణలకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఓటర్ల తుది జాబితాను 2019 జనవరి 4న ప్రకటిస్తారు. ఈ జాబితానే త్వరలో జరిగే ఎన్నికలకు ప్రామాణికం కానుంది. దీంతో జిల్లా యంత్రాంగం ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమంపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది.
ఎలా దరఖాస్తు చేసుకోవాలి
2019 జనవరి 1వ తేదీ నాటికి 18 ఏళ్లు నిండే వారందరూ ఓటర్లుగా నమోదు కావచ్చు. ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారి(ఈఆర్వో), తహసీల్దార్, బీఎల్‌వోల దగ్గర అన్ని రకాల దరఖాస్తులు లభిస్తాయి. ఓటరుగా నమోదు కావాలంటే ఫారం–6 దరఖాస్తును నింపి ఫొటో, వయస్సు, చిరునామా ధ్రువపత్రాలు(రేషన్ కార్డు, ఆధార్ కార్డు) జత చేయాల్సి ఉంటుంది. దరఖాస్తులను తహసీల్దారు కార్యాలయంలోను, బీఎల్‌ఓకు అందజేయాలి. అక్టోబరు 31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. సహాయం కోసం టోల్‌ఫ్రీ నంబరు 1950ను కూడా అందుబాటులో ఉంచారు.
ఆన్‌లైన్‌లో ఇలా..
ఓటరు నమోదుతో పాటు అభ్యంతరాలకు, సవరణలకు ఆన్‌లైన్ ద్వారా కూడా దరఖాస్తులను సంబంధిత ఈఆర్వో, ఏఈఆర్‌ఓలకు పంపవచ్చు. నేషనల్ ఓటర్స్ సర్వీస్ పోర్టల్(ఎన్‌వీఎస్‌పీ) సందర్శించాలి. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ కింద క్లిక్ హియర్ అని ఉంటుంది. దానిపై క్లిక్ చేస్తే కావాల్సిన దరఖాస్తు ఓపెన్ అవుతుంది. వివరాలు పూర్తి చేసి దరఖాస్తుతో కూడా స్కాన్ చేసి అప్‌లోడ్ చేయాలి. అభ్యంతరాలకు, వివరాల సవరణల కోసం, ఒకే నియోజకవర్గంలోనే ఒక పోలింగ్ కేంద్రం నుంచి మరో పోలింగ్ కేంద్రానికి చిరునామా మార్పు కోసం, సంబంధిత ఫారంను క్లిక్ చేసి వివరాలు నింపి తగిన ధ్రువ పత్రాలతో అప్‌లోడ్ చేయాలి.
ఏ ఫారం.. ఎందుకు
⇒ ఫారం–6: కొత్తగా ఓటర్లు నమోదు
⇒ ఫారం–6ఏ: విదేశాల్లో ఉన్న భారతీయులు తమ నియోజకవర్గంలో ఓటరుగా నమోదు
⇒ ఫారం–7: ఓటర్ల జాబితాలోని పేర్లపై అభ్యంతరాలు, తొలగింపు
⇒ ఫారం–8: ఇంటి పేరు, ఓటరు పేరు, పుట్టిన తేదీల్లో తప్పులు ఉంటే సవరణ
⇒ ఫారం–8ఏ: ఒకే శాసనసభ నియోజకవర్గం పరిధిలో చిరునామా మార్పు, బదిలీ
అర్హులందరూఓటు హక్కును పొందాలి
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కుకు విశిష్ట ప్రాధాన్యత ఉంది. ఓటు హక్కుతో మంచి పాలకులను, మంచి ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకోవచ్చు. జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండి వారందరూ ఓటర్లుగా నమోదు కావాలి. 18 ఏళ్లపైబడి ఉండి ఓటరుగా నమోదు కాని వారు కూడా సెప్టెంబర్ ఒకటి నుంచి అక్టోబరు 31 వరకు ఓటు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.–మండెపూడి పూర్ణ చంద్రరావు,తహసీల్దార్, తుళ్లూరు
Comments
Please login to add a commentAdd a comment