ఇంటి వద్దకే వచ్చి బిల్లులు కట్టించుకునే విధానం
ఆల్‌లైన్ బిల్లింగ్ పద్ధతికి గాజువాకలో శ్రీకారం
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ విద్యుత్ సంస్థ (ఏపీఈపీడీసీఎల్)లో కొత్త సేవలు ప్రవేశిస్తున్నాయి. వినియోగదారుల కోసమే కాకుండా సంస్థ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని అధికారులు పలు నిర్ణయాలు తీసుకుంటున్నారు. విద్యుత్ బిల్లులు చెల్లించాలంటే ఈ-సేవా కార్యాలయాల చుట్టూ పనులు మానుకొని తిరగాల్సిన అవసరం లేకుండా ఇంటి వద్దకే వచ్చి మన బిల్లు కట్టించుకొనే సదుపాయాన్ని అందిస్తున్నారు. ‘అప్నా’ పేరుతో కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. ‘అప్నా’ కన్జూమర్స్ సర్వీస్ సెంటర్లను ప్రవేశపెట్టాలని కేంద్రం నిర్దేశించింది. దీంతో డిస్కం పరిధిలోని ఐదు జిల్లాల్లో ముఖ్యంగా నగరాలు, పట్టణాల్లో ఈ సేవలు ప్రారంభించారు. మొత్తం 1792 అప్నా సెంటర్లను ఏర్పాటు చేయగా వాటిలో 312 సెంటర్లు విశాఖలోనే పెట్టారు. వాటి ద్వారా ఇప్పటి వరకు విశాఖలో 2400 సర్వీసుల నుంచి రూ.7,62,187 వసూలు చేశారు. ప్రస్తుతానికి ప్రాధమిక దశలో ఉన్న ఈ సేవలు క్రమంగా విస్తరించనున్నారు.
గాజువాకలో ఆన్‌లైన్ బిల్లింగ్: స్పాట్ బిల్లింగ్ రీడర్లు విద్యుత్ బిల్లు తీసిన తర్వాత సమాచారాన్ని ఈఆర్‌ఓ కార్యాలయానికి వెళ్లి అప్‌లోడ్ చేయడం ఇప్పటి వరకూ జరుగుతోంది. అయితే దీనివల్ల సమాచారం ఆలస్యంగా చేరుతోంది. ఇక మీదట ఆ సమస్య రాకుండా ఆన్‌లైన్ విద్యుత్ బిల్లింగ్ విధానాన్ని తీసుకువస్తున్నారు. తొలుత విశాఖ అర్బన్ పరిధిలోని గాజువాక ప్రాంతంలో ప్రయోగాత్మకంగా దానిని అమలు చేయనున్నారు. బిల్లు జనరేట్ కాగానే వినియోగదారుడి మొబైల్‌కు సంక్షిప్త సమాచారం వస్తుంది. వెంటనే ఆన్‌లైన్‌లో బిల్లు వివరాలు అప్‌లోడ్ అవుతాయి.
రూఫ్‌టాప్ సోలార్ సిస్టం: ఇంటిగ్రేటెడ్ పవర్ డెవలప్‌మెంట్ స్కీమ్ ద్వారా ఏపీఈపీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయం, జిల్లా కలెక్టరేట్‌లపై సోలార్ రూఫ్ టాప్ సిస్టంను ఏర్పాటు చేయనున్నారు. దీనికోసం రూ.21 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఇవి పూర్తయిన అనంతరం అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సోలార్ రూఫ్‌టాప్‌ను రూ.300 కోట్లతో పెటేందుకు అనుమతులు మంజూరయ్యాయి.
బీఎన్‌ఆర్ కాలనీకి త్వరలో విద్యుత్ వెలుగులు
నగరంలోని బీఎన్‌ఆర్ కాలనీలో 400 ఇళ్లకు నేటికీ విద్యుత్ సరఫరా లేక చీకటిలోనే బతుకుతున్నామని, తమకు వెలుగులు ప్రసాదించమని ఇటీవల ఆ ప్రాంత వాసులు సీఎండీని కోరారు. అర్బన్ డెవలప్‌మెంట్ స్కీం ద్వారా నిధులు సమీకరించి త్వరలోనే వాటన్నిటికీ విద్యుత్ సర్వీసులు ఇవ్వాలని ఏపీఈపీడీసీఎల్ నిర్ణయించింది.
ఇప్పటికే నెంబర్ 1
రాష్ట్రంలోనే ఏపీఈపీడీసీఎల్ నెం.1 డిస్కంగా పేరు సంపాదించింది. అయినప్పటికీ లైన్ లాస్, ఈ-పేమెంట్ అంశాల్లో మెరుగుపడాల్సి ఉంది. లైన్‌లాస్‌ను 5 శాతం కంటే తక్కువకు తీసుకురావాలనేది లక్ష్యం. ఎల్‌ఈడీ బల్బుల పంపిణీ 93.4 శాతం పూర్తయ్యింది. వాటి పనితీరుపై ఏయూ ఆధ్వర్యంలో అధ్యయనం జరుగుతోంది. సగటున నెలకు 7 యూనిట్లు ఆదా అవుతున్నట్లు ప్రాధమికంగా తేలింది. గత జనవరి నుంచి 1.3 లక్షల కొత్త విద్యుత్ సర్వీసులు ఇచ్చాం. నగరంలోని బీఎన్‌ఆర్ కాలనీకి విద్యుత్ ఇవ్వడానికి సుమారు రూ.21 కోట్లు ఖర్చవుతుండగా ప్రజలు తమ వాటాగా మీటర్ల కోసం రూ.4 లేదా 5 లక్షలు చెల్లిస్తే సరిపోతుంది.
- ఆర్ ముత్యాలరాజు, సీఎండీ, ఏపీఈపీడీసీఎల్.
విద్యుత్ శాఖలో ‘అప్నా’ సేవలు
Published Thu, Mar 17 2016 11:41 PM | Last Updated on Wed, Sep 5 2018 2:07 PM
Advertisement