కర్నూలు : రాష్ట్రంలోని అన్ని మార్కెట్లలో మరో ఏడాదిలోపు ఆన్‌లైన్ ట్రేడింగ్ సదుపాయం కల్పిస్తున్నట్లు రాష్ట్ర మార్కెటింగ్ శాఖ డెరైక్టర్ ఇస్రాద్ అహ్మద్ తెలిపారు. శుక్రవారం ఉదయం ఆయన 10.30 గంటల నుంచి 11.30 గంటల వరకు కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో మార్కెటింగ్ శాఖ, పౌరసరఫరాల సంస్థ సంయుక్తంగా చేపట్టిన ఉల్లి కొనుగోళ్లను పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి వివిధ జిల్లాల్లోని 11 వ్యవసాయ మార్కెట్ కమిటీలలో ఆన్‌లైన్ ట్రేడింగ్‌ను అమలు చేస్తామన్నారు. కర్నూలు, ఎమ్మిగనూరు, ఆదోని, హిందూపురం, కళ్యాణదుర్గం, కడప, గుంటూరు దుగ్గిరాళ్ల, ఏలూరు, అనకాపల్లి, గూడూరు, మార్కెట్‌లలో ఆన్‌లైన్ ట్రేడింగ్‌కు అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు వివరించారు.
దశలవారీగా ఏడాదిలోపు రాష్ట్రంలోని అన్ని మార్కెట్‌లను ఆన్‌లైన్ ట్రేడింగ్ పరిధిలోకి తీసుకొస్తామన్నారు. ట్రేడర్స్ లెసైన్స్ విధానంలోనూ సమూల మార్పులు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర స్థాయిలోనే ట్రేడింగ్ లైసన్స్‌లు ఇస్తారని, దీని ద్వారా దేశంలో ఎక్కడి నుంచైనా ఆన్‌లైన్ ద్వారా రాష్ట్రంలోని ఏ మార్కెట్‌లోనైనా వ్యవసాయ ఉత్పత్తులు కొనుగోలు చేయవచ్చన్నారు. 2015-16లో మార్కెటింగ్ శాఖ ఒక శాతం ఫీజు ద్వారా రూ.500 కోట్లు ఆదాయం సాధించాలని లక్ష్యంగా ఎంచుకుందన్నారు. సబ్సిడీ ఉల్లిని రూ.20ల ప్రకారం పంపిణీ చేయడానికి కర్నూలు మార్కెట్‌లో తగిన మేర ఉల్లి లభించకపోతే కర్ణాటకలో కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తున్నామన్నారు.
ఏడాదిలోపు ఆన్‌లైన్ ట్రేడింగ్ సదుపాయం
Published Fri, Aug 21 2015 7:22 PM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement