దూసుకొస్తున్న బీఎస్‌-6 | Only BS 6 Vehicles Will Be Registered From April One | Sakshi
Sakshi News home page

దూసుకొస్తున్న బీఎస్‌-6

Published Sat, Feb 29 2020 8:21 AM | Last Updated on Sat, Feb 29 2020 8:35 AM

Only BS 6 Vehicles Will Be Registered From April One - Sakshi

విజయనగరం: వాహన కాలుష్యాన్ని నియంత్రించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి బీఎస్‌–6 వాహనాలను మాత్రమే రిజిస్ట్రేషన్‌ చేయాలని నిర్ణయించింది. మిగతా వాహనాలకు ఆ అవకాశం ఉండదు. వాహన కాలుష్యాన్ని నియంత్రించే ఉద్దేశంతో సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే బీఎస్‌–6 వాహనాలు రోడ్లపైకి వస్తున్నాయి. ఆయా కంపెనీలు కూడా ఈ స్థాయి వాహనాలను మాత్రమే తయారు చేస్తున్నాయి.        

మార్చి 31 తరువాత బీఎస్‌–3, బీఎస్‌–4 వాహనాల రిజిస్ట్రేషన్లను సైతం నిలిపి వేయనున్నారు. ఇలాంటి వాహనాలు కొనుగోలు చేసినవారు, ఇంకా శాశ్వత రిజిస్ట్రేషన్లు చేయించని వారు.. ఆ గడువులోగా చేయించుకోవాలని రవాణాశాఖ అధికారులు చెబుతున్నారు. లేనిపక్షంలో ఎప్పటికీ అవి రిజిస్ట్రేషన్‌ అయ్యే అవకాశం ఉండదని స్పష్టం చేస్తున్నారు. ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి బీఎస్‌–6 వాహనాలను మాత్రమే రిజిస్ట్రేషన్‌ చేస్తారు. ఈ విషయమై ఇప్పటికే రవాణాశా ఖాధికారులు వాహనదారులు, వాహన విక్రయ షోరూమ్‌ల వారికి అవగాహన కల్పిస్తున్నారు. ​​(ఆర్టీసీకి ‘బీఎస్‌–6’ గండం)

విక్రయాలకు సిద్ధంగా బీఎస్‌–4 వాహనాలు 
ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి బీఎస్‌–4 మోడల్‌ మోటారు వాహనాలకు రిజిస్ట్రేషన్లు నిలిచిపోనున్నాయి. ఈలోగా వాటిని కొనుగోలు చేసిన చోదకులు మార్చి 31లోగా శాశ్వత రిజి్రస్టేషన్లు చేయించుకోవాలి. లేకుంటే ఆ వాహనాలకు ఇబ్బందులు తప్పవని రవాణాశాఖ అధికారులు చెబుతున్నారు. వాహన డీలర్లు సైతం నిర్ణీత తేదీలోగా తమ షోరూంలో ఉన్న ఆ మోడల్‌ వాహనాలను విక్రయించడంతో పాటు, వాటికి రిజిస్ట్రేషన్‌ పూర్తి చేయాలని అధికారులు ఆదేశించారు. కాలుష్య నియంత్రణ నిబంధనల్లో భాగంగా సుప్రీంకోర్టు ఏప్రిల్‌ ఒకటి నుంచి బీఎస్‌–6 వాహనాలను మాత్రమే విక్రయించాలని ఆదేశించింది. వాటికి మాత్రమే రిజిస్ట్రేషన్‌ చేయాలని ఇప్పటికే రవాణా శాఖకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆదేశాల అమలుకు రవాణా శాఖ అధికారులు చర్యలు ప్రారంభించారు. 

ఫ్యాన్సీ నంబర్ల కోసం జాప్యం  
బీఎస్‌–4 వాహనాలను కొనుగోలు చేసిన వారు పలు కారణాల వల్ల రిజిస్ట్రేషన్లు చేయించుకోలేదు. కావాల్సిన నంబర్‌ కోసమని, రెండో వాహనం ఉంటే ట్యాక్సు ఎక్కువ పడుతుందని, వాహనం వేరే పేరుమీద బదిలీ కాలేదని.. ఇలా పలు అంశాల వల్ల శాశ్వత రిజిస్ట్రేషన్‌ చేయించుకోకుండా తాత్కాలిక రిజిస్ట్రేషన్‌తో తిరుగుతున్నారు. నంబర్‌ వచ్చినప్పుడు, పన్నులు కట్టినప్పుడు శాశ్వత రిజిస్ట్రేషన్లు చేసుకుంటామని చెప్పి చాలా మంది చోదకులు డీలర్ల నుంచి వాహనాలు కొనుగోలు చేసి తీసుకెళ్తున్నారు. ఇలాంటి సమస్యలున్న వారు దాదాపు జిల్లాలో సుమారు 3వేల మంది వరకు ఉన్నారు. వీరంతా మార్చి 31లోగా శాశ్వత రిజి్రస్టే షన్లు చేసుకోవలసి ఉంది. 

ఏమిటీ బీఎస్‌–6?
భారత్‌ స్టాండర్డ్‌కు సంక్షిప్త రూపమే బీఎస్‌. వాహనం నుంచి వెలువడే వాయు ఉద్గారాలను బట్టి ఈ స్థాయిని నిర్ణయిస్తారు. 2005లో మార్కెట్‌లోకి వచ్చిన బీఎస్‌–3 వాహనాలు 2010 నాటికి బాగా విస్తరించాయి. 2017లో బీఎస్‌–4 వాహనాలు వచ్చాయి. వాహన కాలుష్యం తగ్గించే దిశగా ప్రస్తుతం బీఎస్‌–6 వాహనాలు తెస్తున్నారు. 

బీఎస్‌–6  వాహనాలకు మాత్రమే రిజిస్ట్రేషన్‌
విజయనగరం ఫోర్ట్‌: ఏప్రిల్‌ 1 నుంచి బీఎస్‌–6 వాహనాలకు మాత్రమే రిజిస్ట్రేషన్‌ జరుగుతుందని వెహికల్‌ ఇనస్పెక్టర్‌ బుచ్చిరాజు చెప్పారు. రవాణా శాఖ కార్యాలయంలో షోరూం డీలర్లతో బుధవారం ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బీఎస్‌–4 వాహనాల రిజి్రస్టేషన్‌ మార్చి 31వ తేదీ వరకు మాత్రమే జరుగుతుందన్నారు. మార్చి 31 తర్వాత ఎట్టి పరిస్థితుల్లోను బీఎస్‌–4 వాహనాలకు రిజిస్ట్రేషన్‌ చేయమన్నారు. మార్చి 31 లోగా వాహనాల అన్ని విక్రయించుకుని రిజి్రస్టేషన్‌ చేయించుకోవాలన్నారు. ఫ్యాన్సీ నంబర్‌ కోసం నిరీక్షిస్తున్నాం కాబట్టి మాకు రిజిస్ట్రేషన్‌ చేయండని మార్చి 31 తర్వాత వచ్చినా రిజి్రస్టేషన్‌ చేయమన్నారు. ఈవిషయాన్ని డీలర్లు, వాహనాల కొనుగోలుదారులు గమనించాలన్నారు.

బీఎస్‌–6 వాహనాల విక్రయం
పలు షోరూముల్లో ఇప్పటికే బీఎస్‌–6 వాహనాల విక్రయాలు ప్రారంభమయ్యాయి. వేగం, సామర్థ్యం పరంగా ఇవి మెరుగ్గా ఉండి, కాలుష్యాన్ని తగ్గిస్తాయి. తయారీదారులు సరికొత్త ఫీచర్లు, భద్రత ప్రమాణాలతో ఈ వాహనాలను మార్కెట్‌లోకి తెస్తున్నారు. వీటిలో మైలేజీ పరంగా 15 శాతం అధికంగా ఉన్నా, ట్యాంకులో కనీసం 2 నుంచి 3 లీటర్ల పెట్రోలు నిరంతరం నిల్వ ఉంచుకోవలసి ఉంటుంది. లేదంటే వాహనం నడవదని వాహన రంగ నిపుణులు చెబుతున్నారు. బీఎస్‌–4 వాహనాలైతే కనీస పరిమాణంలో ఇంధనం ఉన్నప్పటికీ వెళ్లిపోయే పరిస్థితి ఉండేది. బీఎస్‌–6 వాహనాల్లో అది లేదు.

రాయితీలు ప్రకటిస్తున్న షోరూంలు 
జిల్లాలో ద్విచక్ర, నాలుగు చక్రాల వాహనాలకు సంబంధించి సుమారు 40 షోరూమ్‌లు ఉన్నాయి. వీటిలో సుమారు బీఎస్‌–4కి సంబంధించి ద్విచక్ర వాహనాలు 7వేల వరకు, నాలుగు చక్రాల వాహనాలు 2వేల వరకు నిల్వ ఉన్నాయి. వీటిని మార్చి 31లోగా విక్రయించి, శాశ్వత రిజిస్ట్రేషన్‌ చేయాల్సి ఉంది. ప్రస్తుతం వాహన విక్రయాల మార్కెట్‌ చాలా నెమ్మదిగా ఉంది. దీంతో అప్పట్లోగా పూర్తి స్థాయిలో విక్రయాలు జరుగుతాయో లేవోనని పలువురు వాహన డీలర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎలాగైనా విక్రయించాలనే ఉద్దేశంతో కొన్ని షోరూంలలో  ధరలను తగ్గించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ద్విచక్ర వాహనాలపై రూ.5 వేలు, నాలుగు చక్రాల వాహనాలపై రూ.10 వేల వరకు తగ్గించి విక్రయించేందుకు నిర్ణయించుకున్నారు. మరికొన్ని షోరూముల్లో ఇప్పటికే బీఎస్‌–6 మోడల్‌ వాహనాలు రావడంతో, వాటినే విక్రయించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. 

రిజిస్ట్రేషన్లు  తప్పనిసరి 
బీఎస్‌–4 వాహనాలను ఈ ఏడాది మార్చి 31లోగా  చేయించుకోవాలి. ఆ తరువాత వీటిని రిజిస్ట్రేషన్‌ కుదరదు. దీనికి సంబంధించిన సైట్‌ లాక్‌ అవుతోంది. ఈ విషయాన్ని అందరూ గమనించాలి. తాత్కాలిక రిజిస్ట్రేషన్  చేయించినా ఉపయోగం ఉండదు. శాశ్వత రిజిస్ట్రేషన్‌ ఉండాల్సిందే. ఆ తరువాత ఆయా వాహనాలు రహదారులపై తిరిగితే సీజ్‌ చేస్తాం. – రామ్‌కుమార్, 
ఇన్‌చార్జి ఆర్టీఓ, విజయనగరం.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement