అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాల పోస్టుల భర్తీకి రాజకీయ గ్రహణం పట్టింది. నెలలు గడుస్తున్నా పోస్టులు భర్తీ చేయడం లేదు. తమ అనుయాయులకే దక్కాలన్న లక్ష్యంతో పోస్టుల భర్తీకి ప్రజాప్రతినిధులు అడ్డుపడుతున్నారు. ఇంటర్వ్యూలు జరగకుండా అధికారులపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు. దీంతో చేసేదేమీలేక అధికార యంత్రాంగం కాలం గడుపుతోంది. వెరసి అభ్యర్థులు తీవ్ర నిరాశలో కూరుకుపోయారు.
సాక్షి, నల్లగొండ: జిల్లాలో 18 ప్రాజెక్టుల పరిధిలో 99 అంగన్‌వాడీ కార్యకర్తలు, 90 మినీ అంగన్‌వాడీ కార్యకర్తలు, 135 ఆయాల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ మొత్తం 324 పోస్టుల భర్తీకి ఆరు నెలల క్రితం జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ నోటిఫికేషన్ వేసింది. వేల సంఖ్యలో దరఖాస్తులు అందాయి. మెరిట్, ఇంటర్వ్యూ ఆధారంగా వీటిని భర్తీ చేయాల్సి ఉంది. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల మెరిట్ జాబితాను అధికారులు రూపొందించారు. వీరందరినీ ఇంటర్వ్యూ చేసి మెరిట్ పొందిన వారికి పోస్టింగ్ ఇవ్వాల్సి ఉంది. అయితే ఈ ప్రక్రియ ముందుకు సాగకుండా ప్రజాప్రతినిధులు మోకాలడ్డుతున్నారు. తమ వారికే పోస్టులు రావాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.
50 పోస్టులే భర్తీ...
ఇంటర్వ్యూ బోర్డుకు చైర్మన్‌గా కలెక్టర్, కన్వీనర్‌గా ఐసీడీఎస్ పీడీ, సభ్యులుగా డీఎంహెచ్‌ఓ, స్థానిక ఎమ్మెల్యే, సంబంధిత సీడీపీఓ ఉంటారు. తనకు వివిధ పనులు ఉండడంతో అప్పటి కలెక్టర్ ముక్తేశ్వరరావు ఇంటర్వ్యూ నిర్వహించే బాధ్యత సంబంధిత ఆర్డీఓలకు అప్పగించారు. మునుగోడు, నకిరేకల్, మి ర్యాలగూడ, దేవరకొండ, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల పరిధిలో ఇంటర్వ్యూ నిర్వహించి దాదాపు 50 పోస్టులు మాత్రమే భర్తీ చేశారు.
మిగిలిన 13 ప్రాజెక్టుల్లో అసలు ఇంటర్వ్యూలే జరగకపోవడం గమనార్హం. నల్లగొండ, సూర్యాపేట ప్రాజెక్టుల్లో అభ్యర్థులను పలుమార్లు ఇంటర్వ్యూకి పిలిచారు. తీరా కేంద్రానికి చేరుకోగానే వాయిదా వేయడంతో అభ్యర్థులు తిరుగుముఖం పట్టారు. మెరిట్, ఇంటర్వ్యూ పద్ధతిలో తమవారికి పోస్టులు దక్కే అవకాశం లేకపోవడంతో వాయిదా వేయాలని ఆర్డీఓలపై ఎమ్మెల్యేలు ఒత్తిడి పెంచుతున్నారు. దీంతో చేసేదేమీ లేక అధికారులు వాయిదా వేస్తున్నారు. సార్వత్రిక ఎన్నికలు జరిగేవరకు అసలు ఇంటర్వ్యూలు నిర్వంచవద్దని జిల్లాకు చెందిన ఓ మంత్రి అధికారులను ఆదేశించినట్లు సమాచారం.
గతంలోనూ ఇంతే...
జీఓ విడుదల తర్వాత గతేడాది కూడా పోస్టుల భర్తీకి ఎమ్మెల్యేలు అడ్డుతగిలారు. గతేడాది 12 ప్రాజెక్టుల పరిధిలో మొత్తం 323 కార్యకర్తలు, ఆయాల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వేశారు. అయితే 4 ప్రాజెక్టుల పరిధిలో 27 పోస్టులు మాత్రమే భర్తీ చేశారు. ఇలా ఏళ్లుగా పోస్టులు భర్తీ చేయకపోవడంతో అభ్యర్థులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. అంతేగాక అంగన్‌వాడీ కేంద్రాలు అస్తవ్యస్తంగా తయారవుతున్నాయి. ఫలితంగా బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం అందడంలేదు.
మావోళ్లకే ఇయ్యి
Published Wed, Sep 4 2013 2:33 AM | Last Updated on Sat, Jun 2 2018 8:29 PM
Advertisement
Advertisement