గిరిజన ప్రాంతాల్లో ఉంచిన శిక్షణ పొందిన ఏనుగులు
మందస : జిల్లాలో ఏనుగుల తరలింపు ప్రక్రియను వీలైనంత త్వరగా ముగించడానికి అటవీశాధికారులు కొత్త పంథాను అవలంబిస్తున్నారు. ఇప్పటికే మందస మండలంలోని కొండలోగాం ప్రాంతానికి చేరుకున్న ఏనుగులకు ప్రశాంత వాతావరణం కల్పిస్తున్నారు. సీతంపేట, మెళియాపుట్టి మండలాల్లో జయంతి, వినాయక అనే ఏనుగులతో పాటు బాంబులను కూడా అధికారులు ఉపయోగించడంతో గజరాజులు భయభ్రాంతులకు గురయ్యాయి.
ఈ క్రమంలో మనుషుల్ని చంపేయడంతో పాటు పంటపొలాలను నాశనం చేశాయి. మందస సరిహద్దులోకి వచ్చేసరికి క్వారీ పేలుళ్లకు ఆటంకం కలిగించాయి. జీడి తోటల్లోనే తిష్ఠ వేశాయి. దీంతో అధికారులు పంథా మార్చారు. క్వారీ పేలుళ్లను నిలిపివేసేలా చర్యలు తీసుకున్నారు. కుంకీ ఏనుగులతో అటవీ ఏనుగులు సహవాసం చేయడంతో వాటిని మందస మండలంలో సంచరించే ప్రాంతాలకు తీసుకువస్తున్నారు.
ఇందుకోసం 42 నుంచి 44 మంది అటవీశాఖాధికారులు, సిబ్బంది అహర్నిశలు శ్రమిస్తున్నారు. గతంలో ఇవే ఏనుగులు మందస మండలంలోని పలు ప్రాంతాల్లో పంటలను నాశనం చేశాయి. ప్రజలను భయబ్రాంతులను చేయడంతో డిప్యూటీ రేంజ్ అధికారి పీవీ శాస్త్రి ఆధ్వర్యంలో ఒడిశా అడవులకు ఏనుగులు వెళ్లేలా చర్యలు తీసుకున్నారు. రెండు పర్యాయాలు ఏనుగులు వచ్చినప్పటికీ ఇదే పద్ధతి అవలంబించారు.
మళ్లీ ఇదే ప్రణాళికను డీఆర్వో సిద్ధం చేశారు. ఎలిఫేంట్ ట్రాకర్స్, అటవీశాఖ సిబ్బంది సంయుక్తంగా పంటలను నష్టం వాటిల్లకుండా, ప్రాణనష్టం జరుగకుండా ఏనుగులను ఒడిశా అభయారణ్యానికి వెళ్లేలా చర్యలు తీసుకుంటున్నారు.
మూడు దారుల్లో తరలింపు..
ఏనుగులు ఒడిశా అడవులకు తరలించడానికి అహర్నిశలు శ్రమిస్తున్నాం. సీసీఎఫ్ రాహుల్‌పాండే, డీఎఫ్‌ఓ సీహెచ్ శాంతిస్వరూప్, రేంజ్ అధికారి ఈతకోటి అరుణ్‌ప్రకాశ్ సూచనలు, సలహాలు ఎప్పటికప్పుడు తీసుకుంటున్నాం. మండలంలోని సాబకోట మీదుగా ఒకదారి, ఒడిశాలోని లావణ్యకోట నుంచి మరోదారి, నర్సింగపురం రిజర్వ్‌ఫారెస్ట్ మీదుగా ఇంకోదారిలో ఏనుగులు తరలించడానికి సిద్ధం చేశాం. మరో రెండు, మూడు రోజుల్లో ఏనుగుల తరలింపు పూర్తి చేస్తాం. ప్రజ లు అప్రమత్తంగా ఉండాలి. ఎటువంటి కవ్వింపు చర్యలకు పాల్పడవద్దు.
– పీవీ శాస్త్రి, డిప్యూటీ రేంజ్ అధికారి, మందస
Comments
Please login to add a commentAdd a comment