పార్వతీపురం మన్యం జిల్లాను వణికిస్తున్న ఏనుగులు
గజరాజుల దాడిలో ఇప్పటికే 11 మందికిపైగా మృత్యువాత
రూ.కోట్లలో పంట, ఆస్తి నష్టం
కర్ణాటక నుంచి కుంకీలను తీసుకువస్తామని హామీ ఇచ్చిన డిప్యూటీ సీఎం
సాక్షి, పార్వతీపురం మన్యం: కొన్నేళ్లుగా పార్వతీపురం మన్యం జిల్లాను కరి రాజులు వీడటం లేదు. ప్రస్తుతం జిల్లాలో 2 గుంపులు ఏనుగులు సంచరిస్తున్నాయి. ఇటీవల నిర్వహించిన సర్వేలో 11 వరకు గజరాజులు ఉన్నట్లు అధికారులు లెక్క తేల్చారు. ఏనుగుల కారణంగా ఇప్పటికే 12 మంది వరకు రైతులు, గిరిజనులు ప్రాణాలు కోల్పోయారు. రూ.6 కోట్ల మేర పంటలకు, ఇతర ఆస్తులకు ధ్వంసం వాటిల్లినట్లు అంచనా.
సరిహద్దులను దాటుకుంటూ ప్రవేశం..
ఆరేళ్ల క్రితం సరిహద్దులను దాటుకుంటూ జిల్లాలోకి ప్రవేశించాయి గజరాజులు. అప్పటి నుంచి ఎక్కడికక్కడ దాడులు చేస్తూ గిరిజనుల ప్రాణాలు తీస్తున్నాయి. పంటలు ధ్వంసం చేస్తున్నాయి. మరోవైపు ప్రమాదాల బారిన పడి గజరాజులూ మృత్యువాత పడుతున్నాయి.
గత జూన్‌లో గరుగుబిల్లి మండలం తోటపల్లి సరిహద్దుల్లో అనారోగ్యంతో ఓ ఆడ ఏనుగు మృతి చెందింది. కొద్దిరోజుల క్రితం కొమరాడ మండలం వన్నాం గ్రామానికి చెందిన వాన శివున్నాయుడు(62) అనే వృద్ధుడిని ఏనుగులు తొక్కి చంపాయి. ఏళ్లుగా అటు అమాయక గిరిజనులతో పాటు.. ఇటు ఏనుగుల ప్రాణాలూ పోతున్నా ఈ సమస్యకు పరిష్కారం లభించడం లేదు.
ఆహార అన్వేషణలో మృత్యువాత..
2018 సెప్టెంబరు 7న శ్రీకాకుళం జిల్లా నుంచి 8 ఏనుగుల గుంపు జియ్యమ్మవలస మండలంలోకి ప్రవేశించింది. అదే నెల 16న అర్తాం వద్ద విద్యుదాఘాతానికి గురై ఒక ఏనుగు ప్రాణాలు కోల్పోయింది. ఆ తర్వాత దుగ్గి సమీపంలోని నాగావళి ఊబిలో కూరుకుపోయి మరో ఏనుగు మృత్యువాత పడింది.
అంతకు ముందు 2010 నవంబర్‌లో అప్పటి శ్రీకాకుళం జిల్లాలోని వీరఘట్టం (ప్రస్తుతం పార్వతీపురం మన్యం జిల్లా) మండలం కుంబిడి ఇచ్ఛాపురంలో 2 ఏనుగులు మృతి చెందాయి. గతంలో సాలూరు మండలంలో ఏనుగు విద్యుదాఘాతానికి గురై ప్రాణాలు వదిలింది. కొన్నాళ్ల క్రితం “హరి’ అనే మగ ఏనుగు గుంపు నుంచి తప్పిపోయింది. నెలలు గడిచినా దాని జాడ తెలియరాలేదు. గుంపులో కలవలేదు.
గతేడాది మే లో జిల్లాలోని భామిని మండలం కాట్రగడ బీ వద్ద విద్యుదాఘాతంతో 4 ఏనుగులు మృత్యువాత పడ్డాయి. ఏనుగులు గుంపు ఇక్కడికి వచ్చిన తర్వాతే మరో 4 ఏనుగు పిల్లలకు జన్మనిచ్చినట్లు తెలుస్తోంది. ఆహార అన్వేషణలో భాగంగా అడవులను వదిలి, జనావాసాల మధ్యకు వస్తున్న ఏనుగులు.. విద్యుదాఘాతాలకు, రైతులు పంటల కోసం ఏర్పాటు చేసుకున్న రక్షణ కంచెలతో ప్రమాదవశాత్తు మృత్యువాత పడుతున్నాయి.
అటు ప్రాణ నష్టం..ఇటు పంట ధ్వంసం
ఏనుగులు దాడి చేయడంతో మనుషుల ప్రాణాలూ పోతున్నాయి. 2019 జనవరిలో కొమరాడ, జియ్యమ్మవలస మండలాలకు చెందిన నిమ్మక పకీరు, కాశన్నదొర ప్రాణాలు కోల్పోయారు. జిల్లాలో గజరాజుల ప్రవేశం నుంచి ఇప్పటి వరకు వాటి దాడిలో 11 మంది పైబడి మృతి చెందగా.. అనేక మంది గాయాలపాలయ్యారు. వేలాది ఎకరాల పంటలను ఇవి ధ్వంసం చేశాయి.
శ్రీకాకుళం జిల్లా నుంచి జిల్లాలోకి ప్రవేశించిన ఏనుగుల గుంపును ఒడిశా ప్రాంతానికి తరలించినా..తిరిగి జిల్లాకు చేరుకుని కొమరాడ, పార్వతీపురం , జియ్యమ్మవలస, భామిని, సీతంపేట, గరుగుబిల్లి తదితర ప్రాంతాల్లో సంచరిస్తున్నాయి. ఇటీవల జిల్లాలో సంచరిస్తున్న ఏనుగుల సంఖ్యను నిర్థారించేందుకు 3 రోజులపాటు అటవీ శాఖాధికారులు సర్వే చేపట్టారు. పార్వతీపురం డివిజన్ పరిధిలో ఏడు, పాలకొండ డివిజన్ పరిధిలో 4 ఏనుగులు తిరుగుతున్నట్లు గుర్తించారు.
జోన్‌తోనే సంరక్షణ!
కరిరాజులు ఆహారం, నీరు కోసం తరచూ జనావాసాల మధ్యకు వస్తున్నాయి. దీంతో గిరిజనుల పంటలు ధ్వంసం కావడంతో పాటు, పలువురు ఏనుగుల దాడిలో ప్రాణాలూ కోల్పోతున్నారు. ఇవి జనావాసాల మధ్యకు రాకుండా సాలూరులో జంతికొండ, కురుపాం పరిధిలోని జేకేపాడులో ఎలిఫెంట్ జోన్ ఏర్పాటుకు 2020 డిసెంబర్‌లో అటవీ శాఖ అధికారులు నిర్ణయించారు. జంతికొండలో 526 హెక్టార్లు, జేకే బ్లాక్‌లో 661 హెక్టార్లలో అటవీ భూమిని గుర్తించారు.
ఆ తర్వాత ఆ ప్రతిపాదన ముందుకు వెళ్లలేదు. తర్వాత కూడా ఏనుగుల సంరక్షణకు పార్వతీపురం మండలం డోకిశీల, చందలింగి, కొమరాడ మండలం పెదశాఖ, పాత మార్కొండపుట్టి ప్రాంతాలను పరిశీలించారు. చివరకు సీతానగరం మండలం జోగింపేట అడవులను ఏనుగుల పునరావస కేంద్రం కోసం ఎంపిక చేశారు. ఇప్పటి వరకూ ఏదీ కార్యరూపం దాల్చలేదు.
ఒడిశా నుంచి జిల్లాలోకి...
ఒడిశా రాష్ట్రం లఖేరి నుంచి తొలిసారిగా 1998 అక్టోబర్ 4న కురుపాం అటవీ ప్రాంతంలోకి ఏనుగులు ప్రవేశించాయి. వాటిని తరిమేసినా..1999 ఆగస్ట్‌లో కురుపాం, గుమ్మలక్ష్మీపురం కొండల్లోకి వచ్చాయి. మళ్లీ వాటిని వెనక్కి పంపారు. 2007–08 మధ్య గుమ్మలక్ష్మీపురం, కురుపాం, జియ్యమ్మవలస, సీతంపేట, వీరఘట్టం ప్రాంతాల్లో పంటలను తీవ్రంగా నష్టపరిచాయి.
ఆ సమయంలో వాటిని తరిమికొట్టేందుకు “ఆపరేషన్ గజ’ను చేపట్టారు. ఏనుగులకు మత్తు ఇంజెక్షన్లు ఇచ్చి ఒడిశా తరలిస్తుండగా రెండు మృతి చెందాయి. దీంతో ఆ ఆపరేషన్‌ను నిలిపివేశారు. అప్పట్లో ఉమ్మడి విజయనగరం– శ్రీకాకుళం జిల్లాల మధ్య ఎలిఫెంట్ జోన్ ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధం చేసినా గిరిజనుల వ్యతిరేకత నేపథ్యంలో నిలిచిపోయింది.
కుంకీలను పంపేందుకు ఉప ముఖ్యమంత్రి హామీ
చిత్తూరు, పార్వతీపురం మన్యం జిల్లాల్లో కరిరాజుల వల్ల జరుగుతున్న నష్టాన్ని నివారించడానికి కర్ణాటక నుంచి కుంకీలను తీసుకువచ్చేందుకు గత నెలలో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. అందులో భాగంగా జిల్లాకూ కుంకీలను పంపుతామని డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ హామీ ఇచ్చారు. కుంకీలు పూర్తి స్థాయిలో శిక్షణ పొందిన ఏనుగులు. ఇవి వస్తే ఇక్కడున్న ఏనుగులతో సహవాసం చేసి, వాటిని తమకు అనుకూలంగా మలుచుకుంటాయి.
జనారణ్యంలో తిరుగుతున్న గజరాజులను తిరిగి అరణ్యంలోకి వెళ్లేలా దిశానిర్దేశం చేస్తాయి. ఇదే సమయంలో కుంకీలను తీసుకువచ్చేందుకు జిల్లాలో అనువైన పరిస్థితులు లేవని అటవీ శాఖాధికారుల మాట. జిల్లాలో చిత్తూరు మాదిరి శిక్షణ పొందిన ఏనుగులను ఉంచేందుకు క్యాంపు లేదు. వాటి కోసం పని చేసేందుకు ప్రత్యేక సిబ్బంది లేరు. ఈ పరిస్థితుల్లో కుంకీల రాక ఉంటుందా, ఉండదా? అన్న సందేహాలు గిరిజన సంఘాల నుంచి నుంచి వ్యక్తమవుతున్నాయి.
కుంకీలను రప్పించాలి..
కర్ణాటక నుంచి కుంకీలను త్వరగా జిల్లాకు రప్పించి ఇక్కడున్న ఏనుగులను అడవికిగానీ, సంరక్షణ కేంద్రానికి గానీ తరలించాలి. చాలా ఏళ్లుగా ఏనుగులు ఇక్కడే తిష్ట వేశాయి. 11 మందికిపైగా మృత్యువాత పడ్డారు. రూ.6 కోట్ల మేర పంట, ఆస్తి నష్టం సంభవించాయి. ఏనుగుల వెంట అటవీ శాఖాధికారులు తిరగడమే తప్ప ప్రయోజనం ఏమీ ఉండటం లేదు.
– కొల్లి సాంబమూర్తి, సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు, పార్వతీపురం
రైతులు, గిరిజనులు భయపడుతున్నారు..
ఏనుగులు ఎప్పుడు ఏ ప్రాంతం మీద దాడి చేస్తున్నాయో అర్థం కావడం లేదు. అటవీ శాఖాధికారులు తిరగడం, ప్రభుత్వానికి నిధులు ఖర్చు తప్ప ప్రయోజనం ఉండటం లేదు. రైతులు, గిరిజనులు పొలాలకు, ఇతర పనులకు వెళ్లడానికి భయపడుతున్నారు. కుంకీ ఏనుగులను తెప్పిస్తామని ఉప ముఖ్యమంత్రి హామీ ఇచ్చి రెండు నెలలవుతున్నా.. ఇప్పటికీ ఆచరణలోకి రాలేదు. – హెచ్.రామారావు, గిరిజన సంఘం నాయకులు, పార్వతీపురం
Comments
Please login to add a commentAdd a comment