- ఏఐఎస్‌ఎఫ్ పిలుపు
విజయవాడ (గాంధీనగర్)
విద్య ప్రైవేటీకరణ, కాషాయీకరణను వ్యతిరేకించాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్య(ఏఐఎస్‌ఎఫ్) జాతీయ ప్రధాన కార్యదర్శి విశ్వజిత్‌కుమార్ విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఏఐఎస్‌ఎఫ్ 46వ రాష్ట్ర మహాసభలు విజయవాడలో శుక్రవారం ప్రారంభమయ్యాయి. మహాసభల తొలిరోజు విజయవాడ జింఖానా మైదానంలో జరిగిన బహిరంగ సభలో విశ్వజిత్ మాట్లాడారు.
బీజేపీ అధికారం చేపట్టిన తర్వాత ఆర్‌ఎస్‌ఎస్ భావజాలాన్ని విద్యావ్యవస్థపై రుద్దుతోందన్నారు. విశ్వవిద్యాలయాల్లోకి హిందుత్వశక్తులను చొప్పించి కలుషితం చేస్తున్నారన్నారు. కాషాయీకరణకు అనుకూలంగా వ్యవహరించేవారినే వైస్‌చాన్సలర్లుగా నియమిస్తోందన్నారు.
దేశ సమైక్యతకు విఘాతం కలిగించేశక్తులపై పోరాడాల్సిన బాధ్యత విద్యార్థులపై ఉందన్నారు. యూనివర్సిటీల్లో విద్యార్థి సంఘాల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్‌చేశారు. ఎన్నికలు నిర్వహిస్తే యూనివర్సిటీల్లో రాజకీయ నాయకుల ప్రమేయం తగ్గిపోతుందన్నారు. యువత రాజకీయాల్లో ప్రవేశించడం ద్వారా దేశానికి సరైన నాయకత్వం లభిస్తుందన్నారు.
ప్రభుత్వరంగంలో విద్యను బలోపేతం చేయాలన్నారు. ప్రైవేటు యూనివర్సిటీలు నెలకొల్పేందుకు అనుమతిస్తూ తీసుకున్ని నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్‌లో విద్యకు కేటాయిస్తున్న నిధులు పెంచాలని, యూనివర్సిటీలను ఆధునీకరించాలని డిమాండ్ చేశారు. అధ్యక్షుడు సయ్యద్ వలీ ఉల్లా ఖాద్రీ మాట్లాడుతూ నవసమాజ నిర్మాణానికి విద్యార్థులు నడుంబిగించాలన్నారు. సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి రోహిత్ మృతికి మతోన్మాద శక్తులే కారణమన్నారు.
చై.నా చేతుల్లోకి విద్యావ్యవస్థ
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యా వ్యవస్థను చై.నా( చైతన్య, నారాయణ) సంస్థల చేతుల్లో పెట్టారన్నారు. మంత్రి పి.నారాయణకు విద్యారంగాన్ని దోచుకోవడమే తప్ప ఇంకేమీ పట్టదన్నారు. ధనికులు మాత్రమే చదువుకొనేందుకు వీలుగా ప్రైవేటు యూనివర్సిటీల బిల్లును తెచ్చారన్నారు. ప్రభుత్వ నిర్ణయంతో ఎస్సీ, ఎస్టీలు, వెనుకబడిన వర్గాలు ఉన్నత విద్యకు దూరమయ్యే ప్రమాదం ముంచుకొస్తోందన్నారు.. ప్రభుత్వం ఓవైపు ప్రభుత్వ పాఠశాలలను మూసివేయిస్తూ, మరోవైపు ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలకు పరోక్షంగా ప్రోత్సాహకాలు అందిస్తోందన్నారు.
ఉద్యమాలు, పోరాటాల ద్వారా విద్యావ్యవస్థను పరిరక్షించుకోవాలని సూచించారు. నిరంతర పోరాటాలతో హక్కులు సాధించుకోవాలన్నారు. మహాసభలకు 13 జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు, విద్యార్థులు హాజరయ్యారు. తొలుత ఆత్మహత్య చేసుకున్న సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి వేముల రోహిత్‌కు నివాళులర్పించారు.