బ్రీత్‌ఎనలైజర్లు లేకుండా..ప్రమాదాల నివారణా?
విజయనగరం ఫోర్ట్: మద్యం మత్తులో వాహనాలు నడపడం వల్ల అధికప్రమాదాలు జరుగుతున్నాయిని భావించిన సర్కారు బ్రీత్ ఎనలైజర్ల ద్వారా డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించాలని రవాణాశాఖ అధికారులను ఆదేశించింది. అందుకు తగ్గ పరికరాల కొనుగోలుకు మాత్రం ప్రభుత్వం నిధులు విడుదల చేయడం లేదు.
జిల్లాలో ఐదుగురు వెహికల్ ఇన్‌స్పెక్టర్లు ఉన్నారు. ఒక్కొక్కరికీ ఒక్కో బ్రీత్ ఎనలైజర్ ఉండాలి. బ్రీత్ ఎనలైజరు ఖరీదు రూ.52వేలు. ఐదు ఎనలైజర్లను కొనుగోలు చేయడానికి నిధులు విడుదల చేయాలంటూ రవాణాశాఖాధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. బ్రీత్ ఎనలైజర్ల కొనుగోలుకు నిధులు లేవు. మీరే ఏదోవిధంగా కొను గోలు చేసుకోవాలని ప్రభుత్వం సెలవిచ్చినట్టు భోగట్టా. దీంతో బ్రీత్ ఎనలైజర్లు లేకుండా ప్రమాదాల నివారణ ఎలా సాధ్యమంటూ రవాణాశాఖ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. బ్రీత్ ఎనలైజరు ఏవిధంగా కొనుగోలు చేయాలనే అలోచనతో అష్టకష్టాలు పడి ఒక బ్రీత్ ఎనలైజరును కొనుగోలు చేశారు. ఇంకా నాలుగు బ్రీత్ ఎనలైజర్లు కొనుగోలు చేయాల్సి ఉంది. బ్రీత్‌ఎనలైజర్ ద్వారా డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తే మద్యం మత్తులో వాహనాలు నడిపే వారిని గుర్తించవచ్చు.
మద్యం తాగి పట్టుబడితే తొలిసారి రూ. 2వేలు, రెండోసారి రూ. 3వేలు అపరాధ రుసుం విధిస్తారు. దీని ద్వారా కూడా ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. అన్నింటికంటే ముఖ్యంగా రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయి. అయినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోకపోవడం విశేషం. ఇదే విషయాన్ని ఇన్‌చార్జ్ ఆర్టీఓ శివప్రసాద్‌రావు వద్దప్రస్తావించగా బ్రీత్‌ఎనలైజర్స్ కొనుగోలుకు ప్రభుత్వం నిధులు విడుదల చేయని మాటవాస్తవమేనని అంగీకరించారు.