సాక్షి, అనంతపురం : పగలు.. రాత్రి రహదారులను శుభ్రం చేసే శ్రమజీవులు వారు. కాలువల్లోని మురుగును తీయడం.. ఇంటింటికీ వెళ్లి చెత్త సేకరించడం వంటి కీలక విధులు నిర్వహిస్తుంటారు. అలాంటి కార్మికులపై పురపాలికలు, నగర పంచాయతీలు శీతకన్ను వేస్తున్నాయి. వారి జీతాలను పెంచుతూ ఉత్తర్వు జారీ అయినా కొన్ని చోట్ల దానిని అమలులో పెట్టడంలో అధికారులు విఫలమయ్యారు.
వివరాల్లోకి వెళితే.. పురపాలిక, నగర పంచాయతీల్లో పనిచేసే తాత్కాలిక పారిశుధ్య కార్మికులకు నెలకు రూ.6,700 జీతం ఇవ్వాలన్న నిబంధన గతంలో ఉండేది. అయితే పెరిగిన నిత్యావసర సరుకుల ధరలకు అనుగుణంగా జీతాలు పెంచాల్సిందేనంటూ సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపట్టడంతో ప్రభుత్వం దిగివచ్చింది. నగర పంచాయతీల్లో కార్మికులకు రూ.7,300, పురపాలికల్లో రూ.8300 ఇవ్వాలని ఈ ఏడాది ఫిబ్రవరి 22న అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఉత్తర్వు జారీ చేసింది. కొత్త వేతనాలు ఆ మరుసటి రోజు నుంచే అమలులోకి వస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొంది.
ఆరుచోట్ల మాత్రమే అమలు
జిల్లాలో ఒక కార్పొరేషన్, ఎనిమిది మునిసిపాలిటీలు, మూడు నగర పంచాయతీలు ఉన్నాయి. ఇందులో గుంతకల్లు మునిసిపాలిటీలో 216 మంది కార్మికులకు, తాడిపత్రిలో 256, ధర్మవరంలో 216, రాయదుర్గంలో 123, కళ్యాణదుర్గంలో 61 మంది కార్మికులతో పాటు పుట్టపర్తి నగర పంచాయతీలోని 81 మంది కార్మికులకు మాత్రమే కొత్త వేతనాలను తాత్కాలిక కార్మికులకు ఇస్తున్నారు. అనంతపురం కార్పొరేషన్‌లోని 718 మంది, హిందూపురంలో 328, కదిరిలో 210, గుత్తిలో 65, పామిడిలో 43, మడకశిరలో పనిచేస్తున్న 19 మంది కార్మికులకు కొత్త వేతనాలు ఇంకా ఇవ్వడం లేదు.
కార్మికుల కష్టాలు
అనంతపురం కార్పొరేషన్‌లో ఇంత వరకు పెంచిన జీతాలు ఇవ్వకపోవడంతో కార్మికులు కష్టాలు పడుతున్నారు. గుత్తి మునిసిపాలిటీగా ఏర్పడి మూడు సంవత్సరాలు పూర్తయినా ఇంకా సమస్యల చట్రం నుంచి బయట పడలేదు. ఇక్కడ కార్మికులకు తొలి నుంచి ఒక నెల జీతం ఇస్తే.. మరో నెల బకాయి పెట్టడం ఆనవాయితీగా వస్తోంది. ఈ మునిసిపాలిటీలో జూన్ మాసానికి సంబంధించిన జీతం ఇంత వరకు ఇవ్వకపోవడంతో కార్మికులు ఇబ్బంది పడుతున్నారు. హిందూపురంలో గత నెల కార్మికులు ఆందోళన చేసినా అధికారుల్లో చలనం లేదు. కదిరి మునిసిపాలిటీలో ఈ ఏడాది ఏప్రిల్ నుంచి పాత వేతనాలే ఇవ్వకపోవడం శోచనీయం. మడకశిర నగర పంచాయతీలోనూ రెండు నెలలుగా జీతాలే అందకపోతుండగా కొత్తవి అందని ద్రాక్షగానే మారాయని కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేవుడు వరమిచ్చినా పూజారి కనికరించని చందంగా గత ప్రభుత్వం జీతాలు పెంచుతూ జీవో జారీ చేసినా స్థానిక అధికారులు దాన్ని అమలు చేయకపోవడంపై కార్మికుల్లో ఆగ్రహం వ్యక్తమౌతోంది. మరో రెండు..మూడు రోజుల్లో జిల్లా వ్యాప్తంగా కార్మికులు ధర్నాలు చేపట్టి నిరసన తెలపాలని, కొత్త ప్రభుత్వం దిగిరాకపోతే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని కార్మికులు అంటున్నారు.
కౌన్సిల్ ముందు పెడుతున్నాం
కార్పొరేషన్‌లో పెంచిన వేతనాలను కార్మికులకు చెల్లించడం లేదు. అయితే ప్రస్తుతం పాలకవర్గం రావడంతో ఆ ప్రతిపాదనను కౌన్సిల్ ముందు పెట్టి.. వారి అనుమతితో త్వరలోనే మంజూరు చేస్తాం. మంజూరు చేసేటపుడు కూడా ఫిబ్రవరి మాసం నుంచి కలుపుకుని అరియర్స్ సహా అందించడానికి చర్యలు తీసుకుంటున్నాం.
-చంద్రమౌళీశ్వరరెడ్డి, కమిషనర్, అనంతపురం కార్పొరేషన్
ఉత్తర్వులే!
Published Wed, Jul 16 2014 2:33 AM | Last Updated on Sat, Sep 2 2017 10:20 AM
Advertisement
Advertisement