'లగడపాటి అసలు స్వరూపం బయటపడింది'
విశాఖ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే వరద బాధిత ప్రజలకు పూర్తి న్యాయం చేస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత కొణతాల రామకృష్ణ హామీ ఇచ్చారు. ఆయన సోమవారమిక్కడ మాట్లాడుతూ సమైక్య శంఖారావం సభ విజయవంతం కావటంతో... కాంగ్రెస్, టీడీపీలు ఎందుకు బాధపడుతున్నాయని ప్రశ్నించారు. వారు సమైక్యవాదులేనా అన్న అనుమానం కలుగుతుందని కొణతాల అన్నారు. లగడపాటి రాజగోపాల్ అసలు స్వరూపం ఏమిటో మీడియాపై ధ్వజమెత్తిన తీరు అద్ధం పడుతుందని ఆయన వ్యాఖ్యానించారు.
విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ఆదివారంనాడు ‘సాక్షి’పై తన అక్కసును మరోసారి వెళ్లగక్కారు. పత్రికల్లో రాయలేని భాషను ఉపయోగిస్తూ సాక్షి ప్రతినిధులను దూషించారు. మీదమీదకు వస్తూ వీధి రౌడీలా ప్రవర్తించారు. అడ్డుకోబోయిన ఇతర పాత్రికేయులనూ వదల్లేదు. బూతు పంచాంగం వినిపించి సంస్కార హీనంగా ప్రవర్తించారు. లగడపాటి తిట్ల దండకం విన్న మీడియా ప్రతినిధులు విస్తుపోయారు.