వంద రోజుల పాలనలో ఒరిగిందేమిటి?
నరసన్నపేట : రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం 100 రోజుల పాలనలో సాధించిందేమిట ని వైఎస్సార్‌సీపీ బీసీ సెల్ రాష్ట్ర కన్వీనర్, మాజీ ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ ప్రశ్నించారు. మంగళవారం నరసన్నపేటలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రమాణ స్వీకారం రోజు..అట్టహాసంగా సంతకాలు చేసిన వాటిని సైతం..సీఎం అమలు చేయలేకపోయార ని దుయ్యబట్టారు. శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి.. వంశధార రెండో దశకు, కరకట్టల నిర్మాణానికి, ఎత్తపోతల పథకాలకు, రుణమాఫీకి నిధులు కేటాయించకపోవడం దారుణమన్నారు. నిరుద్యోగ భృతి ఏమైందని ప్రశ్నించారు. నరసన్నపేటలో.. అప్పట్లో చంద్రబాబు ప్రారంభించిన ఆస్పత్రి ప్రమాదకర స్థితికి చేరుకుందన్నారు.
జిల్లా మంత్రి కక్ష సాధింపు చర్యలకు పరిమితమవుతున్నారు తప్ప.. అభివృద్ధిపై దృష్టి సారించడం లేదని మండిపడ్డారు. ఆక్రమణల తొలగింపు ముసుగు లో ఒక వర్గం మనుషుల కట్టడాలను మాత్రమే కూల్చివేస్తున్నారన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌లో స్పష్టత లేకపోవడంతో.. పిల్లల భవిష్యత్తు అగమ్య గోచరంగా తయారైందన్నారు. రుణమాఫీ ఫైల్ సంతకానికి పరిమితమైందని..వడ్డీ భారం ఎవరు చెల్లిస్తారని..నిలదీశారు. ఈ సమావేశంలో పీఏసీఎస్ అధ్యక్షుడు సురంగి నర్సింగరావు, పార్టీ నాయకులు ఆరంగి మురళీధర్, సాసుపల్లి కృష్ణబాబు, రాజాపు అప్పన్న తదితరులు పాల్గొన్నారు.